విధాత: ఇందుమూలంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు తెలియజేయునది ఏమనగా… రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయహో.. ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ వస్తున్న పుకార్లను క్యాడర్.. ప్రజలు నమ్మవద్దని వైఎస్సార్సీపీ అధిష్టానం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తెలియజేస్తున్నారహో.. అవునట.. అందరూ ఏదేదో అనుకుంటున్నారు గానీ జగన్( jagan) మాత్రం ముందస్తుగా అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్ళేది లేదని అంటున్నారు.
మొన్న పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో కూడా ఆయన ఇదే మాట అన్నారు. మరో 14 నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని అన్నారే తప్ప ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని అనలేదు. కాబట్టి ఉత్తుత్తి మాటలు నమ్మక్కర్లేదని క్యాడర్ అంటున్నారు.
ఇప్పటికే గ్రామ సారథుల నియామకం…
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాలన్నదే జగన్ ఆలోచన అని చెబుతున్నారు. దాని వల్లనే పార్టీకి లాభం అని జగన్ భావిస్తున్నారట. కాస్త టైం తీసుకుని కొన్నికొన్ని పనులు పూర్తి చేసి కంప్లీట్ కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ప్లాన్. ఇప్పటికే గ్రామ సారథులను నియమించారు. వాళ్ళు ఓటర్లను తమవైపు తిప్పుకునే పనుల్లో బిజీగా ఉన్నారు ఇంకా విశాఖ రాజధాని అంశం కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది.
జగన్ ప్లాన్ ఏమిటంటే..
మరో వైపు పారిశ్రామికంగా ఇంకొన్ని పరిశ్రమలు ఏర్పాటు ప్రక్రియ చేపడితే కొంత మైలేజీ వస్తుంది. ఇంకా రోడ్లు.. ఆస్పత్రులు.. స్కూళ్ల వంటి పనులు ఇంకా పూర్తికాలేదు. అవన్నీ గ్రాండ్ గా పూర్తి చేసి ఎన్నికలకు వెళితే ప్రజాల్లోనూ ఓ పాజిటివ్ వేవ్ ఉంటుందన్నది జగన్ ప్లాన్.
ఒక నిర్ణయానికి వచ్చిన జగన్…
అధికారంలో ఉన్న పార్టీకి ప్రతీ రోజూ విలువైనదే. పైగా ప్రజలలో ఏ వర్గాలు దూరంగా ఉన్నారు. ఎవరు అసంతృప్తిగా ఉన్నారు అన్నది ఎప్పటికపుడు సరి చూసుకుంటూ వారిని తమ వైపునకు తిప్పుకునే అవకాశం అధికారంలో ఉన్న వారికే ఉంటుంది. అందువల్ల ఎంతో విలువైన పద్నాలుగు నెలల అధికారాన్ని వైసీపీ వదిలేసుకుని ముందస్తు ఎన్నికలు వెళ్ళేది లేదని అంటున్నారు. ఇవన్నీ బాగా ఆలోచించిన మీదటే జగన్ ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.