ఎనిమిదేళ్ల బాలికకు అరుదైన అవయమార్పిడి.. తల్లి బోన్ మ్యారో, కిడ్నీని అమర్చిన వైద్యులు

- ఇమ్యునో సప్రెసెంట్ల అవసరం లేకుండా తల్లి బోన్ మ్యారో, కిడ్నీని అమర్చిన వైద్యులు
విధాత: అరుదైన జన్యు సమస్యతో బాధ పడుతున్న ఎనిమిదేళ్ల బాలికకు లండన్ వైద్యులు అవయవ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అంతే కాకుండా జీవిత కాలం ఇమ్యునోసప్రెసెంట్ల అవసరం లేకుండా అవయవ మార్పిడి చేసిన లండన్‌లో తొలి ఆపరేషన్‌గానూ ఇది నమోదైంది. బాధితురాలు అదితికి అయిదేళ్ల వయసున్నపుడే ఆమె కేసు లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్ (గోష్)కు వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు స్కిమ్‌కే ఇమ్యునో ఆసియస్ డైస్ల్పాసియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు.
యూకేలో ప్రతి 30 లక్షల మందిలో ఒకరికి ఈ వ్యాధి వస్తుంది. అప్పటికే కిడ్నీల వైఫల్యంతో బాధపడుతున్న అదితికి అవయవమార్పిడి ద్వారా కిడ్నీని అమర్చాల్సి ఉంది. అయితే ఆమెకున్న ఈ వ్యాధి వల్ల ఆ శస్త్రచికిత్స చేయడం సాధ్యం కాదని చాలా మంది వైద్యులు చేతులెత్తేశారు. బాలిక తల్లిదండ్రులు గోష్ ఆసుపత్రి వైద్యులను ఆశ్రయించడంతో వారు రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులతో చర్చించి శస్త్రచికిత్సకు ఒక ప్రణాళికను రూపొందించారు.
దీని కోసం ముందుగా ఆమె తల్లి నుంచి బోన్ మ్యారోను తీసుకుని అదితి శరీరంలోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆమె తల్లే కాబట్టి అదితి శరీరం ఆ బోన్ మ్యారోను అంగీకరించి తన శరీరానికి అన్వయించుకుంటుంది. తర్వత బాలిక తల్లి నుంచే కిడ్నీని తీసి అదితికి అవయవ మార్పిడి చేస్తారు. అప్పటికే తల్లి బోన్ మ్యారో తన శరీరంలో ఉండటం వల్ల అదితి శరీరం ఆ కిడ్నీని తిరస్కరించే ప్రశ్నే ఉండదు అని భావించి ఆ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఇలాంటి అవయవమార్పిడి శస్త్రచికిత్సల్లో ఇమ్యునో సప్రెసెంట్స్ అనేవి చాలా కీలకం. కొత్త అవయవాన్ని రోగి శరీరం శత్రువుగా భావించి తిరస్కరించకుండా ఇవి కాపాడతాయి.
అయితే ఇవి వాడటం వల్ల శరీరానికి ఉన్న రోగ నిరోధక శక్తి క్షీణించిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇమ్యునో సప్రెసెంట్స్ తీసుకున్న వారు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. అదితి విషయంలో ఈ సమస్య రాకుండా వైద్యులు జాగ్రత్త పడ్డారు. ఆమెకు శస్త్రచికిత్స జరిగిన ఒక నెల అనంతరం ఇమ్యునో సప్రెషన్స్ ఇవ్వడం మానేశారు. ఆమెకు తల్లి బోన్ మ్యారోనే ఇవ్వడం వల్ల ఆమె శరీరం కిడ్నీని స్వాగతించిందని అర్థం కావడంతో వైద్యులు ధైర్యం చేసి ఈ పని చేశారు. ఒకప్పుడు రెండు కిడ్నీలు పాడైపోవడం వల్ల డయాలసిస్ పైనే జీవించిన అదితి ప్రస్తుతం ఈత కొడుతూ పాటలు పాడుతూ.. సంతోషంగా ఆరోగ్యంగా ఉందని తల్లి దివ్య సంతోషంగా చెప్పారు.