కాంగ్రెస్ అసమ్మతి నేతలకు బీజేపీ గాలం.. పట్టించుకోని కాంగ్రెస్ హై కమాండ్!
రేపటి మీటింగ్‌లో తేలనున్న సీనియర్ల కార్యాచరణ విధాత: టీపీసీసీ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసి సేవ్ కాంగ్రెస్ పేరుతో రచ్చకెక్కిన కాంగ్రెస్ సీనియర్లను బీజేపీలోకి ఆహ్వానిస్తూ ఆ పార్టీ నేతలు సంప్రదింపులకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. రేవంత్ హఠావో.. కాంగ్రెస్ బచావో అంటున్న కాంగ్రెస్ సీనియర్లు నిన్న రేవంత్ నాయకత్వంలో జరిగిన పీసీసీ, పీఏసీ సమావేశాలకు సైతం డుమ్మా కొట్టి తమ అసమ్మతి తీవ్రతను చాటినప్పటికీ కాంగ్రెస్ హైమాండ్ నుండి ఇంకా బుజ్జగింపులు కరువవ్వడం […]

రేపటి మీటింగ్‌లో తేలనున్న సీనియర్ల కార్యాచరణ
విధాత: టీపీసీసీ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసి సేవ్ కాంగ్రెస్ పేరుతో రచ్చకెక్కిన కాంగ్రెస్ సీనియర్లను బీజేపీలోకి ఆహ్వానిస్తూ ఆ పార్టీ నేతలు సంప్రదింపులకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. రేవంత్ హఠావో.. కాంగ్రెస్ బచావో అంటున్న కాంగ్రెస్ సీనియర్లు నిన్న రేవంత్ నాయకత్వంలో జరిగిన పీసీసీ, పీఏసీ సమావేశాలకు సైతం డుమ్మా కొట్టి తమ అసమ్మతి తీవ్రతను చాటినప్పటికీ కాంగ్రెస్ హైమాండ్ నుండి ఇంకా బుజ్జగింపులు కరువవ్వడం సీనియర్లను మరింత అసహనానికి గురిచేస్తుంది.
కేవలం ఏఐసీసీ సెక్రటరీ నదింషా మాత్రమే సీనియర్లతో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నా ఆయన ఫోన్లు ఎత్తకుండా, అందుబాటులో లేకుండా పోయారు. ఇదే మంచి తరుణమన్నట్లుగా బీజేపీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ సీనియర్లతో టచ్‌లోకి వెళ్లడంతో ఈ వరుస పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయోనన్న ఆసక్తి నెలకొంది. బీజేపీ నేతలు మాజీ మంత్రి డీకే. అరుణ ,ఈటెల, రాజగోపాల్ రెడ్డిలు కాంగ్రెస్ సీనియర్లతో సంప్రదింపులు చేసి బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లుగా రెండు పార్టీల వర్గాల్లో ప్రచారం జోరందుకుంది.
ప్రధాని మోడీ, అమిత్ షా లు తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఫోకస్ పెట్టిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో అధికార సాధనకు పార్టీకి అవసరమైన బలం పెంచే దిశగా కాంగ్రెస్ సీనియర్లను పార్టీలోకి రప్పించేందుకు బీజేపీ నాయకత్వం తెర వెనుక ప్రయత్నాలు ఉదృతం చేసింది. కాంగ్రెస్ సీనియర్లు బీజేపీలోకి వస్తే జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వారికి టికెట్లు, ఇతరత్రా అంశాలకు సంబంధించి అన్ని హామీలు ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం వెనకడటం లేదని తెలుస్తుంది.
రేపటి సమావేశంలో తేలనున్న సీనియర్ల కార్యచరణ
రేవంత్ నాయకత్వంపై తీవ్ర అగ్రహంతో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు విషయమై రేపు మహేశ్వర్ రెడ్డి ఇంట్లో మరోసారి భేటీ కానుండగా ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. రేవంత్ ప్రకటించిన పీసీసీ, పీఏసీ కమిటీల పట్ల తాము లేవనెత్తిన అభ్యంతరాలపై రేవంత్ స్వయంగా వివరణ దిశగా సంప్రదించక పోగా తన వర్గీయుల రాజీనామాలతో కౌంటర్ ఎటాక్ చేస్తూ తీవ్ర విమర్శలకు దిగడంపై రేపటి భేటీలో సీనియర్లు చర్చించనున్నారు.
పార్టీలోనే ఉండి పోరాడాలని సీనియర్లు భావిస్తున్నప్పటికీ అధిష్టానం పట్టించు కోకపోతే ఏం చేయాలన్న దానిపై కూడా ఈ భేటీలో సీనియర్లు తేల్చుకోనున్నారు. హైకమాండ్ తమను నిర్లక్ష్యం చేస్తే రాజకీయంగా తమ స్ట్రాటజీ మార్చుకునేందుకు వెనుకాడవద్దన్న ఆలోచన కూడా సీనియర్లు ఆలోచన చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది.
బీజేపీ నుంచి అందుతున్న ఆహ్వానం పట్ల కొంతమంది సీనియర్లు మొగ్గు చూపే అవకాశం లేక పోలేదన్న ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ సీనియర్ల అసమ్మతి పరిణామాలను అందిపుచ్చుకొని వారిని బీజేపీలోకి రప్పించేందుకు ఆ పార్టీ నాయకత్వం సాగిస్తున్న ఆపరేషన్ కమలం ఎంత మేరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాల్సి ఉంది.