‘Altius’ Drone | పెను తుఫాను తలొంచి చూస్తుంది! అదిగో ‘ఆల్టియస్’ డ్రోన్
'Altius' drone తుఫాన్ల కేంద్ర భాగమైన ‘కన్ను’లోకే నేరుగా పయనం ఇక మెరుగైన హెచ్చరికలు విధాత: తీవ్ర, అతి తీవ్ర తుఫాన్లు, సూపర్ సైక్లోన్.. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు.. ఎడతెరపి లేని వాన.. రహదారులు జలమయం.. వేలమంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు.. స్తంభించిన జనజీవనం.. బోలెడు ఆస్తినష్టం, ప్రాణనష్టం.. లెక్క తేలని పంట నష్టం.. ఇలాంటి తుపాను వార్తలు మామూలే. వాతావరణ కేంద్రం జారీ చేసే తుఫానుహెచ్చరికల నంబర్లూ తెలిసినవే. హోరుగాలితో భీకరంగా […]

‘Altius’ drone
- తుఫాన్ల కేంద్ర భాగమైన ‘కన్ను’లోకే నేరుగా పయనం
- ఇక మెరుగైన హెచ్చరికలు
విధాత: తీవ్ర, అతి తీవ్ర తుఫాన్లు, సూపర్ సైక్లోన్.. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు.. ఎడతెరపి లేని వాన.. రహదారులు జలమయం.. వేలమంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు.. స్తంభించిన జనజీవనం.. బోలెడు ఆస్తినష్టం, ప్రాణనష్టం.. లెక్క తేలని పంట నష్టం.. ఇలాంటి తుపాను వార్తలు మామూలే. వాతావరణ కేంద్రం జారీ చేసే తుఫానుహెచ్చరికల నంబర్లూ తెలిసినవే.
హోరుగాలితో భీకరంగా విరుచుకుపడే తుఫాను బీభత్స వేళ ఇంట్లోంచి బయటకు రావడానికే భయపడతాం. తీరం దాటక మునుపే సముద్రంలోని తుఫానుకు ఎదురు వెళితే? తుఫాను నడిమధ్య ప్రాంతమైన ‘కన్ను’లోకే నేరుగా విమానంతో దూసుకెళ్లి విన్యాసాలు చేస్తే? ప్రమాదకరమైనా తుఫాన్ల విశేషాలు ఆరా తీయడానికి హరికేన్ హంటర్స్ ఇలా చేస్తుంటారు. తుఫాను కేంద్ర భాగమైన కంట్లోకి డ్రోన్స్ పంపి సమాచారం సేకరిస్తే? ప్రజలకు మరింత మెరుగైన హెచ్చరికలు పంపవచ్చు. గణనీయంగా ఆస్తి-ప్రాణ నష్టాలు తగ్గించుకోవచ్చు.
రకరకాల నామధేయాలు!
అట్లాంటిక్-తూర్పు పసిఫిక్ ప్రాంతంలో ఏర్పడే ఉష్ణ మండల తుఫాన్లను ‘హరికేన్స్’ అంటారు. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో వీటిని ‘టైఫూన్స్’గా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ‘సైక్లోన్స్’గా పిలుస్తారు. ఉష్ణమండల తుఫాన్లు ఉత్తరార్థ గోళంలో అపసవ్య దిశలో, దక్షిణార్థ గోళంలో సవ్యదిశలో తిరుగుతుంటాయి. ఇది భూభ్రమణం వల్ల కలిగే ‘కొరియాలిస్ ఎఫెక్ట్’.
సముద్రంలో తుఫాను వ్యాసం వందల మైళ్లలో విస్తరించివుంటుంది. తుఫాను కన్ను వ్యాసం 20-40 మైళ్ల దాకా ఉంటుంది. ఒక్కోసారి ఇది 2-200 మైళ్లూ ఉండొచ్చు. విశేషమేమిటంటే… సముద్రంలో తుఫాను పయనించే చోట అనూహ్య అలజడి, ఎంతో కల్లోలం నెలకొన్నప్పటికీ… కేంద్రంలోని ‘తుఫాను కన్ను’ భాగంలో మాత్రం ప్రశాంతత కనిపిస్తుంది. తుఫాను కంట్లోంచి నీలి ఆకాశం, తారల్ని చూడొచ్చు! ఇక తుఫాను ‘కన్ను గోడ’ ప్రాంతం పెనుగాలులతో చెలరేగే అత్యంత ప్రమాదకరమైన, శక్తిమంతమైన ప్రదేశం.
బుల్లి పిట్ట… కూత ఘనం!
అమెరికన్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) నిరుడు జూన్ మాసంలో ‘WP-3D ఆరియన్’ విమానం సాయంతో ‘ఆల్టియస్-600’ మానవరహిత వైమానిక వ్యవస్థ (డ్రోన్)ను ప్రయోగాత్మకంగా పరీక్షించింది.
గత ఏడాది సెప్టెంబరు 28న ‘ఇయాన్’ హరికేన్ కన్ను ప్రాంతంలోకి ‘ఆల్టియస్’ను పంపింది. ‘WP-3D ఆరియన్’ విమానం ‘ఆల్టియస్’ను తుఫాను కన్నులోకి జార విడిచింది. 12 కిలోల బరువుండే ఈ డ్రోన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో 440 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ప్రయాణంలో ఎదురయ్యే తుఫాను బీభత్సాన్ని తట్టుకోగలదు.
సముద్ర ఉపరితలంపై 200 అడుగుల ఎత్తు నుంచి 3,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. తుఫాను కన్ను గోడ ప్రదేశంలో విజృంభించే ఉద్ధృత గాలుల వేగాన్ని (గంటకు 350 కిలోమీటర్ల వేగం వరకు) రికార్డు చేయగలదు. ప్రకృతిలోనే అత్యంత శక్తిమంతమైన తుఫాను పెనుగాలులకు ఎదురు ఎగరగలిగేలా ‘ఆల్టియస్-600’ డ్రోన్ నిర్మాణం ఉంటుంది.
అంతటి విధ్వంసకర, ప్రతికూల వాతావరణంలోనూ అది కొన్ని గంటలపాటు శ్రమించి ‘తుఫాను కొలతలు’ సేకరిస్తుంది. ఉష్ణోగ్రత, పీడనం, తేమ, గాలుల వేగం సమాచారాన్ని ‘ఘటనా స్థలి’ నుంచే మనకు అందిస్తుంది. ఆన్బోర్డ్ ప్రోగ్రామింగ్ లేదా విమానంలోని ఆపరేటర్లతో ‘ఆల్టియస్-600’ను నియంత్రించవచ్చు. తుఫాను సమాచారాన్ని మరింత కచ్చితంగా సేకరించి, ప్రజలకు మెరుగైన హెచ్చరికలు పంపేందుకు ‘నోవా’ ఈ ఏడాది హరికేన్ సీజన్ నుంచి ‘ఆల్టియస్’ డ్రోన్లను రంగప్రవేశం చేయిస్తోంది.