జంటనగరాల్లో వైన్స్‌ల బంద్.. గణేష్ నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు

విధాత: వినాయక నిమజ్జనోత్సవం నేపథ్యంలో గురువారం వైన్స్‌లు, బార్‌లు మూసివేయనున్నారు. నేడు ఉదయం ఆరుగంటల నుంచి రేపు శుక్రవారం ఉదయం 6గంటల వరకు బంద్ అమలులో ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవానికి జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు అవసరమైన ఏర్పాట్లు, బందోబస్తు చేపట్టాయి.
గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో 90వేల గణేష్ విగ్రహాలను ప్రతిష్టించారు. ఇందులో ట్యాంకుబండ్‌లో పీవోపీతో తయారుకాని 30వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఇందుకోసం ట్యాంకుబండ్ పరిసరాల్లో 14క్రేన్లను ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా పీవోపీ వినాయక విగ్రహాల కోసం 72బేబీఫాండ్(కృత్రిమ ట్యాంకు)లను ఏర్పాటు చేశారు.
చెరువుల ప్రక్కన మరో 28బేబీ చెరువులను ఏర్పాటు చేశారు. వీటిలో 10నుండి 12అడుగుల విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఒకేసారి 60కి పైగా విగ్రహాలను నిమజ్జనం చేసి వెంటనే వాటి వ్యర్థాలనుల పక్కకు తొలగించే విధంగా చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, విద్యుత్తు, అగ్నిమాపక, పోలీస్, ఇరిగేషన్ సిబ్బంది, గజ ఈతగాళ్లను, అత్యవసర బోట్‌లను ఏర్పాటు చేశారు.