జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్
69వ నేషనల్ అవార్డుల వేడుక న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అంగరంగ వైభవంగా సాగింది. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలో ఇప్పటివరకు మహామహ నటులు సాధించలేని అరుధైన ఘనతయైన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు

- అట్టహాసంగా 69వ నేషనల్ అవార్డుల పంపిణీ
- ఉత్తమ నటీ అవార్డు స్వీకరించిన ఆలియా భట్, కృతిసనన్‌లు
విధాత : 69వ నేషనల్ అవార్డుల వేడుక న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అంగరంగ వైభవంగా సాగింది. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలో ఇప్పటివరకు మహామహ నటులు సాధించలేని అరుధైన ఘనతయైన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు స్వీకరించారు. అవార్డు ఫంక్షన్‌కు హాజరైన వారి కరతాళ ధ్వనుల మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది. 69 ఏండ్ల జాతీయ చలన చిత్ర అవార్డుల చరిత్రలో అల్లు అర్జున్ తొలి తెలుగు హీరోగా నేషనల్ అవార్డు అందుకున్న క్షణాల పట్ల అల్లు అర్జున్ మీడియాతో తన అనందాన్ని పంచుకున్నారు.
ఈ క్షణం మాటల్లో చెప్పలేనిదని, ఈ సందర్భం ఎంతో వినయపూర్వకమైనదిగా.. గౌరవప్రదంగా భావిస్తున్నానన్నారు. ‘పుష్ప’ లాంటి కమర్షియల్ సినిమాకు ఈ అవార్డు రావడం నాకు డబుల్ అచీవ్‌మెంట్‌గా పేర్కోన్నాడు. పుష్పలోని ఐకానిక్ డైలాగ్ తగ్గేదే లే అంటు మీడియా ప్రతినిధుల ముందు సంతోషం వెలిబుచ్చాడు. జాతీయ ఉత్తమ నటీగా ‘గంగూబాయి కతియావాడియా’ చిత్రానికి గానూ అలియాభట్, మిమీ చిత్రానికిగాను కృతి సనన్‌లు అవార్డు పంచుకున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా వారు అవార్డును స్వీకరించారు. అలియా భట్ పెళ్లినాటి చీరతో మెరిసిపోతూ అవార్డు అందుకున్నారు. అవార్డుల ఫంక్షన్‌లో ఆలియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భర్త రణ్‌బీర్‌తో కలిసి అవార్డుల స్వీకరణకు హాజరైన అలియా ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఈ అవార్డు ఫంక్షన్‌లో ముందుగా నిర్మాత నవీన్ ఎర్నేని, దర్శకుడు బుచ్చిబాబు సనాలు ఉప్పెన సినిమాకు గానూ జాతీయ అవార్డులు అందుకున్నారు. అనంతరం బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా కింగ్ సోలోమాన్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నాటు నాటు పాటకు ప్రేమ్ రక్షిత్, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా ఎమ్.ఎమ్. కీరవాణి(ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ సింగర్‌గా కాల భైరవ(ఆర్‌ఆర్‌ఆర్), ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ పుష్ప సినిమాకు గానూ అవార్డును అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్(కొండపొలం), ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌కు గానూ శ్రీనివాస్ మోహన్(ఆర్‌ఆర్‌ఆర్) అవార్డులు అందుకున్నారు. అన్ని వర్గాలను అలరించిన వినోదాత్మక చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌కు గానూ రాజమౌళి 69వ నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు హాజరై సందడి చేశారు. కృతి సనన్, ఆర్ మాధవన్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు, వివిధ భాష చిత్రాల నటీనటులు హాజరయ్యారు.