మెజారిటీ వ‌స్తే.. ఆయ‌నే సీఎం! అమిత్‌ షా మాటల వెనక?

గుజ‌రాత్‌లో గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌ధాన పార్టీల ప్ర‌చారం 7వ సారి ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజీపీ ఎత్తులు అదే దారిలో కాంగ్రెస్‌, ఆప్‌ విధాత: గుజరాత్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌లు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వరుసగా ఆరుస్లారు అధికారంలో కొనసాగుతున్న కాషాయ పార్టీ ఏడో సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. పాటీదార్‌ రిజర్వేషన్ల ఉద్యమం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించిన హార్దిక్‌ […]

  • By: krs    latest    Nov 15, 2022 11:18 AM IST
మెజారిటీ వ‌స్తే.. ఆయ‌నే సీఎం! అమిత్‌ షా మాటల వెనక?
  • గుజ‌రాత్‌లో గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌ధాన పార్టీల ప్ర‌చారం
  • 7వ సారి ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజీపీ ఎత్తులు
  • అదే దారిలో కాంగ్రెస్‌, ఆప్‌

విధాత: గుజరాత్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌లు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వరుసగా ఆరుస్లారు అధికారంలో కొనసాగుతున్న కాషాయ పార్టీ ఏడో సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. పాటీదార్‌ రిజర్వేషన్ల ఉద్యమం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించిన హార్దిక్‌ పటేల్‌, దళిత నేత జిగ్నేష్‌ మేవానీ, ఓబీసీ నేత అప్పలేశ్‌ ఠాకూర్‌ లాంటి వాళ్లు గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశారు.

విపక్షాలను తట్టుకోవడానికి ప్రధాని మోడీ సెంటిమెంట్‌ అస్త్రాన్నివాడారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు వరకు రాష్ట్రంలోనే తిష్టవేసి సీఎం అభ్యర్థి ఎవరైనా తనను చూసే పార్టీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఫలితంగా 182 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలు దక్కించుకున్నది. కాంగ్రెస్‌ పార్టీ 77 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీ అధిష్ఠానం సీఎంగా ఉన్న విజయ్‌రూపానీ స్థానంలో భూపేంద్ర పటేల్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. అప్పలేశ్‌ ఠాకూర్‌, హార్దీక్‌ పటేల్‌ కూడా బీజేపీలో చేరిపోయారు. అయినా ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో 48 శాతం ఉన్న ఓబీసీలు, 11 శాతం ఉన్న పాటీదార్‌లు ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తారు. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఈ వర్గాలను ఆకట్టుకోవడానికే ప్రయత్నిస్తున్నాయి.

రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చాలా శ్రమిస్తున్నది. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా బీజేపీ అధికారంలోకి వస్తే భూపేంద్ర పటేల్‌ సీఎంగా కొనసాగుతారని ప్రకటించారు. ఘాట్‌లోడియా నుంచి మొదటిసారి గెలిచిన ఆయన రెండోసారి కూడా అదే స్థానం నుంచి బరిలో దిగారు. అయితే ఎన్నికలకు కొన్ని నెలల ముందే క్యాబినెట్‌ మంత్రులైన రాజేంద్ర త్రివేదీ, పర్నిష్‌ మోడీల‌ను పదవుల నుంచి తప్పించారు.

బీజేపీ అధిష్ఠానం నిర్ణయం మేరకే వారిద్దని క్యాబినెట్‌ నుంచి తొలిగించారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ నిమిత్త మాత్రుడిగా ఉన్నాడనే విమర్శలు వచ్చాయి. దీంతో మోడీ తర్వాత అక్కడ ఎవరు సీఎంగా ఉన్నా పెత్తనమంతా హస్తిన‌ పెద్దలదే అనే టాక్‌ ఆ రాష్ట్రంలో వినిపిస్తున్నది. ఈ నేపథ్యం లోనే ఎన్నికల వ్యూహంలో భాగంగా అమిత్‌ షా పాటీదార్‌ వర్గాన్ని సంతృప్తి పరచడానికే బీజేపీకి మెజారిటీ వస్తే భూపేంద్ర పటేలే తమ సీఎం అని ప్రకటించారని అనుకుంటున్నారు.