బిలియ‌నీర్ స్థాయి నుంచి స్టార్ట‌ప్ కంపెనీ సీఈఓగా.. జాక్ మా ప్ర‌యాణం !

అలీ బాబా (Ali Baba) సంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ అధిప‌తి ప్రపంచ‌కుబేరుడు జాక్ మా (Jack Ma) కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు

బిలియ‌నీర్ స్థాయి నుంచి స్టార్ట‌ప్ కంపెనీ సీఈఓగా.. జాక్ మా ప్ర‌యాణం !

విధాత‌: అలీ బాబా (Ali Baba) సంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ అధిప‌తి ప్రపంచ‌కుబేరుడు జాక్ మా (Jack Ma) కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆయ‌న స్థాయికి అత్యంత త‌క్కువ మొత్తంతో ఒక వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. షీ జిన్‌పింగ్ నేతృత్వంలోని చైనా (China) ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో 2020 నుంచి ఆయ‌న ఆచూకీపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఆ కామెంట్ల త‌ర్వాత ఆయ‌న చాలా రోజుల పాటు మీడియాకు క‌నిపించ‌లేదు.


దీంతో చైనాలో చాలా మందిలానే ఆయ‌న కూడా అదృశ్య‌మై ఉంటార‌ని ప్ర‌పంచం భావించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆయ‌న జపాన్‌లోని ఒక యూనివ‌ర్సిటీలో విజిటింగ్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అనంత‌రం చైనాలోని హోంగ్జూలో ప‌ర్య‌టించిన ఆయ‌న ఒక పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు. ప్ర‌భుత్వ క‌నుస‌న్న‌ల్లో జ‌రిగిన ఆ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ ఇక నుంచి విద్య‌, వ్య‌వ‌సాయ రంగాల్లో తాను కృషి చేస్తాన‌ని పేర్కొన్నారు.


అందులో భాగంగానే హోంగ్జూ మా కిచెన్ ఫుడ్ అనే సంస్థ‌ను గ‌త వారం ప్రారంభించిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. సుమారు రూ.11 కోట్ల (1.4 మిలియ‌న్ డాల‌ర్స్‌)తో ఆయ‌న దీనిని మొద‌లుపెట్టార‌ని తెలుస్తోంది. ప్యాక్ చేసిన వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులను ఈ సంస్థ విక్ర‌యిస్తుంద‌ని చైనా కార్పొరేట్ డేటాబేస్ టియాంచా వెబ్‌సైట్ పేర్కొంది.


జాక్ మా కు ఫౌండేష‌న్‌కు చెందిన వ్య‌క్తులే ఈ సంస్థ‌లో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్నార‌ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ఈ సంస్థ వివ‌రాల‌ను తెలుసుకుందామ‌ని ప్ర‌య‌త్నించ‌గా జాక్ మా ఫౌండేష‌న్ నుంచి ఎవ‌రూ అందుబాటులోకి రాలేద‌ని బ్లూమ్‌బ‌ర్గ్ వెల్ల‌డించింది. ప్ర‌పంచ బిలియ‌నీర్ల‌లో ఒక‌రిగా ఉంటూ స్ఫూర్తివంతంగా ఉండే జాక్ మా.. ఇప్పుడు స్టార్ట‌ప్ వ్యాపారంలోకి ప్ర‌వేశించార‌ని మార్కెట్ వ‌ర్గాలు వ్యాఖ్యానించాయి