Yadadri Brahmotsavam | బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ క్షేత్రం

yadadri brahmotsavam | బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ క్షేత్రం… 21 నుండి మార్చి 3 వరకు బ్రహ్మోత్సవాల పర్వం..
విశ్వ‌క్సేన ఆరాధ‌న‌తో ఆరంభం.. మహాపూర్ణాహుతితో పరిసమాప్తం

Yadadri Brahmotsavam | బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ క్షేత్రం
  • 21 నుంచి మార్చి 3 వరకు బ్రహ్మోత్సవాలు
  • విశ్వ‌క్సేన ఆరాధ‌న‌తో ఆరంభం..
  • మహాపూర్ణాహుతితో పరిసమాప్తం

విధాత‌: స్తంభోద్భవుడు శ్రీ లక్ష్మీనరసింహుడు కొలువైన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం (yadadri brahmotsavam) బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన‌ అద్భుత శిల్పకళా రాజ గోపురాలతో రూపుదిద్దుకున్నది.. ఆలయ పునర్నిర్మాణంతో దేశ విదేశాల్లో గొప్ప శిల్పకళా నిర్మిత దివ్య క్షత్రంగా గుర్తింపు నొందుతున్న యాదగిరిగుట్ట దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈనెల 21 నుండి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

Yadadri | మహిమాన్వితం యాదగిరి గుట్ట క్షేత్రం.. నరసింహస్వామి ఆలయం చరిత్ర-విశేషాలు

ఆలయ పునర్ నిర్మాణం కారణంగా ఆరేళ్లుగా బాలాలయంలో కొనసాగిన yadadri బ్రహ్మోత్సవాలు ఈ సారి పునర్ నిర్మితమైన నవ్య భవ్య దివ్య ఆలయంలో పూర్తిస్థాయిలో నేత్రపర్వంగా నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం కొనసాగే బ్రహ్మోత్సవాలు తొలిరోజు విశ్వక్సేన ఆరాధనతో ఆరంభ‌మై అలంకార అవతార సేవలతో కొనసాగి చక్రస్నానం, మహాపూర్ణాహుతితో పరిసమాప్తమవుతాయి.

ముఖ్య పర్వాలైన ఎదుర్కోలు, కళ్యాణం, రథోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించ‌న‌నున్నారు. ఏటా ఫాల్గుణ మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా నిలిచే స్వామి వారి విశేష వాహన సేవలు.. ధార్మిక, సంగీత, సాహిత్య మహాసభలు భక్తులను అలరించనున్నాయి.

బ్రహ్మ నుండి నేటిదాకా

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్ రక్షకుడైన లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు చతుర్ముఖుడు.. సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడే స్వయంగా ఆరంభించడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధినొందాయి.

బ్రహ్మోత్సవాల్లో సకల దేవతలను ఆహ్వానించి ఇష్ట పూజలు నిర్వహించడం వైష్ణవ ఆలయాల ఆచారం. ఉత్సవాలకు విచ్చేసిన దేవతలకు ప్రీతికరమైన మంత్ర పఠనం, హవన పూజలు నిర్వహిస్తారు. దేవతలు, మునులు, ఆళ్వారులు, భక్తజనుల సమక్షంలో సాగే లక్ష్మీనరసింహుల తిరుకల్యాణోత్సవ ఘట్టంతో లోక కళ్యాణము, ప్రజలకు సుఖశాంతులు చేకూరుతాయి.

ఈనెల 21 నుండి మొదలయ్యే బ్రహ్మోత్సవాలలో భాగంగా 21న ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సాంగ్రహణం, అంకురారోహణ పర్వాలు నిర్వహిస్తారు. 22 ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ట, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6:30 గంటలకు భేరీ పూజ, హవనం, దేవతాహ్వానం నిర్వహిస్తారు.

YADADRI : నరసన్న పెళ్లికి ఏడుకొండ‌ల వెంకన్న ప‌ట్టు వస్త్రాలు

23న ఉదయం తొమ్మిది గంటలకు మత్స అవతార అలంకార సేవ, వేద పారాయణం, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ, 24న ఉదయం 9 గంటలకు వటపత్ర శాయి అలంకార సేవ , రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ, 25 ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణలంకార సేవ, రాత్రి 7 గంటలకు పొన్నవాహన సేవ, 26న ఉదయం 9 గంటలకు గోవర్ధన గిరి దారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహ వాహన సేవ, 27న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, తదుపరి శ్రీ స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు.

28న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార హనుమంత వాహనం సేవ , రాత్రి 8 గంటలకు గజవాహన సేవ, శ్రీ స్వామి అమ్మవార్ల తిరు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. మార్చి 1వ తేదీన ఉదయం 9 గంటలకు గరుడోత్సవము, రాత్రి 7 గంటలకు దివ్యవిమాన రథోత్సవం, 2వ తేదీన ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతో ద్వాసన, 3వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీ స్వామివారికి అష్టోత్తర శతకటాభిషేకం, రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.

ఏడుపాయల జాతర: కన్నుల పండువగా బండ్ల ఊరేగింపు