బీజేపీకి.. బీహార్‌ కులగణన తలనొప్పి

  • By: Somu    latest    Oct 03, 2023 10:36 AM IST
బీజేపీకి.. బీహార్‌ కులగణన తలనొప్పి
  • 2024 ఎన్నికల్లో పొత్తులే ఎన్డీయేకు దిక్కు!
  • అగ్రవర్ణాల ఓట్లపై ఆధారపడలేని పరిస్థితి
  • మెజార్టీ ఓబీసీల ఓట్లే విజయంలో కీలకం


పాట్నా : బీహార్‌ కులగణన లెక్కల చిత్రం చూస్తుంటే.. బీజేపీ తన సొంత బలంపై ఆధారపడి అద్భుతాలు సృష్టించే పరిస్థితి కనిపించడం లేదు. అగ్రవర్ణాల ఓట్లు గట్టెక్కిస్తాయనే వాతావణం కూడా లేదు. అంతేకాదు.. బీసీలకు జనాభా దామాషాలో రాజకీయ, ఆర్థిక అవకాశాలు కూడా కల్పించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.


బీహార్‌ కుల గణన వివరాలను పరిశీలిస్తే ఓబీసీలు 63శాతం ఉన్నారు. అగ్రవర్ణాలను పక్కనపెడితే.. ఓబీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలు అంతా కలిపి 85శాతం ఉన్నారు. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో బీహార్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా పొత్తులు పెట్టుకుని, సమిష్టిగా ఎన్నికల బరిలోకి దిగాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీని గెలిపించడానికి మోదీ చాలు అనే ఆశలు కూడా పనిచేసే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు.


బీహార్‌లో 40 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 పనితీరును మరోసారి ప్రదర్శించాలని బీజేపీ ఆశతో ఉన్నది. అయితే అప్పట్లో బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ ఎన్డీలో ఉన్నారు. దానితోపాటు రాంవిలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ కూడా భాగస్వామిగా ఉన్న పరిస్థితిలో ఎన్డీయేకు 39 స్థానాలు లభించాయి.


అయితే.. మారిన పరిస్థితుల్లో బీజేపీ కొత్త వ్యూహాన్ని అనుసరించాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు. బీహార్‌ కులగణ ప్రభావం రాబోయే ఎన్నికలపై గణనీయంగా ఉండబోతున్నదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీహార్‌ బీజేపీ చీఫ్‌ సమ్రత్‌చౌదరి ఆచితూచి స్పందించారు. ‘మేం మొదట ఆ నివేదికను సమగ్రంగా అధ్యయనం చేస్తాం. ఆ తర్వాత దానిపై విధాపరమైన ప్రకటన విడుదల చేస్తాం’ అని ఆయన తెలిపారు.


ప్రస్తుతానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్రమంత్రి అమిత్‌షా తదితరులతో సంప్రదింపులు జరుపుతున్నది. బీసీలు, ఎంబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్‌ కోటాలోనే సబ్‌ కోటా అంశంపై రోహిణి కమిషన్‌ సిఫార్సులకు సంబంధించి కేంద్ర నాయకత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ ఇరుకున పడటం బీహార్‌లోని జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌, మూడు వామపక్ష పార్టీలతో కూడి మహాకూటమికి కలిసొచ్చే అంశమని పరిశీలకులు చెబుతున్నారు.


బీహార్‌లో ఎంఐఎం నుంచికూడా సమస్య ఉన్నది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఆరు స్థానాల్లో విజయం సాధించింది. అందులో ఐదుగురు తర్వాత ఆర్జేడీలో చేరిపోయారు. అయినప్పటికీ.. ముస్లిం ఓటర్లలో ఎంఐఎం గణనీయ ప్రభావం చూపొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో బీహార్‌లో పూర్వ వైభవానికి బీజేపీకి అంత సులభమేమీ కాదని చెబుతున్నారు. అందుకే వికాస్‌శీల్ ఇన్సాన్‌ పార్టీ వంటి ఇతర చిన్న పార్టీలను ఎన్డీయేవైపు తిప్పుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.


ఈ పార్టీ అధినేత ముకేశ్‌ సాహానీ సామాజిక వర్గ గ్రూపులైన కేవాట్స్‌ (పడవలు నడిపేవారు), మల్లాహ్‌లు (మత్స్యకారులు) వంటివాటిని ఆకర్షించాల్సి ఉంటుందని చెబుతున్నారు. బీజేపీ సహజంగానే కూటమిలో ఆధిక్య భావాన్ని ప్రదర్శిస్తుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. దానిని పక్కనపెట్టి.. తన భాగస్వామ్య పార్టీలతో సయోధ్యతో మెలగాల్సి ఉంటుందని అంటున్నారు. మోదీయే గెలిపిస్తాడని, మిగిలిన అన్ని భాగస్వామ్య పార్టీలు డమ్మీలేననే భావనలో ఉండే బీజేపీ ఆ భావనలను తొలగించుకుంటుందా? అని సందేహమే!