మళ్లీ ఉమ్మడి రాజధాని లొల్లి వెనుక ఎవరున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏర్పాటు చేసిన పదేళ్ల ఉమ్మడి రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది

ఏపీ హైకోర్టులో పిల్‌తో తెరపైకి మళ్లీ వివాదం
వైసీపీ వ్యూహమే అంటున్న ఏపీ విపక్షాలు
‘ఉమ్మడి’ వాదన అర్థరహితమని వ్యాఖ్యలు
వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు
వైసీపీ నాయకుల్లోనూ భిన్నాభిప్రాయాలే
విధాత, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏర్పాటు చేసిన పదేళ్ల ఉమ్మడి రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌ను మరో పదేళ్లపాటు ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు వీలుగా చట్టం తేవాలని, ఇందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాసంక్షేమ సేవాసంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడం ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. ఇప్పటికే వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరికొన్నాళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారమే రేపాయి. ఇదే డిమాండ్‌తో తాజాగా ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. మరో నెల రోజులు అటూఇటుగా పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి రావడం వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనం దాగుందన్న చర్చ నడుస్తున్నది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కాదని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. న్యాయపరమైన వివాదాలతో మూడు రాజధానుల అంశం పెండింగ్‌లో ఉందని, ఆ వివాదం పూర్తయ్యే వరకూ హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనేది ఆయన వాదన. ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలలో భిన్నాభిప్రాయాలు వెలువడగా, ఏపీ విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యల దుమారం అలా ఉండగానే.. హైకోర్టులో దాఖలైన పిల్ ఈ వివాదాన్ని మరింత రాజేసినట్లయ్యింది.
కేంద్ర విధానాలతోనే ఏపీకి రాజధాని లేదు
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ విధానాన్ని అనుసరించడం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషన్లో పేర్కొన్నారు. విభజన చట్ట నిబంధనలు అమలుకానందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందనేది పిటిషనర్ వాదన.
ఇప్పుడే ఎందుకిలా..?
నెల రోజుల వ్యవధిలో దేశంలో పార్లమెంటు ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో మళ్లీ ఉమ్మడి రాజధాని వివాదాన్ని ఎవరు? ఎందుకు తెరపైకి తెస్తున్నారన్న చర్చలు రచ్చ రేపుతున్నాయి. 2019లో తెలంగాణ మంత్రివర్గం కోరిక మేరకు హైదరాబాద్‌పై హక్కులన్నీ జగన్ ప్రభుత్వం వదిలేసుకుంది. అప్పటి వైఖరికి భిన్నంగా తాజాగా మరికొన్నాళ్లు హైదరాబాద్ రాజధానిగా ఉండాలని వైసీపీ నేతలు కోరుకోవడం విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏపీకి సంబంధించిన ఒక్క కార్యాలయం కూడా లేదు. గత ఐదేళ్లలో హైదరాబాద్‌పై ఉన్న ఉమ్మడి హక్కును ఎప్పుడూ వినియోగించుకోని వైసీపీ.. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా, ఏపీలో రాజధాని లేనందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరడం విమర్శల పాలైంది. హైదరాబాదే రాజధాని అన్న సెంటిమెంట్‌తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలు, ప్రాజెక్టుల నిర్వహణ వివాదం నడుస్తున్న వేళ.. తెలుగువారి రాజధాని నగరం హైదరాబాద్ అన్న విషయం అందరూ మరిచిపోతున్న దశలో ఈ వివాదం ఆసక్తికరంగా మారింది
వైసీపీ రాజకీయ వ్యూహామేనా..?
ఉమ్మడి రాజధాని వాదం అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీ రాజకీయ వ్యూహమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వివాదం తెచ్చారని అంటున్నాయి. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించింది. దాని ప్రకారం ఈ ఏడాది జూన్ వరకు గడువు ఉంది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చేసింది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీ భవనాలన్నింటినీ జగన్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది.
