48 ఏళ్ల త‌ర్వాత చెత్త రికార్డ్ ఖాతాలో వేసుకున్న ఆసీస్.. సౌతాఫ్రికాపై ఘోర ప‌రాజ‌యం

  • By: sn    latest    Oct 13, 2023 3:17 AM IST
48 ఏళ్ల త‌ర్వాత చెత్త రికార్డ్ ఖాతాలో వేసుకున్న ఆసీస్.. సౌతాఫ్రికాపై ఘోర ప‌రాజ‌యం

వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో భాగంగా హాట్ ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా వ‌రుస ప‌రాజ‌యాల‌తో నిరాశ‌ప‌రుస్తుంది. ఇప్ప‌టికే ఇండియా మీద ఓడిన ఆసీస్ జ‌ట్టు తాజాగా జ‌రిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 134 పరుగుల తేడాతో ఓడింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల‌లో ఆసీస్ పెద్ద‌గా ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌డంతో ఆసీస్‌కి ఓట‌మి త‌ప్ప‌లేదు.



ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 311 పరుగుల భారీ స్కోరు న‌మోదు చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్ 109 పరుగులు చేసి, వరల్డ్ కప్‌లో రెండో సెంచరీ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక మార్క్‌రమ్ 56 పరుగులు , తెంబ భవుమా 35, వాన్ దేర్ దుస్సేన్ 26, హెన్రీచ్ క్లాసిన్ 29 విలువైన ప‌రుగులు న‌మోదు చేశారు.



ఇక 312 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్‌కి ర‌బ‌డా చుక్క‌లు చూపించాడు. దీంతో ఆస్ట్రేలియా 70 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.. 1983 తర్వాత 70 పరుగుల లోపు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోవడం వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌న‌ర్హం.



అయితే వ‌రుస వికెట్స్ ప‌డుతున్న స‌మ‌యంలో మార్నస్ లబుషేన్, మిచెల్ స్టార్క్ కలిసి ఏడో వికెట్‌కి 99 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో ఆసీస్ కాస్త కోలుకుంది. అయితే 51 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన మిచెల్ స్టార్క్, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..కొద్ది సేప‌టికి మార్నస్ లబుషేన్, 74 బంతుల్లో 3 ఫోర్లతో 46 పరుగులు చేసి కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయి పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు.



ప్యాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా కలిసి 9వ వికెట్‌కి 35 బంతుల్లో 32 పరుగులు జోడించి విలువైన భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఆ త‌ర్వాత క‌మ్మిన్స్ ఔట్ కాగా, త‌ర్వాత హజల్‌‌వుడ్ కూడా 2 పరుగులు చేసి అదే ఓవర్‌లో అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి తెరపడింది. ప్రపంచకప్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచి పూర్తి ఆధిపత్యం క‌న‌బ‌ర‌చిన‌ ఆసీస్.. ఇప్పుడు వరుస పరాజయాలతో అప్రతిష్టను మూటగట్టుకొని టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది.



ఆ జట్టు రన్‌రేట్ కూడా( -1.846) నెగటివ్‌కి చేరుకుంది. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిన ఆసీస్.. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 10 పరుగులతో ఓట‌మి పాలైంది.




దీంతో వ‌ర‌ల్డ్ క‌ప్‌లో వ‌రుస‌గా నాలుగు ప‌రాజ‌యాలు చ‌వి చూసింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలు కావడం అంద‌రిని ఆశ్చర్య‌ప‌రుస్తుంది. ఈ టోర్నీలో ఆసీస్ సెమీస్ చేరాలంటే మంచి ర‌న్‌రేట్‌తో మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం 6 మ్యాచ్‌లు అయినా గెలిచి తీరాలి.