భగవద్గీత: భగవంతుడికి ప్రియభక్తుడు ఎవరు?
భగవద్గీత మనకు నిత్య జీవితంలో ఏవిధంగా ఉపయోగపడుతుంది. వేటిని ఆచరిస్తే జీవన సాగరాన్ని సునాయాసంగా దాటగలుగుతాం. గీతలో చెప్పినట్టు భగవంతుడికి ప్రియభక్తుడు ఎవరు? ఎలా ఉంటాడు..? ఏవిధంగా జీవిస్తాడు? ప్రియభక్తుడు ఎలా అయ్యాడు? విధాత: శ్రద్ధగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడని గీతాచార్యుడు చెప్తున్నాడు. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానం', 'సంశయాత్మ వినశ్యతి' అని గీత లోని రెండు శ్లోకాల గురించి చెప్తూ ఉంటాడు. అంటే అధ్యాత్మిక జ్ఞానానికైనా, లౌకిక జ్ఞానానికైనా శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధతో ఏదైనా సాధించవచ్చని […]

భగవద్గీత మనకు నిత్య జీవితంలో ఏవిధంగా ఉపయోగపడుతుంది. వేటిని ఆచరిస్తే జీవన సాగరాన్ని సునాయాసంగా దాటగలుగుతాం. గీతలో చెప్పినట్టు భగవంతుడికి ప్రియభక్తుడు ఎవరు? ఎలా ఉంటాడు..? ఏవిధంగా జీవిస్తాడు? ప్రియభక్తుడు ఎలా అయ్యాడు?
విధాత: శ్రద్ధగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడని గీతాచార్యుడు చెప్తున్నాడు. ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’, ‘సంశయాత్మ వినశ్యతి’ అని గీత లోని రెండు శ్లోకాల గురించి చెప్తూ ఉంటాడు. అంటే అధ్యాత్మిక జ్ఞానానికైనా, లౌకిక జ్ఞానానికైనా శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్ధాసక్తులు లేనివాడు అప్రియుడు.
శ్రద్ధతో నచికేతుడు ఆత్మజ్ఞానాన్ని, ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించారని పురాణాలు చెప్తున్నాయి. ప్రస్తుత సమాజంలో కూడా ఎంతో మంది చిన్న పెద్దా తేడా లేకుండా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అందుకు వారికున్న శ్రద్ధా ఆసక్తులే కారణం.
ఇక కొంతమంది ఉంటారు, పని ప్రారంభించకముందే సందేహాలు.. అనుమానాల ఊబిలో కూరుకుపోతారు. ‘సంశయాత్మా వినశ్యతి’ సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ధి సాధించలేరు. ఏ పనిని పూర్తి చేయలేరు. గురువు చెప్పే ప్రతీ మాట పై, దైవంపై నమ్మకం, శ్రద్ధ ఉన్న వారే ప్రతీది సాధించి తీరుతారు. కావున సంశయాలు, సందేహాలను పక్కనపెట్టి కార్యాన్ని చేపట్టి పూర్తి చేయాలి. అలాంటి వారు భగవంతుడికి దగ్గరగా ఉంటారు.
‘అద్వేష్టా సర్వభూతానాం’ ఏ ప్రాణినీ ద్వేషించవద్దు. ‘అనుద్వేగకరం వాక్యం’. ఎవరినీ మాటలతో బాధపెట్టవద్దు. తనను బాధించే, ఇబ్బందిపెట్టే పనిని, మాటలను ఇతరుల మీద ప్రయోగించకుండా ఉండగలిగే వారు ఉత్తములు అంటుంది గీత. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే సమస్త జీవరాశిని ప్రేమించాలంటున్నాడు గీతాచార్యుడు.
‘సంతుష్టస్సతతం’ ఎల్లప్పడూ తృప్తిగా ఉండాలి. ‘సమశ్చత్రౌచ మిత్రేచ’ శత్రువులను, మిత్రులను ఒకే విధంగా చూడాలి. ప్రతిఒక్కరి జీవితం ఆనందమయమే. కానీ ఎదుటివారి జీవన విధానాన్నిఆచరించే ప్రయత్నం చేసి తన ఆనందానికి తానే దూరమవుతున్నాడు. ప్రేమను చూపేవారు మిత్రులని, ద్వేషం చూపే వారు శత్రువులని భ్రమిస్తుంటారు. అలా కాకుండా ఉన్నదానితో తృప్తిగా జీవిస్తూ, అందరినీ సమాన భావంతో చూసే పరిణతి అలవర్చుకోవాలి.
సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండాలి. ఈ లక్షణాలతో జీవించే వారే నాకు ప్రియమైన భక్తులు అని శ్రీకృష్ణభగవానుడు గీత ద్వారా సమస్త మానవాళికి బోధించాడు.
ఈ లక్షణాలకనుగుణంగా జీవించే వారందరూ భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఒక్క అగ్గిపుల్లతో అగ్గి రాజేసి వంట అంతా పూర్తి చేస్తాం. అలాగే భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని చదివి అర్థం చేసుకొని.. ఆచరిస్తే క్రమక్రమంగా సద్గుణాలన్నీ మనలో ప్రవేశించి భగవంతుడికి ప్రియమైన భక్తులం అవుతామనడంలో సందేహం లేదు.