ఏప్రిల్1 తర్వాత.. ఆ వాహనాలన్నీ ఇక తుక్కుకే!
విధాత: ఏప్రిల్ 1 తర్వాత 15 ఏండ్లు నిండిన వాహనాలన్నీ తుక్కు కింద జమేనన్న కేంద్ర ప్రభుత్వ విధానం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. వ్యక్తిగత వాహనాలకు కొంత మినహాయింపు ఇచ్చినట్లు కనిపిస్తున్నా, ఫిట్‌నెస్ తప్పనిసరి అన్న నిబంధన వాహనదారులకు గుదిబండ కానున్నది. ఈ నిబంధనతో వాహనాలన్నీ తుక్కుకింద గార్బేజీకి చేరేట్లు చేస్తారని అంటున్నారు. 2021-22 బడ్జెట్ సందర్భంగా.. తీసుకొచ్చిన ఈ నిబంధన 2022 ఏప్రిల్ 1నుంచి అమలులో ఉన్నట్లుగా చెప్తున్నారు. ప్రాథమిక రిజిస్ట్రేషన్ పొందిన కాలం […]

విధాత: ఏప్రిల్ 1 తర్వాత 15 ఏండ్లు నిండిన వాహనాలన్నీ తుక్కు కింద జమేనన్న కేంద్ర ప్రభుత్వ విధానం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. వ్యక్తిగత వాహనాలకు కొంత మినహాయింపు ఇచ్చినట్లు కనిపిస్తున్నా, ఫిట్‌నెస్ తప్పనిసరి అన్న నిబంధన వాహనదారులకు గుదిబండ కానున్నది. ఈ నిబంధనతో వాహనాలన్నీ తుక్కుకింద గార్బేజీకి చేరేట్లు చేస్తారని అంటున్నారు.
2021-22 బడ్జెట్ సందర్భంగా.. తీసుకొచ్చిన ఈ నిబంధన 2022 ఏప్రిల్ 1నుంచి అమలులో ఉన్నట్లుగా చెప్తున్నారు. ప్రాథమిక రిజిస్ట్రేషన్ పొందిన కాలం నుంచి 15 ఏండ్లు గణించి ఆ వాహనాన్ని అన్‌ఫిట్‌గా పరిగణించి, ఆ వాహన రిజిస్ట్రేషన్‌ను ఉపసంహరిస్తారు. దీంతో ఆ వాహనం రోడ్డెక్కటానికి అవకాశం ఉండదు.
15 ఏండ్లు పూర్తయిన ప్రతి వాహనం ఇక తుక్కుగా మారాల్సిందే. అయితే.. వ్యక్తిగత వాహనాలకు 20 ఏండ్లు, వాణిజ్య వాహనాలకు 15 ఏండ్లుగా లైఫ్ పీరియడ్ నిర్ణయించారు. ఈ వాహనాలకు సామర్థ్య పరీక్ష తప్పనిసరి. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉంటేనే రోడ్డు మీద నడవాలి.
ఈ నిబంధనే ప్రైవేటు వాహనాలతో పాటు, ప్రభుత్వ వాహనాలకు కూడా వర్తిస్తుందని చెప్పినా.. సైన్యం, శాంతి భద్రతలు, అంతర్గత భద్రత లాంటి అత్యవసర సర్వీసుల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ఈ లెక్కన ఏవో కొన్ని ప్రభుత్వ వాహనాలను చూపి, ప్రైవేటుపై గురి పెట్టినట్లుగా అనిపిస్తున్నది.
ఉద్యోగ, మధ్యతరగతి జీవులు తమ కుటుంబ అవసరాల కోసం సొంత వాహనం తీసుకుంటే దాని వినియో గం చాలా తక్కువగా ఉంటుంది. పండుగలకు, పబ్బాలకే బయటకు తీస్తారు. అలాంటి వాహనం కూడా 15 ఏండ్లు దాటితే తుక్కు అంటే ఎలా? అని సగటు జీవులు వాపోతున్నారు.
ఈ విధానంతో పాలకులు ఏం సాధించ దల్చుకున్నారో స్పష్టత లేదు. కానీ దేశంలో ప్రతి 150 కిలోమీటర్ల కు ఒక తుక్కు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు ప్రకటిస్తున్నారు! ఇప్పటికే అనేక రూపాల్లో అభివృద్ధి చెందిన దేశాలకు మన దేశం డంప్ యార్డ్ గా మారిపోయిందన్న విమర్శలున్నాయి. అమెరికా, అభివృద్ధి చెందిన యూరప్ దేశాల నుంచి రోజుకు లక్షల టన్నుల కంప్యూటర్ వేస్టేజ్ (తుక్కు) ఇండియాకు చేరుకుంటున్న దాఖలాలున్నాయి. దీనికి ఇప్పుడు వాహనాల తుక్కు తోడవుతున్నది.
వాయు కాలుష్యానికి అనేక కారణాలకు తోడు వాహనాలు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది రోడ్డు నాణ్యత, ఇంధన నాణ్యత, డ్రైవర్ నైపుణ్యం తదితరాలపై ఆధార పడి ఉంటుంది. కాబట్టి 15 ఏండ్లు నిండిన వాహనాలను రద్దు చేసినంత మాత్రాన గాలి కాలుష్యం తగ్గుతుందని అనుకోలేం. కాబట్టి వాహనాల రద్దు వెనుక వాహన ఉత్పత్తిదారుల వ్యాపార ప్రయోజనాలున్నాయా అనే అనుమానాలు న్నాయి.