AP | గెలుపుతో టీడీపీ ఉత్సాహం.. వరుస వైఫల్యాలతో YCP అలర్ట్‌

నాలుగు సీట్లు గెలువగానే టీడీపీ నేతల అత్యుత్సాహం నలుగురిపై వైసీపీ వేటు వేయగా.. మాతో 40 మంది టచ్‌లో ఉన్నారంటూ సంచలన కామెంట్లు ఇవి వైసీపీని అలర్ట్‌ చేయడమే అనే వాదన పొత్తులపై కొందరి నేతల భిన్న స్వరాలు జనసేన, టీడీపీలు మధ్య దూరం పెరిగితే.. అంతిమంగా లాభం ఏ పార్టీకి? ఉన్నమాట: ప్రభుత్వ పనితీరు ప్రజాతీర్పే గీటురాయి. దీన్నిఅంగీకరిస్తున్నదే. అందుకే ఎన్నికల్లో ఓటు ద్వారా వెల్లడయ్యే ప్రజాభిప్రాయానికి అంత విలువ ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో […]

  • By: krs    latest    Mar 31, 2023 5:40 PM IST
AP | గెలుపుతో టీడీపీ ఉత్సాహం.. వరుస వైఫల్యాలతో YCP అలర్ట్‌
  • నాలుగు సీట్లు గెలువగానే టీడీపీ నేతల అత్యుత్సాహం
  • నలుగురిపై వైసీపీ వేటు వేయగా.. మాతో 40 మంది టచ్‌లో ఉన్నారంటూ సంచలన కామెంట్లు
  • ఇవి వైసీపీని అలర్ట్‌ చేయడమే అనే వాదన
  • పొత్తులపై కొందరి నేతల భిన్న స్వరాలు
  • జనసేన, టీడీపీలు మధ్య దూరం పెరిగితే.. అంతిమంగా లాభం ఏ పార్టీకి?

ఉన్నమాట: ప్రభుత్వ పనితీరు ప్రజాతీర్పే గీటురాయి. దీన్నిఅంగీకరిస్తున్నదే. అందుకే ఎన్నికల్లో ఓటు ద్వారా వెల్లడయ్యే ప్రజాభిప్రాయానికి అంత విలువ ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో వైసీపీ 151 స్థానాల్లో గెలువగా టీడీపీ 23 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జనసేన 5. 54 శాతం ఓట్లతో ఒక్క స్థానంలోనే గెలుపొందింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గాజువాక, భీమవరం పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోయాడు. దీంతో ఈ నాలుగేళ్ల కాలంలో వైసీపీ, టీడీపీల మధ్య రాజధాని అమరావతి అంశంపైనే రాజకీయాలు నడుస్తున్నాయి.

ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. దీనిపై భారత అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించనున్నది. ఇదే అంశంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను, అక్కడి రాజధాని ప్రజల ఏండ్ల తరబడి నిరసనలను వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాదు జగన్‌ ఇప్పటికే అనేకసార్లు విశాఖపట్నమే ఏపీ రాజధాని అని ప్రకటిస్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు.

ఇటీవల ఏపీలోజరిగిన గ్రాడ్యూయేట్‌ స్థానాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో ఆ పార్టీకి ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అలాగే ఎమ్మెల్యే కోటాలోనూ వైసీపీకి టీడీపీ షాక్ ఇచ్చింది. ఆ స్థానాల్లో వైసీపీ 5 సీట్లలో గెలువగా.. టీడీపీ అనూహ్యంగా ఒక స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి అనురాధ 23 ఓట్లతో సంచలన విజయం సాధించింది. వైసీపీ అధినేతను కలవరపరిచే అంశం ఏమిటి అంటే ఉత్తరాంధ్ర గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందడం. ఆ షాక్‌ను ఆయన తేలుకోకముందే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ-5, టీడీపీ-1 స్థానాల్లో విజయం సాధించి మరో షాక్‌ ఇచ్చింది.

టీడీపీ అభ్యర్థి అనురాధ 23 ఓట్లతో గెలుపొందారు. దీంతో వైసీపీ వెంటనే ఆత్మప్రబోధానుసారం ఓటు వేశామని చెప్పిన 4 ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలపై వేటు వేసింది. గత ఎన్నికల్లో 23 సీట్ల దక్కించుకున్న టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు.

దీంతో టీడీపీకి గెలుపునకు అవసరమైన నాలుగు ఓట్లను వైసీపీ ఎమ్మెల్యేల నుంచి రాబట్టుకున్నది. ఇందులో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు జగన్‌పై, ఆయన ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. వీళ్లు పార్టీ విప్‌ ధిక్కరిస్తారని, వ్యతిరేకంగా ఓటు వేస్తారని అందరూ ఊహించిందే. కానీ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వారితో జట్టుకట్టడంతో జగన్‌ పార్టీ చర్యలకు ఉపక్రమించింది.

అయితే వరుసగా కొన్ని విజయాలతో టీడీపీ నేతలు ఉత్సాహంతో ఏదోదో మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉండగా.. నలుగురుపై వేటు వేశారని.. అధికారపార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తెలియకుండా వీళ్లు ఆ వ్యాఖ్యలు చేశారని భావించలేము. కానీ వీరి వ్యాఖ్యలు అధికార పార్టీని అలర్ట్‌ చేసినట్టు అనిపిస్తున్నది.

ఎందుకంటే ఇప్పటికే 4 ఎమ్మెల్యేలకు తోడు మరో 40 మంది ఆ పార్టీతో టచ్‌లో ఉంటే మరి ఆస్థానాల్లో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, లేదా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? వీళ్లే కాకుండా జనసేన, వామపక్షాలతో ఆ పార్టీ పొత్తుపెట్టుకోవచ్చనే ప్రచారం జరుగుతున్నది. వీళ్లందరికీ సీట్ల సర్దుబాటు టీడీపీ అధినేతకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతాయే తప్పా అధికారంలోకి రావడానికి దోహదపడేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరోవైపు జనసేనతో పొత్తుకు బీజేపీ తహతహలాడుతున్నది. పొత్తులపై చంద్రబాబుదే తుది నిర్ణయమని నేతలు అంటుండగానే..ఇదే సమయంలోనే ఒకరిద్దరు టీడీపీ నేతలు జనసేనతో తాము కలవాల్సిన పనిలేదని, వాళ్లే తమతో కలవాలనుకుంటున్నారని కామెంట్లు చేశారు. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోననే చర్చ జరుగుతున్నది.

ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ విడిగా పోటీ చేస్తే.. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు. అందుకే నాలుగు సీట్లు గెలిచిన ఆనందంలో.. టీడీపీ నేతలు తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అనే పాటలా వ్యవహరిస్తున్నారని.. అంతిమంగా అది అధికారపార్టీకి మేలుకొలుపునకు ఉపయోగపడేలా చేస్తున్నారని అంటున్నారు.