కేసీఆర్‌ వద్ద పైసల్లేవనడం వెనుక!.. వ్యూహాత్మక ప్రచారమా?

పాపం.. బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ వద్ద పైసల్లేవట! లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకు నిధులెట్లా? అని మథనపడుతున్నారట!

  • By: Somu    latest    Jan 27, 2024 10:33 AM IST
కేసీఆర్‌ వద్ద పైసల్లేవనడం వెనుక!.. వ్యూహాత్మక ప్రచారమా?
  • దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు ఫండింగ్‌ చేస్తానన్నారని గతంలో ప్రచారం
  • అలాంటి కేసీఆర్‌ వద్ద ఒక్క అసెంబ్లీ ఎన్నికకే బొక్కసం ఖాళీ అయిందా?

విధాత: పాపం.. బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ వద్ద పైసల్లేవట! లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకు నిధులెట్లా? అని మథనపడుతున్నారట! ఈ మాట సాదాసీదా వ్యక్తులో.. పార్టీ నాయకులో అంటే అంత సీరియస్‌గా తీసుకునేవారు కాదేమోగానీ.. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక అగ్రగామి పత్రికాధిపతి స్వీయ పలుకులో చెప్పడంతో ఆ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తికర చర్చలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్‌ కుటుంబం వేల కోట్ల దోపిడికీ పాల్పడిందని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మి బీఆరెస్‌ను ఓడించారా? లేక పదేళ్ల బీఆరెస్‌ పాలనపై తీరుపై ఆగ్రహంతో కాంగ్రెస్‌ను గెలిపించారా? అనే చర్చ వేరేది. అయితే.. కేసీఆర్‌ వద్ద పైసల్లేవన్న రాతలు సహజంగానే ప్రజల్లో, రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తి రేపాయి.

బీఆరెస్‌ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు, ల్యాండ్‌.. సాండ్‌, మైన్స్‌, వైన్స్‌ దందాలతో కేసీఆర్‌ కుటుంబం పెద్ద ఎత్తున దోచుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మంతా ఏమైపోయిందనేది ఒక అనుమానం. జాతీయ స్థాయిలో తన నాయకత్వాన్ని అంగీకరిస్తే భాగస్వామ్య పార్టీలన్నింటికీ తానే ఫండింగ్‌ చేస్తానంటూ కేసీఆర్‌ చెప్పారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అలాంటి కేసీఆర్‌ దగ్గర ఒక్క అసెంబ్లీ ఎన్నికలకే పైసలు అయిపోవడమేంటనేది మరో అనుమానం.

అవినీతి సొమ్ము ఏమైందీ…

2001 ఏప్రిల్‌ 27న ఏర్పడిన టీఆర్‌ఎస్‌ (ప్రస్తుత బీఆరెస్‌) రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్‌ 2వరకు కూడా ఉద్యమ నిర్వహణ పేరుతో రకరకాల రూపాల్లో భారీగానే ఉద్యమాభిమానుల నుంచి విరాళాలు సేకరించిందని చెబుతారు. అటు తర్వాత వరుసగా స్వరాష్ట్రంలో పదేళ్లపాటు అధికార పార్టీగా ఉన్న అవకాశానికి తోడు ప్రశ్నించలేని బలహీన ప్రతిపక్షాల నిర్వాకం.. ఉద్యమనేతగా తిరుగులేని గుత్తాధిపత్యం వంటి అదనపు అవకాశాల నేపథ్యంలో అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం.. సీతారామ వంటి ప్రాజెక్టులతోపాటు.. మిషన్‌ భగీరథ.. ధరణి వంటి వాటితో వేలకోట్ల అవినీతికి కేసీఆర్‌ ప్రభుత్వం పాల్పడిందని కాంగ్రెస్‌, బీజేపీ నిత్యం ఆరోపణలు గుప్పిస్తూ వచ్చాయి. విజిలెన్స్‌, జ్యుడిషియల్‌ విచారణలకు సిద్ధమవుతూ.. తిన్నదంతా కక్కిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్‌ దగ్గర పైసల్లేవని కీలక వ్యక్తి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

సంపన్న ప్రాంతీయ పార్టీల్లో నంబర్‌ వన్‌!

దేశంలోని ప్రాంతీయ పార్టీలలో అత్యంత ధనిక పార్టీ బీఆరెస్‌ అనే చెబుతారు. ఈ విషయం ఎన్నికల సంఘం అధికారికంగా వెలువరించిన జగమెరిగిన సత్యం. దేశంలోని వివిధ పార్టీలు సమర్పించిన యాన్యువల్ ఆడిట్ అకౌంట్స్, విరాళాలు, ఆదాయంలో వచ్చిన మార్పుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తన వెబ్‌సైట్‌లో ఏటా పొందుపరుస్తుంటుంది. ఇందులో బీఆరెస్‌ సమర్పించిన వివరాల మేరకే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.683 కోట్ల విరాళాలు ఆ పార్టీకి లభించాయి. వీటిలో రూ.529 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. అంతకుముందు ఏడాది ఆ పార్టీకి రూ.193 కోట్ల విరాళాలు రాగా, వాటిలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు మాత్రమే లభించాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా చూస్తే బీఆరెస్‌కు గత ఏడాదితో పోల్చితే భారీగా విరాళాలు పెరిగాయి. ‘ఎందుకు పెరగవు! బంగారు తెలంగాణ బంగారు పార్టీకి అధికారంలో ఉన్నన్నినాళ్లు కుక్కను కొట్టినా పైసలు రాలే పరిస్థితి. కోట్లకు కోట్లు విరాళాల వెల్లువ. కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, సినిమావాళ్ళు, వ్యాపారులు.. గిట్ల ఎవ్వరైనా సరే మనోళ్లు అడిగితే ఇచ్చుడే.. ఇయ్యకుంటే ఎట్లుంటాదో ఎరికే కదా! మళ్ళీ సినిమా వాళ్లను డ్రగ్స్ కేసులు వెంటాడుతయ్.. పరిశ్రమల మీదకు రూల్స్.. నిబంధనలు దాడి చేస్తయ్‌..’ అని సీనియర్‌ పాత్రికేయుడు ఒకరు వ్యాఖ్యానించారు. ‘జాతీయ స్థాయిలో బీఆరెస్‌ తర్వాత ఉన్న రెండో సంపన్న ప్రాంతీయ పార్టీ డీఎంకే ఆదాయం 192 కోట్లు మాత్రమే. అగో..గంత సంపన్నవంతమైన పార్టీకి అధినేత, నిన్నమొన్న సీఎం కుర్చీ దిగిపోయిన పెద్దాయన దగ్గర అకస్మాత్తుగా పైసల్లేవంటే నమ్మేదెట్లా?’ అని ఆయన ప్రశ్నించారు. పైసల్లేకపోతే కేసీఆర్ తన ఆధీనంలోని టీవీ చానల్‌, పేపర్‌ను ఎలా నడిపిస్తారన్నది మరో ప్రశ్నగా ఎదురవుతుంది.

