లిప్‌స్టిక్ మహిళలకే.. మహిళా రిజర్వేషన్లతో ప్రయోజనం: ఆర్జేడీ నేత బారీ సిద్ధిఖీ

లిప్‌స్టిక్ మహిళలకే.. మహిళా రిజర్వేషన్లతో ప్రయోజనం: ఆర్జేడీ నేత బారీ సిద్ధిఖీ
విధాత: చట్టసభలలో మహిళా రిజర్వేషన్లను బీహార్‌ ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కేవలం నగరాల్లో ఉండే లిప్‌స్టిక్ వేసుకునే, బాబ్‌కట్ హెయిర్ స్టైల్‌ మహిళలకే ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం వారికి బదులుగా వెనుకబడిన మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని వ్యాఖ్యానించారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయని, ఎన్నికలు జరిగేదాకా టీవీలు, సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలంటు ఆయన తన మద్ధతుదారులకు సూచించారు. వాటికి బదులుగా మెదడు ఉపయోగించి ఎన్నికల్లో పనిచేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బారీ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ అధికార ప్రతినిధి ఆజాద్ అహ్మద్ సిద్ధిఖీ సమర్ధించారు. బారీ వ్యాఖ్యల ఉద్ధేశం మహిళా రిజర్వేషన్ బిల్లులో వెనుకబడిన వర్గాల మహిళలకు రిజర్వేష్లన్లు అవసరమని చెప్పడమేనన్నారు.


మహిళా రిజర్వేషన్ బిల్లుపై పలు పార్టీ నేతలు విభిన్నంగా స్పందిస్తునే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పట్లో అమలు కాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం బిల్లును నీటిలో జాబిల్లి అని అభివర్ణించారు. నీటిలో చంద్రుడి ప్రతిబింబం కనిపించినంతా మాత్రన చంద్రుడు అక్కడ ఉన్నట్లుగా కాదని, ఆకాశంలోనే అందనంత దూరంలో చంద్రుడుంటారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం కూడా అలాంటిదేనన్నారు.