అమెరికాలో భారతీయుల మెడపై వేలాడుతున్న లే ఆఫ్స్ కత్తి..!
విధాత: అమెరికాలో భారతీయులు విలవిలాడిపోతున్నారు. ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడిన భారతీయుల బతుకు అగమ్యగోచరంగా మారింది. తమ ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ ప్రొఫెషనల్స్ తీవ్ర అవస్థలు పడుతున్నారు. హెచ్ 1 బీ వీసాను కాపాడుకునేందుకు ఆ ఐటీ ఉద్యోగులు కొత్త ఉద్యోగాల వైపు చూస్తున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా కొత్త ఉద్యోగాలు దొరక్క తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు అనేక ఐటీ సంస్థలు లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఇండియాకు చెందిన […]

విధాత: అమెరికాలో భారతీయులు విలవిలాడిపోతున్నారు. ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడిన భారతీయుల బతుకు అగమ్యగోచరంగా మారింది. తమ ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ ప్రొఫెషనల్స్ తీవ్ర అవస్థలు పడుతున్నారు. హెచ్ 1 బీ వీసాను కాపాడుకునేందుకు ఆ ఐటీ ఉద్యోగులు కొత్త ఉద్యోగాల వైపు చూస్తున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా కొత్త ఉద్యోగాలు దొరక్క తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు అనేక ఐటీ సంస్థలు లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఇండియాకు చెందిన వేలాది మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఆ ఉద్యోగులంతా దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. తమకున్న వర్క్ వీసా నిబంధనల ప్రకారం అమెరికాలో ఉండాలంటే నిర్దిష్ట కాలంలో కొత్త ఉద్యోగాల్లో చేరాలి. ఆర్థిక మాంద్యం కారణంగా కొత్త ఉద్యోగాలు లభించడం కష్టంగా మారింది. దీంతో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన భారత ఐటీ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వాషింగ్టన్ పోస్టు కథనం ప్రకారం.. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయ ఉద్యోగులే ఉన్నారు. ఈ ఉద్యోగులంతా హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాలపై అమెరికాలో ఉంటున్నారు. ఈ రెండు వీసాల ద్వారా దిగ్గజ సంస్థలు అమెరికాలో భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకున్నాయి.
అయితే హెచ్ 1 బీ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న వారు తమ ఉద్యోగాన్ని కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త జాబ్ వెతుక్కోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఉద్యోగం లభించని పరిస్థితుల్లో స్వదేశానికి రాక తప్పదు. ఇప్పటికే పలు కంపెనీలు లే ఆఫ్‌లు ప్రకటించడంతో.. కొత్త ఉద్యోగాలు లభించడం కష్టంగా మారింది. ఈ పరిస్థితి తమ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాబ్ కోల్పోయిన కొంత మందికి కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు కొన్ని సంస్థలు సహాయం చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఐటీ ఉద్యోగులు 800 మంది చొప్పున ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. కొత్త ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. అమెరికాలో ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఐటీ ఉద్యోగులు అన్వేషిస్తున్నారు.
హెచ్-1బీ వీసా అంటే ఏమిటి?
అసలు హెచ్ 1 బీ వీసా అంటే ఏమిటో తెలుసుకుందాం. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేసుకునేందుకు గానూ విదేశీయులకు హెచ్ 1 బీ వీసా జారీ చేస్తారు. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారికి హెచ్ 1 బీ వీసాను జారీ చేస్తారు. అయితే హెచ్ 1 బీ వీసా నాన్ ఇమిగ్రేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ వీసాలను పరిమిత సంఖ్యలోనే జారీ చేస్తారు. జనరల్ కోటాలో ఏడాదికి 65 వేల హెచ్ 1 బీ వీసాలు జారీ చేస్తారు. వీటికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన వారికి సంవత్సరానికి 20 వేల చొప్పున జారీ చేస్తారు.