అసమ్మతులకు, వలస నేతలకు పదవుల ఎర!

- ఉన్నవి కోన్నే.. ఆశావాహులెందరో…
- అధికార పార్టీకి నేతల తాకిడి
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో విపక్షపార్టీలో నేతలెవ్వరూ ఉండ కూడదన్నలక్ష్యంగా అధికార పార్టీ విపశక్ష పార్టీలలోని బలమైన నేతలకు గాలం వేసింది. ఇలాంటి వలస నేతలందరికి పదవులు ఇస్తామని వరుసగా హామీలు ఇచ్చింది. అలాగే పార్టీ టికెట్లు ఆశించిన చాలా మంది నేతలకు టికెట్లు రాలేదు. దీంతో అసమ్మతి నేతలకు, పదవులు ఇస్తామని ఆశ చూపించింది. అసమ్మతి గళం వినిపిస్తున్ననేతల సముదాయింస్తున్న అగ్ర నేతలు మనం అధికారంలోకి వస్తున్నాం…ప్రమాణ స్వీకారం అయిన వెంటనే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెపుతున్నారు.
ఇలా నామినేటెడ్ పోస్టుల తాయిలాలు అసమ్మతి నేతలను సముదాయించడానికి బాగా ఉపయోగపడుతున్నాయన్నఅభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. అలాగే కాస్త పెద్ద స్థాయి అసమ్మతి నేతలకు నామినేటెడ్ పోస్టుల కంటే కూడా రాజ్యసభ, శాసనమండలికి ఎంపిక చేస్తామని ఇస్తున్న హామీలు ఆయా నేతలకు ఊహాలోకంలోకి తీసుకు వెళుతు న్నాయి. ఇలా అగ్ర నేతలు ఇస్తున్న హామీలతో ఆయా నాయకులు తమకు తప్పకుండా పదవులు వస్తాయన్న ధీమాతో బరిలోకి నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించి పని చేస్తున్నారు. ఇలా వివిధ పార్టీ ల నుంచి వచ్చిన నేతలకు ఇస్తున్న హామీలతో ఇప్పటికే ఓవర్‌లోడ్‌తో బిఆర్ఎస్ పార్టీ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే పార్టీ అధినేత నాయకులకు ఇస్తున్న హామీల మేరకు పదవులున్నాయా? అన్న చర్చ కూడా పార్టీ నాయకుల్లో జరుగుతోంది. వాస్తవంగా 2024లో మూడు, 2026లో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. ఇలా రాజ్యసభలో రాబోయే రెండేళ్లలో 5 స్థానాలు ఖాళీ అవుతాయి. ఇదే తీరుగా రాబోయే రెండేళ్లలో ఏడు శాసనమండలి స్థానాల్లో ఖాళీ అవుతాయి. ఇలా ఖాళీ అయ్యే రాజ్యసభ, శాసన మండలి స్థానాల్లో పాతవారిని కొనసాగిస్తారా? లేదా కొత్తనేతలతో భర్తీ చేస్తారా? అన్నది పెద్ద మిస్టరీ. బీఆరెస్ అధినేత చివరి నిమిశం వరకు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా మంది సీనియర్‌నేతలు, మాజీ మంత్రులు బీఆరెస్‌లో చేరారు. వీరు కాకుండా టికెట్లు ఆశించిన వారు సొంత పార్టీ కూడా ఉన్నారు. దీంతో ఉన్న పదవులకు , ఆశావాహులకు మధ్య పొంతన కుదరడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాంటప్పుడు ఏవిధంగా అందరికి పదవులు సర్దుబాటు చేస్తారన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది.
2024 ఏప్రిల్ 2న జోగినపల్లి సంతోష్ కుమార్, వద్ధిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, 2026 ఏప్రిల్‌లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, మాజీ స్పీకర్ కె.ఆర్. సురేష్‌రెడ్డిల పదవీకాలం ముగిస్తుంది. వచ్చే ఆరు నెలల్లో 3 సీట్లు, మరో రెండేళ్లకు 2 సీట్లు ఖాళీ అవుతాయి. కాగా తాజాగా పార్టీ మారిన మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి వంటి నేతలకు రాజ్యసభ హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
శాసనమండలిలో వచ్చే ఖాళీలపైనా చాలా మంది నేతలు కన్నేశారు. సమయానుకూలంగా బిఆరెస్ అధిష్టానంతో హామీలు పొందిన నేతలు వాటిని పదేపదే గుర్తుచేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బిఆరెస్‌లో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ వంటి నేతలకు మండలి సభ్యత్వాన్ని ఇస్తామన్నారు. మొదటి నుంచి ఎమ్మెల్సీ, ఎంపీ హామీలను పొందిన నేతల జాబితా చాలా పెద్దగా ఉందని పార్టీ నాయకుడొకరన్నారు. 2025 మార్చి వరకు మండలిలో ఖాళీలు లేవు. మంత్రులు మహ్మద్ అలీ, సత్యవతి రాధోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేషం, మీర్జా రియాజ్ ఉల్‌హసన్ (ఎంఐఎం) ఎమ్మెల్సీ పదవీకాలం 2025 మార్చిలోపూర్తవుతుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న ఎంఎస్ ప్రభాకర్ సభ్యత్వం 2025, ఆగస్టు మొదటివారంలో ముగుస్తుంది.
ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడికౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు బిఆరెస్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. ఇదేవిధంగా కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి , కసిరెడ్డి నారాయణ రెడ్డిలు పోటీచేస్తున్నారు. వీరు అసెంబ్లీకి ఎన్నికైతే ఈ స్థానాలు ఖాళీ అవుతాయి. వీటికి అదనంగా మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల సభ్యులుగా ఉన్న కూచుకుళ్ల దామోదర రెడ్డి కుమారుడు నాగర్ కర్నూలు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. ఫలితాల అనంతరం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర రెడ్డిలపై అనర్హత వేటు వేసి, ఆయా స్థానాల్లో సర్ధుబాటు చేస్తామని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన వర్గీలు చెపుతున్నారు. ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, సొంత పార్టీలో పోటీ చేసే అవకాశం రానీ నేతలకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. అయితే ఉన్న పదవులకు, ఇచ్చిన హామీలకు పొంతన కుదరడం లేదని, ఏవిధంగా నేతలకు పదవుల పంపిణీ చేస్తారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.