ఆ చ‌ర్య‌లు మీకే తిప్పికొడ‌తాయి: ఇజ్రాయెల్‌కు ఒబామా హెచ్చ‌రిక‌

ఆ చ‌ర్య‌లు మీకే తిప్పికొడ‌తాయి: ఇజ్రాయెల్‌కు ఒబామా హెచ్చ‌రిక‌

వాషింగ్ట‌న్ : గాజాపై ఇజ్రాయెల్ పాల్ప‌డుతున్న కొన్ని చ‌ర్య‌లు ఆ దేశానికే తిప్పికొట్టే అవ‌కాశం ఉన్న‌ద‌ని అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా హెచ్చ‌రించారు. ఇజ్రాయెల్‌పై హ‌మాస్ దాడుల‌ను తీవ్రంగా ఖండించిన ఒబామా.. త‌న స్వీయ‌ర‌క్ష‌ణ‌కు ఇజ్రాయెల్‌కు ఉన్న హ‌క్కును పూర్తిగా స‌మ‌ర్థించారు. అదే స‌మ‌యంలో ఇటువంటి యుద్ధాల్లో పౌరుల‌కు ఎదుర‌య్యే స‌వాళ్ల గురించి హెచ్చ‌రిక‌లు చేశారు. హ‌మాస్‌పై యుద్ధంలో భాగంగా గాజాలోకి ఆహారం, మంచినీటి స‌ర‌ఫ‌రాను అడ్డుకోవ‌డం వంటి ఇజ్రాయెల్ చ‌ర్య‌ల‌పై అభ్యంత‌రం తెలిపారు.

పాల‌స్తీనియ‌న్ల వైఖ‌రిని కొన్ని త‌రాల‌పాటు అవి క‌ఠినంగా మార్చుతాయ‌ని హెచ్చరించారు. యుద్ధంలో సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు క‌లిగే న‌ష్టాలును విస్మ‌రిస్తున్న ఇజ్రాయెల్ వ్యూహం చివ‌రికి బెడిసికొడుతుంద‌ని అన్నారు. ‘గాజాలో చిక్కుకుపోయిన ప్ర‌జ‌ల‌కు ఆహారం, మంచినీళ్లు, విద్యుత్తు స‌ర‌ఫ‌రాను అడ్డుకోవాల‌న్న ఇజ్రాయెల్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం అక్క‌డ మాన‌వ‌తా సంక్షోభాన్ని తీవ్రం చేయ‌డం మాత్ర‌మే కాదు.. కొన్ని త‌రాల‌పాటు పాల‌స్తీనియ‌న్ల వైఖ‌రిని క‌ఠినంగా మార్చుతుంది. అంతేకాదు.. ఇజ్రాయెల్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా అందుతున్న మ‌ద్ద‌తు తుడిచిపెట్టుకుపోతుంది.

ఇజ్రాయెల్ శ‌త్రువుల చేతిలోకి ప‌రిస్థితి వెళ్లిపోతుంది. ఈ ప్రాంతంలో శాంతి సామ‌ర‌స్యాల కోసం దీర్ఘ‌కాలికంగా జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌కు దెబ్బ‌తగులుతుంది’ అని చెప్పారు. సెప్టెంబ‌ర్ 11 దాడుల త‌ర్వాత యుద్ధంలో నిమ‌గ్నం కావ‌డం ద్వారా అమెరికా త‌న అత్యున్న‌త విలువ‌ల‌కు స్వ‌యంగా దూర‌మైంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అక్టోబ‌ర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హ‌మాస్ తీవ్ర‌వాదులు ఆక‌స్మిక దాడుల‌కు పాల్ప‌డిన ద‌గ్గ‌ర నుంచి గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వ‌ర్షం కురిపిస్తున్న‌ది. హ‌మాస్ దాడిలో 1400 మందికిపైగా చ‌నిపోగా.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ 5వేల మంది చ‌నిపోయారు.

ఒబామా అమెరికా అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో ఇజ్రాయెల్ స్వీయ ర‌క్ష‌ణ హ‌క్కును స‌మ‌ర్థిస్తూ వ‌చ్చారు. అయితే.. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో భారీ సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో పాల‌స్తీనా, ఇజ్రాయెల్ మ‌ధ్య శాంతి ఒప్పందానికి ఒబామా యంత్రాంగం ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం రాలేదు. 2021 మొద‌ట్లో ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన బైడెన్‌.. ఉభ‌య ప‌క్షాలు మొండిప‌ట్టుద‌ల‌తో ఉన్నాయ‌ని, వాతావ‌ర‌ణం కూడా అందుకు త‌గిన విధంగా లేద‌ని చెబుతూ చ‌ర్చ‌ల‌ను పున‌రుద్ధ‌రించేందుకు క‌నీస ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు.