BJP | బండి ఔట్.. కిషన్ ఇన్? ఢిల్లీ భేటీలో అధిష్ఠానం కీలక నిర్ణయం!
BJP బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై సందిగ్ధత ఢిల్లీ భేటీలో అధిష్ఠానం కీలక నిర్ణయం! నేడో, రేపో అధికారిక ప్రకటన విడుదల బీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందంపై కేంద్ర పెద్దల నుంచి గట్టి సంకేతాలు? మళ్లీ బీఆర్‌ఎస్ గెలుపునకే పని చేయాలా? బీఆర్‌ఎస్‌ను గెలిపించడమే అయితే.. బీజేపీలో సీఎం అభ్యర్థి ఎవరైతేనేం? బీజేపీలోని వలస నేతల తీవ్ర అంతర్మథనం! విధాత, హైదరాబాద్ ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించడం ఖాయమైంది. బండి స్థానంలో కిషన్‌రెడ్డిని […]

BJP
- బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై సందిగ్ధత
- ఢిల్లీ భేటీలో అధిష్ఠానం కీలక నిర్ణయం!
- నేడో, రేపో అధికారిక ప్రకటన విడుదల
- బీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందంపై
- కేంద్ర పెద్దల నుంచి గట్టి సంకేతాలు?
- మళ్లీ బీఆర్‌ఎస్ గెలుపునకే పని చేయాలా?
- బీఆర్‌ఎస్‌ను గెలిపించడమే అయితే.. బీజేపీలో సీఎం అభ్యర్థి ఎవరైతేనేం?
- బీజేపీలోని వలస నేతల తీవ్ర అంతర్మథనం!
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించడం ఖాయమైంది. బండి స్థానంలో కిషన్‌రెడ్డిని నియమించాలని బీజేపీ అధిష్ఠానం శనివారం ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీలో నిర్ణయించిందని విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ బీజేపీలో అసమ్మతి, దాని నివారణకు చర్యలపై విస్తృతంగా చర్చించిన బీజేపీ పెద్దలు.. బండి సంజయ్ సేవలను జాతీయ స్థాయిలో వాడుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
త్వరలో నిర్వహించే కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో బండి సంజయ్‌ను తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పుపై నేడో, రేపో అధిష్ఠానం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
సీఎం అభ్యర్థిపై సందిగ్ధత…
రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిపై దాదాపుగా నిర్ణయం తీసుకున్న అధిష్ఠానం.. సీఎం అభ్యర్థి ప్రకటనపై దాగుడుమూతలు కొనసాగిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. అయితే బీఆర్ ఎస్‌లో వెలమలు, కాంగ్రెస్‌లో రెడ్డి లేదా దళితులు సీఎం పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీ వర్గాల నుంచి సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తే బాగుంటుందనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తున్నది.
తీవ్ర అంతర్మథనంలో వలస నేతలు
ఈటల రాజేందర్ వంటి పలువురు నేతలు బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. మరి కొందరు కాంగ్రెస్ నుంచి వచ్చి చేరారు. బీఆర్ ఎస్‌పైన, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన ఉన్న కోపంతోనే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. గత కొంతకాలంగా బీజేపీ, బీఆర్ ఎస్ మధ్య రహస్య అవగాహన ఉన్నదనే వార్తలు గుప్పుమన్నాయి.
ఈ అవగాహన రానున్న ఎన్నికల్లో కూడా ఉంటుందని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు బలమైన సంకేతాలు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదే ఇప్పుడు బీజేపీలోని వలస నేతలను అంతర్మథనంలోకి నెట్టినట్టు చెబుతున్నారు.
బీఆర్‌ఎస్ నుంచి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
వీళ్లందరి లక్ష్యం కేసీఆర్‌ను ఎదుర్కోవడం అయినప్పుడు బీఆర్ ఎస్‌తో లోపాయికారి ఒప్పందం వలన తమ లక్ష్యం నెరవేరేదెలాగని అంతర్మథనం చెందుతున్నారని తెలుస్తున్నది. ఇన్నాళ్లు కేసీఆర్‌ను వ్యతిరేకించి, ఇప్పుడు బీఆర్ ఎస్ గెలుపుకోసం పనిచేయాలా? అని మధన పడుతున్నారని సమాచారం.
బీసీ ముఖ్యమంత్రి నినాదంతో పార్టీలోని బీసీలు వేరే పార్టీవైపు చూడరని అధిష్ఠానం భావించినా.. అసలు ముఖ్యమంత్రే బీజేపీ నుంచి ఉండనప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతేనేమన్న అభిప్రాయాలు తమ సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇది కంటి తుడుపు చర్య వంటిదేనని అంటున్నారని సమాచారం.
ఎన్నికలపై ప్రధానంగా చర్చ…
త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల ముఖ్య నాయకులతో బీజేపీ పెద్దలు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు సంస్థాగత అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. ఇందులో ప్రధానంగా తెలంగాణలో బీజేపీ నాయకత్వ మార్పు, సీఎం అభ్యర్థి, కేంద్ర క్యాబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలి? అనే అంశాలపై చర్చించినట్లు సమాచారం.