బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ.. మునుగోడు వ్యూహాలపై కసరత్తు
విధాత: కేంద్ర మంత్రి అమిత్ షా శనివారం మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు వ్యూహాలపై చర్చించేందుకు హైదరాబాద్ టూరిజం ప్లాజాలో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఇంచార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఉప ఎన్నిక ఇంచార్జీ వివేక్ వెంకటస్వామి, ఎంపీ అరవింద్, పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్,రఘునందన్ రావు, డీకే. అరుణ సహా […]

విధాత: కేంద్ర మంత్రి అమిత్ షా శనివారం మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు వ్యూహాలపై చర్చించేందుకు హైదరాబాద్ టూరిజం ప్లాజాలో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఇంచార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఉప ఎన్నిక ఇంచార్జీ వివేక్ వెంకటస్వామి, ఎంపీ అరవింద్, పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్,రఘునందన్ రావు, డీకే. అరుణ సహా 19 మంది ముఖ్య నేతలతో హాజరయ్యారు.

భేటీలో అమిత్ షా ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై చర్చించారు. భేటీకి హాజరైన వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితో భేటీలోనే కాకుండా విడిగా చర్చించి పార్టీ విజయావకాశాలపై అడిగి తెలుసుకున్నారు. పార్టీలోకి పెరిగిన వలసల వ్యవహారాన్ని, పార్టీ సంస్థాగత పరిస్థితులను, ప్రత్యర్ధి పార్టీల బలాబలాల గూర్చిఅమిత్ షా అరా తీశారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మునుగోడులో గెలిచేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవద్దని వారిని ఆదేశించారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ప్రతి గ్రామానికి ముగ్గురు నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని సూచించారు. “ప్రజాగోస- బిజెపి భరోసా” బైక్ ర్యాలీలను అన్ని గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించారు.

కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి ప్రవాస్ యోజన పర్యటనలను నియోజకవర్గంలో విస్తృతంగా ఏర్పాటు చేసి పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఉపఎన్నికల్లో బీజేపీ గెలువబోతుందన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించేలా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ భేటీలో ఆయా అంశాలపై చర్చతో పాటు ప్రచార ప్రక్రియ సాగుతున్న కొద్ది ఎప్పటికప్పుడు పార్టీ గెలుపు వ్యూహాలను సమీక్షించి ముందడుగు వేయాలని మార్గదర్శనం చేశారని పార్టీ వర్గాల కథనం.