BRS
విధాత బ్యూరో, కరీంనగర్: ‘అధిష్టానం ఆశిస్తున్న రీతిలో ఇక్కడేమీ పార్టీ పరిస్థితి మెరుగు పడలేదు.. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న నేతలను పట్టించుకునే వారు లేరు.. తన అవినీతికి, అక్రమాలకు కొమ్ము కాసిన వారికి మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారంటూ, ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పార్టీ కౌశిక్ రెడ్డి పై జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి పార్టీ అధినేత కెసిఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావుకు ఫిర్యాదు చేశారు.
ఈ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఇటీవలి వరుస వివాదాలతో తల బొప్పి కట్టడంతో, వాటి నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్న కౌశిక్ రెడ్డి ఈ లేఖతో మరోమారు చిక్కుల్లో పడినట్టేనని నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతుబంధు, రైతు భీమా, దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలు హుజురాబాద్ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి ప్రారంభించిన విషయాన్ని సమ్మిరెడ్డి తన లేఖలో గుర్తు చేశారు.
ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసినా, ఇదే నియోజకవర్గానికి చెందిన పలువురికి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. 2000 కోట్లతో 20 వేల దళిత కుటుంబాలకు ‘దళిత బంధు’ పైలెట్ ప్రాజెక్టు హుజురాబాద్ లో ఆరంభించి, ఇక్కడి దళితులకు అందించినా, పలువురికి రాష్ట్రస్థాయి పదవులు కట్టబెట్టినా, పార్టీ ప్రజలతో మమేకం కాలేకపోతోందని ఆయన తన లేఖలో కుండబద్దలు కొట్టారు.
నియోజకవర్గంలోని వాస్తవ పరిస్థితులు ముఖ్య మంత్రి వరకు చేరకుండా తనకు అనుకూలంగా ఉన్న అధికారులకు ఇక్కడ పోస్టింగులు ఇప్పించుకున్న కౌశిక్ రెడ్డి వారిచే అంతా బాగుందనే నివేదికలు పంపిస్తున్నారని చెప్పారు. ఈ నియోజకవర్గంలోని వాస్తవ పరిస్థితులు అధిష్టానం దాకా చేరకుండా ఎమ్మెల్సీ ఆయన మద్దతుదారులైన అధికారులు దాచిపెడుతున్నారని చెప్పారు.
‘ఇక్కడి ప్రజలు మన పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.. మండల స్థాయి నేతలు వర్గాలుగా ఏర్పడి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల కారణంగా అనేకమంది కార్యకర్తలు, నేతలు పార్టీని వీడిపోయే ప్రమాదం ఉందన్నారు.
వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించాలని, ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని సమ్మిరెడ్డి తన లేఖలో కోరారు.