Minister Jagdish Reddy | కాళేశ్వరం నీళ్లకు లక్ష జన హారతి.. ఏడు మండలాల ప్రజలు హాజరు: మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం
Minister Jagdish Reddy | విధాత: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లాలో పారుతున్న కాళేశ్వరం గోదావరి జలాలకు లక్ష జనహారతి పేరుతో మంత్రి జి. జగదీష్ రెడ్డి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ రెండో దశ కాలువల ద్వారా అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి జలాలకు ఆయకట్టు గ్రామాల ప్రజలతో జిల్లా మంత్రి జి. జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష మందితో జన హారతి […]

Minister Jagdish Reddy |
విధాత: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లాలో పారుతున్న కాళేశ్వరం గోదావరి జలాలకు లక్ష జనహారతి పేరుతో మంత్రి జి. జగదీష్ రెడ్డి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు.
సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ రెండో దశ కాలువల ద్వారా అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి జలాలకు ఆయకట్టు గ్రామాల ప్రజలతో జిల్లా మంత్రి జి. జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష మందితో జన హారతి పట్టారు. ముందు టెండలను సైతం లెక్కచేయకుండా ఎస్సారెస్పీ రెండో దశ కాలువ కట్టల వెంట కాళేశ్వరం గోదావరి జలాలకు లక్ష జనహారతి పట్టి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
నాగారం మండలం ఈటూరు గ్రామం నుంచి పెన్ పహాడ్ మండలం రావిచెరువు వరకు 68 కిలోమీటర్ల మేరకు లక్ష మందితో లక్ష జనహారతి నిర్వహించారు. కాలువ వెంట గ్రామాల ప్రజలు కుటుంబాలతో సహా బతుకమ్మలు, బోనాలు, డప్పులతో తరలివచ్చి జాతరను తలపించే రీతిలో లక్ష జనహారతిలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కాలువ కట్టల వెంట ముగ్గులు వేశారు. మంత్రి జగదీష్ రెడ్డి ఏర్పాటు చేయించిన వంట వార్పులలో పాల్గొని భోజనాలను సైతం కాలువల చెంతనే పూర్తి చేశారు. కాలువ కట్ట వెంట వాహనంలో బయలుదేరిన మంత్రి జగదీష్ రెడ్డి లక్ష జనహారతిలో పాల్గొన్న ప్రజలను పలకరిస్తూ ధన్యవాదాలు తెలిపారు.
మంత్రికి ఆయా గ్రామాల ప్రజలు రైతులు దారి పొడవునా పూలు చల్లి స్వాగతం పలికారు. చివ్వెంల వద్ద మంత్రి జగదీష్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి గోదారమ్మకు చీరసారే పసుపు కుంకుమలు సమర్పించి హారతినిచ్చారు. నాగారం, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట రూరల్ , ఆత్మకూర్ ఎస్, చివ్వేంల, పెన్ పహాడ్, మోతే మండలాల 126 గ్రామాల ప్రజలు లక్ష జనహారతిలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, బొల్లం మల్లయ్య యాదవ్, కలెక్టర్ ఎన్. వెంకట్రావు సహా కాలువ వెంట కార్యక్రమం పర్యవేక్షణకు 280 మంది అధికారులు పాల్గొన్నారు.
వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి..
లక్ష జనహారతి కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు మంత్రి జగదీష్ రెడ్డికి అవార్డు అందజేశారు. తొలుత లక్ష మందితో కార్యక్రమం చేస్తామని ప్రకటించగా అనూహ్యంగా మరింత పెరిగి 1,16,022 మంది ప్రజలు వచ్చినట్లు ప్రతినిధులు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలో కాళేశ్వరం జలాలకు హారతి కార్యక్రమం.#దశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10 pic.twitter.com/JuxWxWHhRC
— Jagadish Reddy G (@jagadishBRS) June 7, 2023