విధాత: గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో పరిస్థితులు ఏవిధంగా మారాయి? ప్రజలు ఈ భూమి పరిపాలనలో ఏ విధమైన మార్పులు కావాలని కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు భూమి సునీల్ ఆధ్వర్యంలో తెలంగాణ భూమి కారవాన్-2 (Bhoomi caravan-2) సోమవారం రంగారెడ్డి జిల్లా యాచారం నుంచి ప్రారంభమైంది.
రైతులకు వారి వ్యవసాయ అవసరాలలో ఎప్పుడు చట్టాలతో అవసరం ఏర్పడుతుంది? అనే విషయాలు వివరించేందుకు కారవాన్ నిర్వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమంలో సునీల్, కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరుప్ రెడ్డి, సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి, అడ్వకేట్ జీవన్ రెడ్డి, మల్లేష్, అభిలాష్ రెడ్డి, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నుండి కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, 2014లో తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రమంతటా పర్యటించి, తెలంగాణ ప్రజల అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రజల భూమి మ్యానిఫెస్టో తయారు చేశామని చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ భూమి చట్టాల్లో మార్పులకు ఇది ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఇప్పుడు గడిచిన తొమ్మిదేండ్లలో పరిస్థితులు ఏ విధంగా మారాయి? ప్రజలు భూమి పరిపాలనలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు రెండో కారవాన్ నిర్వహిస్తున్నట్టు వివరించారు.
నిరుప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు భూమి సమస్యలు, చట్టాలతో ఎప్పుడు అవసరం పడుతుంది అని అధ్యయనం చేయాలంటే ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని అన్నారు. ఈ కారవాన్‌తో మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోదండ రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామం అయిన యాచారంలో సమస్యలను వివరించారు. భూసేకరణలో రైతులకు తగిన పరిహారం అందడం లేదని చెప్పారు.
తరతరాల నుంచి భూమిని సాగు చేసుకుంటున్నా.. రైతులకు బదులుగా వేరే వ్యక్తులకు నష్టపరిహారం అందుతున్నదని చెప్పారు. కౌలు భూములు, భూదాన్, ఎండోమెంట్ భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు నష్టపరిహారం అండం లేదని, బినామీలు నష్టపరిహారం పొందుతున్నారని తెలిపారు. ఇలాంటి సమస్యలు రంగారెడ్డి జిల్లాలో అధికంగా ఉన్నాయని, వాటి పరిష్కార మార్గానికి కృషి చేయాలని కోరారు.