Adilabad | ఎమ్మెల్యేలకు నిరసన సెగ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘వరద’ ప్రభావం!
Adilabad విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు మూలంగా వాగులు వంకలు, నదులు, ఉధృతంగా ప్రవహించడంతో వాగులపై వాగులపై వంతెనలు లేక లోతట్టు గ్రామాల ప్రజలు రోజుల తరబడి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో నదులు ఉప్పొంగి, ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో వేలాది ఎకరాల పంట పొలాలతో పాటు పట్టణంలోని పలు కాలనీలు బ్యాక్‌వాటర్ వరద నీటితో జలదిగ్బంధమయ్యాయి. రెండు […]

Adilabad
విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు మూలంగా వాగులు వంకలు, నదులు, ఉధృతంగా ప్రవహించడంతో వాగులపై వాగులపై వంతెనలు లేక లోతట్టు గ్రామాల ప్రజలు రోజుల తరబడి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో నదులు ఉప్పొంగి, ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో వేలాది ఎకరాల పంట పొలాలతో పాటు పట్టణంలోని పలు కాలనీలు బ్యాక్‌వాటర్ వరద నీటితో జలదిగ్బంధమయ్యాయి.
రెండు నుండి మూడు అంతస్తుల ఇళ్లు కూడా వరద నీటిలో ముంపునకు గురయ్యాయి. ముంపు బాధితులు, పంట దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయడంతో అధికార పార్టీ నాయకులు తలలు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మూలంగా ఎన్టీఆర్ కాలనీ, ఎల్ఐసి కాలనీ, రామ్ నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల ముంపు బాధితులు ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటిని ముట్టడించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా వరద నీరు ఇంట్లోకి వచ్చి పెద్ద మొత్తంలో నష్టపోతున్నామని వాపోయారు. ముంపు వరద నీరు రాకుండా కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యేను నిలదీశారు. అలాగే చెన్నూరు నియోజవర్గంలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా పరామర్శ సందర్భంగా నిరసన సెగ ఎదుర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయినప్పటి నుండి తమకు ప్రతి సంవత్సరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపును ఎదుర్కొంటున్నామని, వేల రూపాయలు అప్పులు తెచ్చి వేసిన పంటలు మునిగిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని తెలిపారు. ఇంత నష్టం జరిగినా ఇంత వరకూ రూపాయి పరిహారం కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి పరివాహక పంటలు దెబ్బతిన్న భూములను ముంపు ప్రాంతంగా ప్రకటించి నష్ట పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు.
పశ్చిమ ప్రాంతంలో సైతం ఎమ్మెల్యేలకు మంత్రులకు ముంపు ప్రాంత ప్రజల నుండి నిలదీత తప్పలేదు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం నందిగాం గ్రామానికి వెళ్లిన ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. గ్రామ సందర్శనకు వెళ్ళిన ఎమ్మెల్యే ముందు గ్రామ ప్రజలు సమస్యలను ఎకరువు పెట్టారు. సమస్యలను త్వరలో పరిష్కరిస్తారని చెప్పడంతో మరింత రెచ్చిపోయిన గ్రామస్తులు.. తొమ్మిది ఏళ్ల నుండి ఏం చేశావని నిలదీశారు. ఎన్నికలు వస్తేనే మేము గుర్తొస్తామా? అని ప్రశ్నించారు. చేసేదేమీ లేక ఎమ్మెల్యే ఇంటిముఖం పట్టారు.
కడెం ప్రాజెక్టు కు భారీ వరద చేరిన నేపథ్యంలో గేట్ల పైనుండి వరద నీరు వెళ్లడంతో ప్రాజెక్టు ప్రమాదకర స్థితికి చేరిన నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులతో సమీక్ష చేయడానికి వచ్చిన మంత్రిని, ఎమ్మెల్యే రేఖానాయక్‌ను ఘెరావ్ చేశారు. రెండేళ్ల నుండి ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మీ నిర్లక్ష్యమే మా కన్నీళ్లకు కారణమని మంత్రిపై మండిపడ్డారు.
ముంపు ప్రాంతాల ప్రజల ఆక్రందన.. ప్రశ్నించడం వరకే ఆగిపోతుందా? లేక రాబోయే ఎన్నికల్లో వారి ప్రతాపం చూపిస్తారా? అనేది ప్రజా ప్రతినిధుల్లో టెన్షన్ కలిగిస్తున్నది. అసలే ఇది ఎన్నికల సంవత్సరం. నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ముంపు బాధితుల కోపాగ్నికి కొందరు ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదని స్థానికులు చర్చించుకుంటున్నారు.