ఉద‌య‌నిధితో సంబంధం-ఖండించిన న‌టి

చెన్నైలో నిర్వహించిన ఫార్ములా-4 కార్ రేస్‌తో త‌న‌కు సంబంధం ఉంద‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను న‌టి నివేదా పేతురాజ్ ఖండించింది

  • By: Somu    latest    Mar 06, 2024 12:49 PM IST
ఉద‌య‌నిధితో సంబంధం-ఖండించిన న‌టి

చెన్నైలో నిర్వహించిన ఫార్ములా-4 కార్ రేస్‌తో త‌న‌కు సంబంధం ఉంద‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను న‌టి నివేదా పేతురాజ్ ఖండించింది. ప‌లు త‌మిళ‌, తెలుగు చిత్రాల‌లో నటించి పేరు తెచ్చుకున్న ఈ న‌టి త‌న‌పై డ‌బ్బు విచ్చ‌ల‌విడిగా ఖర్చు చేయ‌బ‌డింద‌నే ఆరోప‌ణ‌ను తిప్పికొట్టింది.


టిక్‌-టిక్‌-టిక్‌, సంగ‌త‌మిళ‌న్ లాంటి త‌మిళ చిత్రాలు, చిత్ర‌ల‌హ‌రి, అల వైకుంఠ‌పురంలో, రెడ్, పాగ‌ల్‌, విరాట‌ప‌ర్వం వంటి తెలుగు చిత్రాల‌లో న‌టించిన నివేదా మంచి న‌టి అనిపించుకుంది. సామాజిక మాధ్య‌మాల‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ప్ర‌కారం, ఒక స‌ర్టిఫైడ్ రేస‌ర్ కూడా అయిన నివేదా, చెన్నైలో ఫార్ములా-4 నైట్ రేస్‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. స‌వుక్కు శంక‌ర్ అనే యూట్యూబ‌ర్ ఇంకో అడుగు ముందుకేసి, త‌మిళ‌నాడు క్రీడా మంత్రి, న‌టుడు అయిన ఉద‌య‌నిధి స్టాలిన్ ఈ న‌టి కోసం దుబాయ్‌లో ఒక ఇల్లు కూడా కొన్నాడ‌ని పేర్కొన్నాడు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య సంబంధం ఉంద‌ని ఆరోపించాడు.

ఈ వివాదాల‌పై తొలిసారిగా న‌టి నివేదా ఎక్స్ వేదిక‌గా స్పందించింది. “నాపై డ‌బ్బు విరివిగా ఖ‌ర్చు చేయ‌బ‌డింద‌ని త‌ప్పుడు వార్త‌లు ఇటీవ‌ల విస్తృతంగా వెలువ‌డ్డాయి. నిరాధార‌మైన వార్త‌ల‌ను ప‌రిశీలించ‌కుండా ఇవి రాసేవాళ్ల‌కు ఒక అమ్మాయి జీవితాన్ని నాశ‌నం చేసేముందు క‌నీస మాన‌వ‌త్వం ఉంటుంద‌ని న‌మ్మి నేను మౌనంగా ఉన్నాను. నేను, నా కుటుంబం కొద్ది రోజులుగా విప‌రీత‌మైన ఒత్తిడిలో ఉన్నాము. త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేసేముందు కొంచెం ఆలోచించండి” అన్న‌ నివేదా, త‌న నేప‌థ్యం గురించి కూడా వివ‌రించింది. “నేను చాలా గౌర‌వ‌ప్ర‌ద‌మైన కుటుంబం నుంచి వ‌చ్చాను.


ప‌ద‌హారేళ్ల వ‌య‌సు నుండే నేను ఆర్థికంగా స్వ‌తంత్రంగా, స్థిరంగా ఉన్నాను. గ‌త ఇర‌వై యేళ్ల నుండి నా కుటుంబం దుబాయ్‌లోనే నివ‌సిస్తోంది. అలాగే న‌న్ను సినిమాల్లోకి తీసుకోమ‌ని కానీ, నాకు మ‌రిన్ని అవ‌కాశాలిమ్మ‌ని గానీ, ఏ హీరోను గానీ, ద‌ర్శ‌కుడిని గానీ, నిర్మాత‌ను గానీ అడ‌గ‌లేదు. నేను న‌టించిన సినిమాల‌న్నీ న‌న్ను వెతుక్కుంటూ వ‌చ్చిన‌వే. డ‌బ్బు కోస‌మో, సినిమా అవ‌కాశాల‌కోస‌మో నేనెప్ప‌డూ క‌క్కుర్తి ప‌డ‌లేదు”. అంటూ, “నాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌న్నీ త‌ప్ప‌డు వార్త‌ల‌ని నేను నిక్క‌చ్చిగా చెప్ప‌గ‌ల‌ను. నా కుటుంబం 2002నుండీ దుబాయ్‌లో అద్దెకుంటోంది.


రేసింగ్ అంటే నాకు ప్రాణం. కానీ, చెన్నైలోని రేస్ గురించి నాకు అస‌లు తెలియ‌దు. నేను చాలా సాధార‌ణ జీవితం గ‌డిపే అమ్మాయిని. ఎన్నో ఇబ్బందులు, క‌ష్టాల తర్వాత మీ కుటుంబంలోని అమ్మాయిలు ఉండాల‌నుకునే హుందా అయిన‌, ప్ర‌శాంత‌మైన జీవ‌నం గ‌డుపుతున్నాను” అని చెప్పింది. చివ‌రిగా, ఈ వార్త‌ల‌ను ప్ర‌చారం చేసిన వారిపై త‌ను ఎటువంటి న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని అనుకోవ‌డంలేద‌ని, జ‌ర్న‌లిజంలో ఇంకా మాన‌వ‌త్వం మిగిలేఉంద‌ని న‌మ్ముతున్నానని తెలిపింది.