Telangana BJP | బీజేపీ ఆశలన్నీ.. మోడీ పర్యటన పైనే
Telangana BJP 8న వరంగల్‌కు ప్రధాని మోడీ రాక రాష్ట్ర బీజేపీకి కాయకల్ప చికిత్స అభివృద్ధి పనులు ప్రారంభం తెరపైకి వ్యాగన్ ఫ్యాక్టరీకి భూమిపూజ హనుమకొండలో విజయ సంకల్పసభ భారీ జన సమీకరణకు సన్నాహాలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కుమ్ములాటలకు తోడు, పడిపోతున్న పార్టీ గ్రాఫును పెంచేందుకు భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ రూపంలో కాయకల్ప చికిత్స చేసేందుకు భారీ సభను వరంగల్ కేంద్రంగా డిజైన్ చేసింది. ఈ నెల 8న విజయ సంకల్ప […]

Telangana BJP
- 8న వరంగల్‌కు ప్రధాని మోడీ రాక
- రాష్ట్ర బీజేపీకి కాయకల్ప చికిత్స
- అభివృద్ధి పనులు ప్రారంభం
- తెరపైకి వ్యాగన్ ఫ్యాక్టరీకి భూమిపూజ
- హనుమకొండలో విజయ సంకల్పసభ
- భారీ జన సమీకరణకు సన్నాహాలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కుమ్ములాటలకు తోడు, పడిపోతున్న పార్టీ గ్రాఫును పెంచేందుకు భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ రూపంలో కాయకల్ప చికిత్స చేసేందుకు భారీ సభను వరంగల్ కేంద్రంగా డిజైన్ చేసింది. ఈ నెల 8న విజయ సంకల్ప సభ పేరుతో భారీ జన సమీకరణ లక్ష్యంగా భారీ బహిరంగ సభకు స్కెచ్ రెడీ చేసింది. అంతర్గత కలహాలతో ఆధిపత్యపోరుతో సతమతమవుతున్న రాష్ట్ర బీజేపీ మోడీ పర్యటన, సభ పైనే ఆశలుపెట్టుకుంది.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు మోడీ పర్యటనతో రెండు ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ అధిష్టానం పావులు కదుపుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ గ్రాఫ్ రాష్ట్రంలో పడిపోయింది. పార్టీ రాష్ట్ర నాయకత్వంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీజేపీ వ్యతిరేక పక్షాల నుంచి విమర్శల వాడి తీవ్రంగా పెరిగింది.
ఈ నేపథ్యంలో ఇతర పార్టీల వైపు చూస్తున్న నాయకుల సంఖ్య కూడా బాగానే ఉంది. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంటామనే స్థాయి నుంచి అగాథానికి పడిపోవడంతో కేంద్ర అధిష్టానం, రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఈ స్థితి నుంచి గట్టెక్కేందుకు ఖమ్మం వేదికగా సభ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ అర్ధాంతరంగా ఆ సభను రద్దు చేసుకున్నారు.
అర్ధాంతరంగా ఖమ్మం సభ రద్దు
ఖమ్మంలో గత నెలలో భారీ సభ నిర్వహించి విపక్షాల విమర్శలకు, పార్టీ అంతర్గత సమస్యలకు చెక్ పెట్టాలని బీజేపీ నాయకులు భావించారు. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను తీసుకురావాలని భావించినప్పటికీ, అనూహ్య పరిణామాల వల్ల సభనే అర్ధాంతరంగా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. సభ రద్దుకు పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడం సంగతి పక్కన పెడితే, పార్టీని కాపాడుకోవాలన్నా అత్యవసర చికిత్స చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
8న మోడీ వరంగల్ పర్యటన
రాష్ట్రంలో బీజేపీ ఎదుర్కొంటున్న ఈ స్థితి నుంచి బయటపడేందుకు తమకున్న ఏకైక ఆయుధమైన మోడీ చరిస్మాను ఉపయోగించుకోవాలని భావించారు. దీనిలో భాగంగా ప్రధాని ఈ నెల 8వ తేదీన వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. మోడీ రాక సందర్భంగా సభను మాత్రమే ఏర్పాటు చేస్తే పాక్షిక ప్రయోజనం, విపక్షాల విమర్శలు ఉంటాయని భావించి అభివృద్ధి ఎజెండాతో వరంగల్లో భారీ సభకు రూపకల్పన చేశారు. వరంగల్ అనుకూలంగా ఉందని భావిస్తున్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
ప్రధాని మోడీ పర్యటనసందర్భంగా వరంగల్ జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. కాజీపేటలో రైల్వే పిరియాడిక్ ఓవరాయిలింగ్ (POH) ప్లాంట్‌కు అదనంగా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారని మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం చెప్పారు. విపక్ష పార్టీల నుంచి విమర్శలు తలెత్తకుండా, ముందు జాగ్రత్తగా పిఒహెచ్‌తో పాటు రైల్వే వేగన్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసి, దశాబ్దాలుగా ఉన్న కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ను మరో రూపంలో పరిష్కరించాలని యోచన బీజేపీ చేసినట్లు భావిస్తున్నారు.
అదే విధంగా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలోని కాకతీయ టెక్స్టైల్ పార్క్, నేషనల్ హైవేను ప్రధాని ప్రారంభించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే శాఖ ఉన్నతాధికారులు కాజీపేటలో పర్యటించారు. మోడీ రాక సందర్భంగా అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు పరిశీలించారు.
హనుమకొండలో విజయ సంకల్ప సభ
ప్రధాని మోడీ రాక సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. గతంలో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సభకు మించి సభ జరుపుతామంటూ బండి సంజయ్ ప్రకటించారు. లక్షలాది మందిని సమీకరించాలని నిర్ణయించారు. వరంగల్,నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
ఢిల్లీలో వరుస భేటీల మతలబు
ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్లతో ఢిల్లీ కేంద్రంగా అధిష్టానం చర్చలు ఇటీవల జరిపింది. ఆ తరువాత బండి సంజయ్ ని ఢిల్లీకి పిలిపించి మంతనాలు చేశారు. ఈ మంతనాల పర్యవసానంగా రాష్ట్రంలో అత్యవసరంగా అధినేతల పర్యటన చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని అధిష్టానానికి సూచించినట్లు సమాచారం.
ఇంత జరిగినా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని మారుస్తున్నారని చర్చ మాత్రం ఆపలేకపోయారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన దున్నపోతు ట్వీట్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది.
దీనిపై ఈటెల దీటుగా స్పందించగా, బండికి మద్దతుగా విజయరామారావు కామెంట్ చేశారు. ఆదివారం హనుమకొండలో జరిగిన సన్నాహక సభలో నాయకులంతా ఎడమొఖం, పెడముఖంగా వ్యవహరించారు. పలువురు నాయకులు ఈ సమావేశానికి రాజగోపాల్ రెడ్డి లాంటివారు హాజరు కాలేదు.
మోడీ వరంగల్ పర్యటనకు ముందు ఢిల్లీలో బీజేపీ అత్యున్నత స్థాయి సమావేశం సోమవారం జరగడం అనేక ఊహగానాలకు తావిస్తోంది. అందరి దృష్టి అటువైపే ఉంది.
ఖమ్మం సభ అర్ధాంతర రద్దు తర్వాత వరంగల్ కేంద్రంగా భారీ సభ నిర్వహించి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలని భావిస్తున్నారు. మోడీ చరిస్మా ఆ పార్టీకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. ఈ గడ్డు పరిస్థితులలో మోడీ పర్యటనపైన్నే గంపెడాశలు పెట్టుకున్నారు.