గన్ని పైసల్‌.. ఒక్క ఎన్నికకే ఎట్లయిపాయే

పదేళ్ల అవినీతి సంపాదనతో కేసీఆర్‌ పోగేసిన వేలకోట్ల రూపాయలు అనంత పద్మనాభస్వామి ఆలయం రహస్య గదులను తలపించే ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బొంద తీసి పెట్టరా? లేక హవాలా రూపంలో విదేశాలకు పంపించి దివాలా తీశారా? అన్నది చిదంబర రహస్యంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిటింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వడం వెనుక కూడా ఆర్థిక కోణం ఉందనే అభిప్రాయాన్ని ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యక్తం చేశారు. ‘అధికారంలో ఉండగానే.. సీఎం హోదాలో ఉన్నప్పుడే కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. కొత్త అభ్యర్థులైతే వారికి డబ్బు సర్దాల్సి వచ్చేది. సిటింగ్‌లైతే ఇప్పటికే వారు దందాలతో పోగేసుకున్నవి సరిపోతాయి.


అందుకే జనం వద్దనుకున్న సిటింగ్‌లనే మళ్లీ పందెం కోళ్లుగా బరిలో దింపి భారీ ఎత్తున గెలుపు కోసం ఖర్చు చేశారు’ అని ఆయన చెప్పారు. ఉద్యమ పార్టీగా, అధికార పార్టీకి నేతగా, సీఎంగా సంపాదించిన సొమ్మంతా ఒక్క ఎన్నికకే ఖర్చయిపోయాయనుకుందామంటే వరుసగా రెండు అసెంబ్లీ, రెండు లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిపక్షంలో ఉండి ఎదుర్కొన్న తమ పరిస్థితి ఎలా ఉండాలని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తన నాయకత్వానికి జై కొడితే దేశంలోని పార్టీలకు తానే ఫండింగ్‌ చేస్తానన్న కేసీఆర్‌ వద్దనే గిప్పుడు పార్టీని నడపనీకి స్వల్ప వ్యవధిలో పైసల్లేకుండా పోయాయని చెప్పడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదొక వ్యూహాత్మక ప్రచార ఎత్తుగడ అయి ఉండే అవకాశాలూ ఉన్నాయని చెబుతున్నారు.

పైసల్లేకపోతే కూల్చేదెట్లా? విచారణలు చేస్తే ఒరిగేదేంటి?

నిజంగా చిలక పలుకు చెప్పినట్లుగా కేసీఆర్‌ వద్ద పైసల్లేవ్‌ అనుకుందామంటే ఆయన పరివారం చెప్పినట్లుగా తాము తలుచుకుంటే కాంగ్రెస్‌ కూలిపోతుందన్న హెచ్చరికల్లో ఆంతర్యమేమిటన్నది మరో ప్రశ్నగా మిగిలింది. పైసల్లేని కేసీఆర్‌ అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా చీల్చుతారు? రేపు లోక్‌సభ ఎన్నికల్లో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఎలా గెలుపు దిశగా నడిపిస్తారన్నది మిలియన డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక అటు వేల కోట్ల అవినీతి చేసిండన్న ఆరోపణలతో మరిన్ని కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి విజిలెన్స్‌లు, జ్యూడిషియల్‌ విచారణ కమిటీలు వేయించి మేం చేయించే విచారణల సంగతేమిటన్న ప్రశ్న అధికార కాంగ్రెస్‌ను వేధిస్తుంది. కేసీఆర్‌ హయాంలో హెచ్‌ఎండీఏలో పనిచేసిన ఒక్క సైనికుడి వద్దనే ఏసీబీ దాడుల్లో వందల కోట్ల అక్రమాస్తులు పట్టుబడితే ఇక రాజు గారి ఇంట్లో ఎన్ని వేల కోట్లు ఉండాలోనని మేం ఆలోచిస్తుంటే పైసల్లేవంటూ ఆ కథనాలు ఏమిటని మరికొందరు నొసళ్లు నొక్కుకుంటున్నారు. మొత్తం మీద స్వీయ పలుకులో ఆ పత్రికా దిగ్గజం తను నిన్నటి దాకా వ్యతిరేకించిన కేసీఆర్‌ వద్ద పైసల్లేవంటూ చేసిన ముక్తాయింపు వెనుక మర్మమేమిటన్న ప్రశ్న వారిని బేతాళ ప్రశ్నలా వేధిస్తుందన్నది నిర్వివాదాంశం.