Karnataka Elections 2023 | కర్ణాటకలో గెలిచేదెవరో.. చెప్పేసిన అభిప్రాయ సేకరణ

సీవోటర్‌ సర్వేలో కాంగ్రెస్‌కే మెజార్టీ మొగ్గు బీజేపీ ప్రభుత్వంపై మెజార్టీ ప్రజల వ్యతిరేకత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే అంటున్న ప్రజలు సీఎం రేసులో ఉన్నానంటున్న సిద్ధరామయ్య డీకే శివకుమార్‌తో తనకేమీ సమస్యల్లేవని వెల్లడి Karnataka Elections 2023 మే 10న జరుగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్‌ పార్టీయేనని సీ వోటర్‌ సర్వే తేల్చింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నామని సర్వేలో పాల్గొన్నవారిలో 57 శాతం మంది చెప్పారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పనితీరు […]

  • By: Somu    latest    Mar 30, 2023 11:25 AM IST
Karnataka Elections 2023 | కర్ణాటకలో గెలిచేదెవరో.. చెప్పేసిన అభిప్రాయ సేకరణ
  • సీవోటర్‌ సర్వేలో కాంగ్రెస్‌కే మెజార్టీ మొగ్గు
  • బీజేపీ ప్రభుత్వంపై మెజార్టీ ప్రజల వ్యతిరేకత
  • ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే అంటున్న ప్రజలు
  • సీఎం రేసులో ఉన్నానంటున్న సిద్ధరామయ్య
  • డీకే శివకుమార్‌తో తనకేమీ సమస్యల్లేవని వెల్లడి

Karnataka Elections 2023

మే 10న జరుగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్‌ పార్టీయేనని సీ వోటర్‌ సర్వే తేల్చింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నామని సర్వేలో పాల్గొన్నవారిలో 57 శాతం మంది చెప్పారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పనితీరు బాగోలేదని 47 శాతం మంది తేల్చేయగా.. 26.8 శాతం మాత్రమే బాగుందని మెచ్చుకున్నారు.

విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తుందని సీవోటర్‌ అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. కాంగ్రెస్‌కు 115 నుంచి 127 మధ్య సీట్లు లభించే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. బీజేపీకి 68 నుంచి 80 మధ్య వస్తాయని, జేడీఎస్‌ 23 నుంచి 35 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.

ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నది? అన్న ప్రశ్నకు 50.5 శాతం.. అంటే దాదాపు సగంమంది అస్సలు బాగోలేదని చెప్పారు. 27 శాతం మాత్రం ప్రభుత్వ పనితీరు మంచిగా ఉన్నదన్నారు. నిరుద్యోగం, మౌలిక వసతుల లేమి అనేవి ప్రధాన సమస్యలుగా సర్వేలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.

భావి సీఎం ఎవరు?

కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని 39.1 శాతం మంది అభిప్రాయ పడ్డారు. బసవరాజ్‌ బొమ్మైకి 31.1 శాతం మంది మద్దతిచ్చారు. కుమారస్వామికి అవకాశాలు ఉన్నాయని 21.4 శాతం మంది చెప్పగా.. కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ సీఎం అయ్యే అవకాశం ఉన్నదని 3.2 శాతం మంది అభిప్రాయపడ్డారని సర్వే పేర్కొంటున్నది. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నది. అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

2008లో కాంగ్రెస్‌ పార్టీ భారీ ఓటమిని చవిచూసింది. మొత్తం 224 స్థానాలకు గాను కేవలం 80 సీట్లలోనే గెలుపొందగలిగింది. అయితే.. 2013 ఎన్నికల్లో తిరిగి తన సత్తా చాటింది. 112 స్థానాలు గెలుపొందింది. గత ఎన్నికల్లో 80 సీట్లే వచ్చినా.. జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. అది ఎంతోకాలం నిలువలేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది.

పోటీకి యడ్యూరప్ప దూరం!

కర్ణాటకలో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న బీఎస్‌ యడ్యూరప్ప ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. యడ్యూరప్పను అవమానకర రీతిలో ముఖ్యమంత్రి పదవి నుంచి బీజేపీ అధిష్ఠానం తప్పించిందని విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు బీజేపీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని అంటున్నారు. తనకు ఇప్పటికే 80 ఏళ్లు నిండాయని అందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు.

సీఎం రేసులో ఉన్నా : సిద్ధరామయ్య

ముఖ్యమంత్రి పదవికి రేసులో తాను 100 శాతం ఉన్నానని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధరామయ్య చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో డీకే శివకుమార్‌ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. మరో సీనియర్‌ నేత జీ పరమేశ్వర గురించి తనకు తెలియదని అన్నారు.

అయితే గతంలో ఒకసారి పరమేశ్వర ముఖ్యమంత్రి కావాలన్న అభిలాషను వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఎవరైనా ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్పేమీ కాదని స్పష్టం చేశారు. అయితే.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తామంతా కూర్చొని సీఎంగా ఎవరు ఉండాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సిద్ధరామయ్యను సీఎం అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్వీప్‌ చేస్తుందా? అన్న ప్రశ్నకు.. సీఎం అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్‌ పార్టీ ముందుగా నిర్ణయించదని, ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.

గతంలో ఒక సారి ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్ధరామయ్య.. ఈసారి మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కోలార్‌ నుంచి కూడా పోటీ చేస్తానని బుధవారం ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికలు తనకు చివరివని ఆయన ప్రకటించారు.