అదానీ, అంబానీలు ఎంత నష్టపోయారో తెలుసా..
-ప్రపంచ కుబేరుల్లో నెంబర్ 2 నుంచి 29కి పడిపోయిన గౌతమ్ అదానీ విధాత: ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా ప్రపంచ కుబేరులలో అత్యధికంగా సంపదను కోల్పోయినవారిలో ముందు గౌతమ్ అదానీ (GOUTHAM ADANI), ఆ తర్వాత ముకేశ్ అంబానీ (MUKESH AMBANI)లే ఉన్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ (BLOOMBERG BILLIONAIRES INDEX) తాజా వివరాల ప్రకారం ఈ ఇరువురు భారతీయ కుబేరుల సంపద జనవరి 1 నుంచి 83 బిలియన్ డాలర్లపైనే హరించుకుపోయింది. గౌతమ్ అదానీ వ్యక్తిగత […]

-ప్రపంచ కుబేరుల్లో నెంబర్ 2 నుంచి 29కి పడిపోయిన గౌతమ్ అదానీ
విధాత: ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా ప్రపంచ కుబేరులలో అత్యధికంగా సంపదను కోల్పోయినవారిలో ముందు గౌతమ్ అదానీ (GOUTHAM ADANI), ఆ తర్వాత ముకేశ్ అంబానీ (MUKESH AMBANI)లే ఉన్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ (BLOOMBERG BILLIONAIRES INDEX) తాజా వివరాల ప్రకారం ఈ ఇరువురు భారతీయ కుబేరుల సంపద జనవరి 1 నుంచి 83 బిలియన్ డాలర్లపైనే హరించుకుపోయింది.
గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 78 బిలియన్ డాలర్లు క్షీణించగా, ముకేశ్ అంబానీది 5 బిలియన్ డాలర్లు పడిపోయింది. నిరుడు అదానీ ప్రపంచ సంపన్నులలో రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఏండ్ల తరబడి భారత్‌లో అత్యంత ధనికుడిగా ఉన్న ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి అదానీ ఈ ఘనతను సాధించారు. ఇంకా చెప్పాలంటే ముకేశ్ అంబానీ సైతం టాప్-10 ర్యాంకుల్లో ఎప్పుడూ చేరుకోని స్థానాన్నే అదానీ కైవసం చేసుకున్నారు.
అయితే గత నెల 24న అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ (HINDENBURG) రిపోర్టు వచ్చిన దగ్గర్నుంచి అదానీ సంపద కరిగిపోవడం మొదలైంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ (ADANI GROUP) సంస్థల మార్కెట్ విలువ ఈ నెల రోజుల్లోనే 142 బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది. దీంతో అదానీ వ్యక్తిగత సంపద కూడా పడిపోగా, ప్రస్తుతం 42.7 బిలియన్ డాలర్లతో ప్రపంచ సంపన్నులలో 29వ స్థానంలో ఉన్నారు.
మరోవైపు 81.5 బిలియన్ డాలర్లతో ముకేశ్ అంబానీ ప్రపంచ స్థాయిలో 12వ స్థానంలో కొనసాగుతున్నారు. భారత్‌లో మాత్రం నెంబర్ 1గా ఉన్నారు. ఆసియా సంపన్నుల్లోనూ అంబానీదే అగ్రస్థానం. అదానీ స్టాక్స్‌లో అవకతవకలు జరిగాయని హిండెనబర్గ్ ఆరోపించినది తెలిసిందే.
అప్పట్నుంచి అదానీకి చెందిన 10 కంపెనీల షేర్లు మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ ప్రభావం మొత్తం దేశీయ స్టాక్ మార్కెట్లపైనే పడుతుండగా, సహజంగానే రిలయన్స్ షేర్లూ నష్టపోయి అంబానీ సంపద కూడా తరిగిపోతున్నది.