ఆర్మీ ట్రక్కుపై కాల్పులు.. జవాన్లే లక్ష్యంగా ఉగ్రదాడి..!
భారత జవాన్లను లక్ష్యంగా చేసుకుని జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

న్యూఢిల్లీ : భారత జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో జవాన్లు తరలివెళ్తున్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు.. ఘటనాస్థలానికి అదనపు బలగాలను పంపించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ కాల్పుల ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
గత నెలలో రాజౌరి ఏరియాలో చోటు చేసుకున్న కాల్పుల్లో ఐదుగురు సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ – ఫూంచ్ రీజియన్‌లో జరిగిన రెండు దాడుల్లో 10 మంది సైనికులు చనిపోయారు. గత రెండేండ్ల కాలంలో మొత్తం 35 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.