మీరు ఏ దేశానికి భక్తులు?.. పాకిస్తాన్‌కా… ఆఫ్గనిస్తాన్‌కా?: బండి సంజయ్

- దారుస్సలాంపై జెండా ఎగరేసే సత్తా మాకుంది
- దాడులకు యత్నించిన మజ్లిస్ నాయకులపై చర్యలేవి?
- ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలపైనే ఉల్టా కేసులా?
- మజ్లిస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్
విధాత బ్యూరో, కరీంనగర్: దేశభక్తులమని చెప్పే ఎంఐఎం నాయకులు ఏ దేశానికి భక్తులు… పాకిస్తాన్ కా? ఆఫ్గనిస్తాన్ కా? అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
శనివారం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలు దేరేముందు, కరీంనగర్ ఘటనతోపాటు బీఆర్ఎస్, ఎంఐఎం తీరును తప్పుపడుతూ వీడియో సందేశాన్ని పంపారు. బీజేపీ కార్యకర్తలు దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలని తెలిపారు. తెలంగాణలో, కరీంనగర్ లో ప్రశాంతంగా ఉండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.
అయితే బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ కలిసి విధ్వంసం సృష్టించాలని కుట్ర చేస్తున్నట్టు ఆరోపించారు. మతం రంగు పులిమి బదనాం చేయాలని చూస్తున్నాయన్నారు. బీఆర్ఎస్, ఎంఐంఎం నేతలు విధ్వంసం సృష్టిస్తున్నా, కుట్రలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. దాడులు చేశారని ఫిర్యాదు చేసిన బీజేపీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారంటే, పోలీసులు తీరు ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ‘
బీజేపీ కార్యకర్తలేమైనా దారుస్సలాం ఎంఐఎం ఆఫీస్ పై దాడికి పోయారా? వారి కార్యకర్తల ఇళ్లపై దాడులకు పోయారా? మా ధైర్యాన్ని, సాహసాన్ని పిరికితనంగా భావిస్తే ఖబడ్దార్. దారుస్సలాంపై జెండా ఎగరేస్తాం. అనవసరంగా మమ్ముల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు. ఎంఐఎం అడ్డా అని చెప్పుకున్న పాతబస్తీకి పోయి కాషాయ జెండా ఎగరేసిన చరిత్ర మాది’ అన్నారు.
కేసీఆర్ రాజ్యాంగంలో మజ్లిస్ నాయకులకు మాత్రమే రక్షణ ఇవ్వాలని ఉందా? ప్రజా సమస్యలపైన పోరాడే బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్ట్ చేసి వేధించాలని ఉందా? అంటూ పోలీసులను ప్రశ్నించారు. ‘ఏనాడైనా మీ నోటి నుండి జాతీయ గీతం జనగణమణ, వందేమాతరం ఆలపించారా? అసలు మీకు జనగణమణ, వందేమాతరం ఆలపించడం వచ్చా? నేను సవాల్ చేస్తున్నా. మీరు నిజంగా భారత దేశ భక్తులైతే, మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే, పాకిస్తాన్ వారసులు కాదని భావిస్తే… మీ పార్టీ ప్రజా ప్రతినిధులందరితో కలిసి పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు రండి.
అందరి సమక్షంలోనే జాతీయ గీతాలను ఆలపించండి. ఇదే నా ఛాలెంజ్. మీకు దమ్ముంటే ఈ దేశ భక్తులే అయితే నా సవాల్ కు సిద్ధం కావాలి. ఎంఐం దేశ ద్రోహుల పార్టీ. దేశ ద్రోహులు చస్తే సంతాప సభలు నిర్వహించే పార్టీ. మిమ్ముల్ని అడ్డుకుంటాం. అరాచకాలను ఆపేదాకా బీజేపీ పోరాడుతుంది. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేసి అక్రమ కేసులు పెట్టిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.