రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది

జైపూర్ : ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించని విధంగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్న సీనియర్లను అధిష్టానం పక్కన పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మను బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల నిర్వహించిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ నియోజకవర్గం నుంచి శర్మ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భజన్ లాల్ శర్మ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన బీజేపీ సీనియర్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే సీఎం రేసులో వసుంధర రాజే, గజేంద్ర షెకావత్, మహంత్ బాలాకాంత్, దియా కుమారి, అనిత భదేల్, మంజు బఘ్‌మర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఉన్నారు. కానీ చివరికి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన భజన్ లాల్ శర్మకు సీఎం పదవి వరించింది. అయితే.. రాష్ట్ర నాయకత్వం తనకు పోటీగా ఉండకూడదన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పదవికి భజన్‌లాల్ శర్మ పేరును మోదీ ప్రతిపాదించి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోనూ పాత నాయకులకు అవకాశం కల్పించని విషయం గమనార్హం.