ప్రపంచంలోనే తొలి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎంట్రీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వచ్చిన తర్వాత సాంకేతిక రంగంలో క్షణ క్షణం ఎన్నో మార్పులు వస్తున్నాయి. క్లిష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా కొత్త యాప్స్, టూల్స్ పుట్టుకొస్తున్నాయి

వాషింగ్ టన్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వచ్చిన తర్వాత సాంకేతిక రంగంలో క్షణ క్షణం ఎన్నో మార్పులు వస్తున్నాయి. క్లిష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా కొత్త యాప్స్, టూల్స్ పుట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలైతే హ్యూమనాయిడ్ రోబోలను కూడా సిద్ధం చేశాయి. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన కాగ్నిషన్ అనే స్టార్టప్ సంస్థ ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను తయారు చేయడం ద్వారా సరికొత్త సంచలనానికి పునాది వేసింది. దీనికి డెవిన్ అనే పేరు పెట్టారు. ఇది వెబ్‌సైట్, వీడియోలను రూపొందించేందుకు కోడ్స్ రాయగలదు, డీబగ్ చేయగలదు. ఒక్క సింగిల్ కమాండ్ ఆధారంగా ఇది కోడ్స్ రాయడం, వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం వంటి నైపుణ్యాలను ఈ ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కలిగి ఉంటుంది. ఏపని చెప్పినా క్షణాల్లో చేసి పెట్టగలదు. బగ్స్‌ను వెంటనే గుర్తించి, వాటిని త్వరగా సరిదిద్దగలుగుతుంది. కోడింగ్ విషయంలో సూచనలు చేస్తుంది. కొన్ని టాస్క్‌లను తానే స్వయంగా పూర్తి చేయగలదు. ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టును తానే స్వయంగా కంప్లీట్ చేయగలుగుతుంది. దీనికి సొంత కమాండ్ లైన్, కోడ్ ఎడిటర్, బ్రౌజర్ అమర్చి ఉంటాయి. వీటి సహాయంతో డెవిన్ స్వతంత్రంగా పని చేస్తుంది.
అయితే.. మానవ ఇంజినీర్లను రీప్లేస్ చేసే ఉద్దేశంతో దీనిని తయారు చేయలేదని, మనుషులతో కలిసి పనిచేసే విధంగా ఈ డెవిన్‌ను డిజైన్ చేశామని కాగ్నిషన్ క్లారిటీ ఇచ్చింది. ఈ డెవిన్.. ప్రముఖ ఏఐ కంపెనీల ప్రాక్టికల్ ఇంజినీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తిచేసిందని కంపెనీ తెలిపింది. ముందస్తుగా ఆలోచించడం, సంక్లిష్ట టాస్క్‌లను ప్లాన్ చేయడం వంటి అద్భుత సామర్థ్యాలను ఇది కలిగి ఉందని చెప్పింది. ఇది వేల నిర్ణయాలు తీసుకుంటుందని, అలాగే తన తప్పుల నుంచి నేర్చుకుంటుందని వెల్లడించింది. అయితే.. ఒక ఏఐని ప్రోగ్రామర్‌గా బోధించడం అనేది లోతైన అల్గారిథమిక్ ప్రాబ్లమ్ అని, ఇది భవిష్యత్తులో ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటుందనే దానిపై దశలవారీగా పరిశీలించాల్సి ఉంటుందని కాగ్నిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.