Bangalore
న్యూఢిల్లీ: అధికార, విపక్షాల మధ్య స్పష్టమైన విభజన రేఖ దిద్దుకున్నది. బీజేపీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా ఎదుర్కొనాలని ఇప్పటికే పాట్నా భేటీలో నిర్ణయానికి వచ్చిన విపక్షాలు.. దానికి కొనసాగింపుగా బెంగళూరులో రెండు రోజులపాటు కీలక వ్యూహరచనలో నిమగ్నం కానున్నాయి. ఇప్పటి వరకూ ఆప్ హాజరుపై సందిగ్ధత నెలకొన్నా.. ఢిల్లీ సర్వీసెస్ అధికారుల నియంత్రణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను తాము సమర్థించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ విస్పష్టంగా తేల్చి చెప్పడంతో వాతావరణం మారిపోయింది.
కాంగ్రెస్ నిర్ణయాన్ని సానుకూల పరిణామంగా అభివర్ణించిన ఆప్.. అనంతరం నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో బెంగళూరు సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించింది. దీంతో ప్రతిపక్షాల ఐక్యతకు మరింత బలం చేకూరినట్టయింది. మరోవైపు విపక్షాల భేటీకి పోటీగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు సోమవారమే ఢిల్లీలో సమావేశం కానున్నాయి. విపక్షాల సమావేశ ఏర్పాట్లను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా పర్యవేక్షిస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఆహ్వానాలు పంపారు. గత సమావేశానికి 17 పార్టీలు హాజరైతే.. ఇప్పడు 24 పార్టీల నేతలు హాజరుకానుండటంతో విపక్షాల్లో ఉత్సాహం నెలకొన్నది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు.
ప్రతిపక్షాల నాయకులకు సోనియాగాంధీ సోమవారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరుకానున్నట్టు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ధృవీకరించారు. శివసేన (ఉద్ధవ్) నుంచి ఉద్ధవ్‌ఠాక్రె, సంజయ్ రౌత్, ఆదిత్య ఠాక్రె హాజరువుతున్నారు. సోమవారం బెంగళూరు చేరుకుంటామని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ప్రకటించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తాను హాజరువుతానని ముందే వెల్లడించారు.
ఈ సమావేశంలో మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే), కొంగు దేశ మక్కల్ కచ్చి (కేడీఎంకే), విధుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే), రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆరెస్పీ), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) తదితర పార్టీలు కొత్తగా హాజరవుతున్నాయి.
ఇన్నాళ్లూ ‘నేనే’ అంటూ వచ్చిన బీజేపీ.. దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణలతో అందరినీ కలుపుకొని పోయేందుకు సిద్ధమైంది. తన పాత మిత్రులతోపాటు.. కొత్త మిత్రులతో ఢిల్లీలో సమావేవం నిర్వహిస్తున్నది. బీజేపీ పది రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. దాని మిత్ర పక్షాలు ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నడుపుతున్నాయి. కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. దాని మిత్రపక్షాలు మూడు చోట్ల అధికారంలో ఉన్నాయి.
మిగిలినవాటిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో, తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్నాయి. బీఆరెస్ తాను ఎవరి పక్షమూ కాదని చెబుతుండగా.. వైసీపీ నేరుగా ఎన్డీయేలోకి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. మొత్తంగా ప్రాంతీయ పార్టీలే బీజేపీకి పెను సవాలుగా ఉన్నాయి. కాంగ్రెస్-బీజేపీ పోటాపోటీగా నిలబడే లోక్‌సభ స్థానాలు సుమారు 230 వరకూ ఉంటాయి.
తటస్థంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో బీఆరెస్, బిజు జనతాదళ్, వైసీపీ, బహుజన సమాజ్ పార్టీ, మరికొన్ని ఉన్నాయి. పాట్నా సమావేశం తర్వాత ప్రతిపక్షాల కూటమిలో మరిన్ని పార్టీలు చేరడంతో బీజేపీని నిలువరించగలమన్న ధీమా ఆ కూటమిలో క్రమంగా బలపడుతున్నది.
రాజకీయ పునరేకీకరణ ప్రయత్నాల్లో ఇప్పటి వరకూ తెరవెనుకే ఉన్న సోనియా గాంధీ.. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ సమావేశంలో పాల్గొంటుండటం విశేషం. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, జార్ఖండ్, జమ్ముకశ్మీర్‌లలో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి. ఈ పార్టీలకు లోక్‌సభలో 148 మంది ఎంపీలు ఉన్నారు. విపక్షం బలంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ ఒకటి.
ఇక్కడ బీజేపీని తృణమూల్ కాంగ్రెస్ నేరుగా ఢీకొంటుంది. ఢిల్లీలో ఆప్, కేరళలో వామపక్షాలు కాంగ్రెస్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్నాయి. బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా కదులుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల మధ్య పోటీ నెలకొనే చోట్ల ప్రత్యేక వ్యూహాన్ని రచించాలన్న ఆలోచనలో ప్రతిపక్షాలు ఉన్నాయి.
ప్రతిపక్షాలకు కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించడం అనేది అత్యంత కీలకంగా మారింది. దానితోపాటు.. ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే ప్రధాని అభ్యర్థి ఎవరనేది మరో కీలక అంశంగా ఉన్నది. వీటికంటే ముందు.. లోక్‌సభ ఎన్నికలను నరేంద్రమోదీ ముందుకు జరిపితే ఏం చేయాలనేది మరో టాస్క్. ఈ నేపథ్యంలో అన్ని అంశాలపైన విశాల దృక్ఫథంతో ముందుకు సాగాలనే సంకల్పంలో ప్రతిపక్షాలు ఉన్నాయి.
ఇక ఎన్డీఏ విషయానికి వస్తే.. తెలుగుదేశం, అకాలీదళ్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివసేన చీలిక వర్గం ఎన్డీయేలో ఉన్నట్టే. వాస్తవానికి ఎన్డీయే పక్షాల సమావేశం జరిగి ఏడాది పైనే అవుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత మంది మిత్రులను.. వారు చిన్న శక్తులైనా సరే.. సంపాదించుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నది.
ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ చీలిక వర్గం, లోక్‌జనశక్తి పార్టీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చా, జేడీఎస్ తదితర పార్టీలను దగ్గర చేసుకుంటున్నది. వెరసి.. ఐక్యత కాపాడుకోవటం ప్రతిపక్షాలకు పరీక్ష అయితే.. మిత్రులను సంతోషం పెట్టడం ఎన్డీయేకు పరీక్షగా మారింది.