Vande Bharat | ఏపీ, తెలంగాణకు మరో రెండు వందే భారత్‌లు..! 12న గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ప్రధాని మోదీ..!
భారతీయ రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రయాణికుల సౌకర్యార్థం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది

Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రయాణికుల సౌకర్యార్థం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ మధ్య పలు రైళ్లు నడుస్తున్నాయి.
ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రస్తుతం విశాఖపట్నం-హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్, కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ, విజయవాడ-చెన్నై-విజయవాడ మధ్య రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అయితే, ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా పది వందే భారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఇందులో భువనేశ్వర్-విశాఖపట్నం ఒకటి. దీనికి తోడు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మరో రైలును సైతం ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు నడుస్తున్నది. వందశాతం ఆక్యుపెన్సీ ఉండడంతో మరో రైలును తీసుకురావాలని రైల్వేశాఖ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత వందే భారత్ విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం (20833- 20834) రైలు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. రాజమండ్రి (7.55గంటలు), విజయవాడ (10), ఖమ్మం (11), వరంగల్ (12.05) స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరిగి 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తుంది. తాజాగా తీసుకురానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం మినహా అన్ని రోజుల్లోనూ అందుబాటులో ఉంటుంది.
ఈ రైలు 5.05 గంటలకు సికింద్రాబాద్ (20707) నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖకు చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2.35గంటలకు విశాఖ(20708)లో బయలుదేరి రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. ఇక పూరీ-విశాఖపట్నం-పూరీ (20841-20842) రైలు శనివారం మినహా మిగతా ఆరు రోజుల్లో రైలు నడుస్తుంది. పూరీలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 3.40కి బయలుదేరి రాత్రి 9.55 గంటలకి పూరికి చేరుకుంటుంది. ఇరుమార్గాల్లో కుర్దా రోడ్, బ్రహ్మపురం, పలాస, శ్రీకాకుళం రోడ్‌లో ఈ రైలు ఆగుతుంది.