ఏఐ చాట్‌బాట్‌ను పరిచయం చేసిన ఎలాన్ మస్క్ కంపెనీ..! ఎక్స్ ప్రీమియం ప్లస్ యూజర్లకు యాక్సెస్..!

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దిగ్గజ కంపెనీలన్నీ కృత్రిమమేథ (AI)పై పని చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు చాట్‌బాట్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, రాబోయే కాలంలో ఏఐ మనవాళికి ఎంతో సహాయకరంగా మారుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఎక్స్‌ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
దీనికి గ్రోక్‌గా నామకరణం చేసింది. ప్రస్తుతం ఉన్న ఏఐ చాట్‌బాట్‌ల కంటే మరింత సమర్థవంతంగా తమ గ్రోక్ చాట్‌బాట్ ఎక్స్ కంపెనీ పేర్కొంది. గతేడాది విడుదలైన చాట్ జీపీటీ ప్రంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే పలు కంపెనీలు సైతం చాట్‌బాట్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎలాన్ మస్క్ కంపెనీ కేవలం ఎనిమిది నెలల్లోనే ఏఐ చాట్‌బాట్‌ను ఆవిష్కరించింది. మానవాళికి పరిశోధనలు, ఆవిష్కరణల సామర్థ్యంతో ఏఐ టూల్‌ని అందించాలనే లక్ష్యంతో చాట్‌బాట్‌ను రూపొందించినట్లు ఎక్స్‌ఏఐ తెలిపింది. గతంలో వచ్చిన వాటితో పోలిస్తే తమ చాట్‌బాట్ ప్రత్యేకమైందని చెప్పింది.
ఇతర చాట్‌బాట్‌లు తిరస్కరించే కొన్ని రకాల ప్రశ్నలకు సైతం గ్రోక్ సమాధానాలు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మ్యాథ్స్, కోడింగ్ తదితర అకాడమిక్ పరీక్షల్లో చాట్ జీపీటీ 3.5 కంటే కూడా మెరుగైన ఫలితాలు ఇచ్చిందని తెలిపింది. అయితే, ఓపెన్ ఏఐ తీసుకువచ్చిన చాట్ జీపీటీ-4 వెర్షన్ గ్రోక్ అధిగమించలేకపోయినట్లు తెలుస్తున్నది. ఇక ఎక్స్ ప్రీమియం ప్లస్ యూజర్లు గ్రోక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని ఎక్స్ కంపెనీ సీఈవో ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని.. రాబోయే రోజుల్లో మరింత మెరుగుపరిచి అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.