గత ఐదేళ్లుగా అమరావతి రాజధానిపై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించింది. తాను త్వరలో విశాఖ నుంచే పరిపాలించబోతున్నట్టు సీఎం జగన్ కూడా పలు సందర్భాల్లో ప్రకటించుకున్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో భ్రమలు కల్పించారని విమర్శించిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో అమరావతి అభివృద్ధికి చేసిందేమీ లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. అంతేకాకుండా మూడు రాజధానుల పేరుతో అమరావతి ప్రాధాన్యాన్ని తగ్గించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో మూడు రాజధానులకు తగ్గట్టు ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. రాజధాని అంశంపై నెలకొన్న న్యాయ చిక్కులతో అమరావతి దాటి ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు. మరో నెల రోజుల వ్యవధిలో ఎన్నికలు జరుగుతాయనగా, ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తెరపైకి తేవడం కేవలం ఎన్నికల ఎత్తుగడగా అనుమానిస్తున్నారు పరిశీలకులు.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికేనా?
అమరావతి అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ గొప్పలు చెప్పిన టీడీపీ ప్రభుత్వం.. అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌ను వదిలేసి వచ్చేసింది. ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ కూడా హైదరాబాద్‌పై ఏ హక్కు లేకుండా పూర్తిగా ధారాదత్తం చేసేసింది. ఇప్పుడు ఏపీ గుర్తుగా ఏమీ లేని హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని ప్రతిపాదన చేయడం విడ్డూరంగా ఉందంటున్నాయి విపక్షాలు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికే ఇటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ కూడా ఉమ్మడి రాజధాని ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
సెంటిమెంట్ రగిలించాలనే వ్యూహమా..ఎన్నికల ఎత్తుగడనా?
వైసీపీ తన పాలనలో మూడు రాజధానులను తెరపైకి తెచ్చి ఏపీకి రాజధానే లేకుండా చేసిందనే అప్రతిష్ఠను మూటగట్టుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదొక గట్టి ప్రచారాంశంగా ప్రతిపక్షాలు ఇప్పటికే అందుకున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై పంచాయితీ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో హైదరాబాద్‌ను కూడా వివాదం చేయడం ద్వారా ప్రజల్లో భావోద్వేగం రగిల్చి.. ఓట్లు దండుకునేందుకు వైసీపీ ఎత్తుగడేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీగాక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంటు ఎన్నికల దిశగా అష్టకష్టాలు పడుతున్న తన రహస్య మిత్రుడు బీఆరెస్‌కు ఎన్నికల వేళ బూస్టు అందించడంతో పాటు తనకు గిట్టని సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసేందుకు ఉమ్మడి రాజధాని అనే కందిరీగల తుట్టెను కదిలించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందే సాగర్ డ్యాంపై 1500మంది పోలీసులతో రచ్చ చేసి బీఆరెస్‌కు మేలు చేసే ఎత్తు వేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు..పార్లమెంటు ఎన్నికల క్రమంలో ఉభయ కుశలోపరిగా ఉమ్మడి రాజధాని వివాదాన్ని రగిలించి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఉమ్మడి రాజధాని కొనసాగింపు అర్థరహితం : ఏపీ విపక్షాలు
ఉమ్మడి రాజధానిపై వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి వాదనలు, తాజాగా పిల్‌ను ఏపీ విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. ఈ వివాదంపై ఇప్పటికే స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు గతంలో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఇచ్చినప్పుడు వాడుకోలేకపోయారని, ఇప్పుడు అదే వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాంటూ మండిపడ్డారు. ఐదేళ్లు అధికారమిస్తే ఒక్క రాజధాని కూడా నిర్మించలేదని, మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికల వేళ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొనసాగింపు కోరడం సెంటిమెంట్‌ను రగిలించే ఎత్తుగడేనని, రాజధాని అంశంలో వైసీపీ తన వైపల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చే వ్యూహామేనని విమర్శించారు. ఇక ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాస్ రావు అయితే మళ్లీ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని అంటే జనం ఉమ్మేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. మూడు రాజధానులంటూ జగన్ అసలు ఏ రాజధానీ లేకుండా చేశారని తప్పుబట్టారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగితే మంచిదేనంటూ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి.. తమ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మద్దతు పలికారు. అదే సమయంలో మరో మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదని తోసిపుచ్చారు. ఉమ్మడి రాజధాని అడగడానికి తామేమైనా పిచ్చోళ్లమా అని ప్రశ్నించారు. అనుభవం ఉన్న నేత ఎవరూ ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరంటూ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల రాజధాని నిర్మాణంలో వైసీపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపు వాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు.