అద్వానీకి భారత రత్న అనుచితం: సీపీఐ నారాయణ

బీజేపీ సీనీయర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు

అద్వానీకి భారత రత్న అనుచితం: సీపీఐ  నారాయణ

విధాత : బీజేపీ సీనీయర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. జైల్లో ఉండాల్సిన ఆయనకు భారతరత్న ఇవ్వడమేంటని ప్రశ్నించారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో అడ్వానీ ముద్దాయిగా కూడా ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ప్రకటించి, దేశానికి కేంద్ర ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు.అయోధ్యలో రామమందిరం కోసం 1990లో అద్వానీ చేపట్టిన రథయాత్ర దేశంలో మతకల్లోహాలు సృష్టించిందని విమర్శించారు. ఆ ఘర్షణల్లో ఎందరో ప్రాణాలు కోల్పోవడంతో పాటు వందలాది మంది గాయాలపాలయ్యారని గుర్తు చేశారు.

ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో పోటీ చేయడం సరైంది కాదని నారాయణ అభిప్రాయపడ్డారు. రాహుల్ పోటీ చేసేందుకు దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయని, ఇండియా కూటమిలో ఉన్న పార్టీల స్థానాల్లో ఆయన పోటీ చేయాలనుకోవడం మంచిది కాదని హితవు పలికారు. ఇండియా కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. ఇక త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ దేశవ్యాప్తంగా 30 నుంచి 35 స్థానాల్లో పోటీ చేస్తుందని వివరణ ఇచ్చారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే, దేశానికి విపత్తు వచ్చినట్టేనన్నారు. రాజ్యంగ, ప్రజాస్వామిక వ్యవస్థల మనుగడ ప్రమాదంలో పడి నియంతృత్వ పాలన పెచ్చరిల్లుతుందన్నారు.