Manipur | ఇది ప్రభుత్వ వైఫల్యమే.. మ‌ణిపూర్ హింస‌పై ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్

Manipur శాంతి భద్రతలను అదుపు చేయలేదు నిరాశ్రయులకు తగిన సౌకర్యాలూ లేవు భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడం నేరం న్యూఢిల్లీ: మ‌ణిపూర్‌లో జ‌రుగుతున్న మార‌ణ హోమం దేశ ప్రజలనేకాదు.. ప్రపంచ దృష్టినీ ఆకర్షిస్తున్నది. ఈ హింసపై ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్నెస్టీ స్పందించింది. మణిపూర్ హింసను నివారించేందుకు, శాంతిని పునరుద్ధరించడానికి అన్ని జాతులతో కలిసి పని చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. హింసను వ్యతిరేకిస్తున్న ప్రజలు, మేధావులు, విద్యార్థులపైన పోలీసుల ప్రతీకార చర్యలు మితిమీరిపోతున్నాయని ఆక్షేపించింది. […]

  • By: Somu    latest    Jul 14, 2023 12:37 AM IST
Manipur | ఇది ప్రభుత్వ వైఫల్యమే.. మ‌ణిపూర్ హింస‌పై ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్

Manipur

  • శాంతి భద్రతలను అదుపు చేయలేదు
  • నిరాశ్రయులకు తగిన సౌకర్యాలూ లేవు
  • భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడం నేరం

న్యూఢిల్లీ: మ‌ణిపూర్‌లో జ‌రుగుతున్న మార‌ణ హోమం దేశ ప్రజలనేకాదు.. ప్రపంచ దృష్టినీ ఆకర్షిస్తున్నది. ఈ హింసపై ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్నెస్టీ స్పందించింది. మణిపూర్ హింసను నివారించేందుకు, శాంతిని పునరుద్ధరించడానికి అన్ని జాతులతో కలిసి పని చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

హింసను వ్యతిరేకిస్తున్న ప్రజలు, మేధావులు, విద్యార్థులపైన పోలీసుల ప్రతీకార చర్యలు మితిమీరిపోతున్నాయని ఆక్షేపించింది. మణిపూర్‌లో మానవ హక్కులను పరిరక్షించడంలో భారత అధికారుల అసమర్థత పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం పౌర సమాజాలతో కలిసి పనిచేయాలని ఆ ప్రకటనలో సూచించింది. మణిపూర్‌ హింస బాధితులు తమ బాధలను, అనుభవాలను వ్యక్తపరిచే హక్కును కాలదన్నడం అంతర్జాతీయ చట్టాల పట్ల భారతదేశ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నదని పేర్కొన్నది.

మ‌ణిపూర్‌లో హింస చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటించిన నిజనిర్థారణ కమిటీపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడం, ప్రభుత్వ ప్రాయోజిత హింసపై బుక్‌లెట్‌ను ప్రచురించిన కుకీ విద్యార్థి సంస్థలపై కేసు నమోదు చేయ‌డం, ద వైర్ ప‌త్రిక‌కు ఇంట‌ర్వూ ఇచ్చిన ముగ్గురికి స‌మ‌న్లు పంప‌డం.. ఇవ‌న్నీ మాన‌వ హ‌క్కుల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని తేల్చి చెప్పింది.

రాష్ట్ర పాలనకు సంబంధించి మే 4న ప్రభుత్వం ప్రకటించిన ‘షూట్-ఆన్-సైట్’ ఆదేశాలు అంతర్జాతీయ చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి లేవని ఆమ్నెస్టీ పేర్కొంది. మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లా మేజిస్ట్రేట్‌లకు ‘షూట్-ఎట్-సైట్’ ఆర్డర్ జారీ చేయడాన్ని ఆమ్నెస్టీ తప్పుపట్టింది. రాష్ట్రంలో ఇంట‌ర్నెట్ బంద్‌ చేయడం రాజ్యాంగంలో పొందుపర్చిన భావ ప్రకటనా స్వేచ్ఛపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు క‌నుగుణంగా లేదని పేర్కొన్నది