కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చుని స్వామివారికి డిప్యూటీ సీఎం హోదాలో థన్యవాదాలు తెలిపి

కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

విధాత, హైదరాబాద్ : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చుని స్వామివారికి డిప్యూటీ సీఎం హోదాలో ధన్యవాదాలు తెలిపి ఆశీస్సులు పొందేందుకు నిర్ణయించుకోగా దీనిపై వివాదం రేగడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అర్చక పండితుల ఆశీర్వచన సమయంలో సీఎం దంపతులు, ఉత్తమ్, కోమటిరెడ్డి బెంచ్ పై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖలు చిన్న స్టూళ్లపై కూర్చున్నారు. దళితుడు, బీసీలైన భట్టి, సురేఖలకు చిన్న కుర్చీలు వేసి అవమానించారంటూ వివాదం చెలరేగింది.


దీనిపై తాజాగా స్పందించిన భట్టి విక్రమార్క తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నానని స్పష్టం చేశారు. ఆ ఫోటోను ట్రోల్ చేయడాన్ని ఖండించారు. మనసుకు ఇబ్బంది కలిగిన వారు ఆ ఫోటోను ట్రోల్ చేసి ఉంటారని, అయితే ఆలయంలో ఆ సంఘటన ఎవరో కావాలనో, ఉద్దేశపూర్వకంగానో చేసిన చర్య కాదన్నారు. తాను దేవుడికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో అలా చిన్న కుర్చీపై కూర్చున్నానని తెలిపారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా అని అన్నారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదన్నారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదన్నారు. అత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని తెల్చి చెప్పారు.