BJP | వారసుల కోసం నేతల పాట్లు
BJP తీవ్ర యత్నాల్లో డీకే అరుణ, జితేందర్‌రెడ్డి అసెంబ్లీ మెట్లెక్కించేందుకు మంత్రాంగం కూతురు అసెంబ్లీకి వెళితే.. ఎంపీగా అరుణ! కుమారుడికి టికెట్ జితేందర్ టార్గెట్ తర్వాతే తన భత్ అంటున్న మాజీ ఎంపీ విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్, ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు బీజేపీ నేతలు తమ వారసులను రాజకీయ వేదికను ఎక్కించేoదుకు తీవ్ర ప్రయత్నాలు. మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తమ వారసులను అసెంబ్లీ […]

BJP
- తీవ్ర యత్నాల్లో డీకే అరుణ, జితేందర్‌రెడ్డి
- అసెంబ్లీ మెట్లెక్కించేందుకు మంత్రాంగం
- కూతురు అసెంబ్లీకి వెళితే.. ఎంపీగా అరుణ!
- కుమారుడికి టికెట్ జితేందర్ టార్గెట్
- తర్వాతే తన భత్ అంటున్న మాజీ ఎంపీ
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్, ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు బీజేపీ నేతలు తమ వారసులను రాజకీయ వేదికను ఎక్కించేoదుకు తీవ్ర ప్రయత్నాలు. మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తమ వారసులను అసెంబ్లీ మెట్లు ఎక్కించేoదుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు వేదికల్లో ఈ విషయాన్ని ప్రకటించారు. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కూతురు స్నిగ్ధ రెడ్డిని బీజేపీ నుంచి బరిలో ఉంచాలని అరుణ యోచిస్తున్నారు.
గతంలో గద్వాల నియోజకవర్గంలో అరుణ ఎదురు లేని నాయకురాలిగా ఎదిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాoలో మంత్రిగా పనిచేసి, నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ప్రశంసలు కూడా పొందారు. ఒకప్పుడు గద్వాల కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ఇక్కడ బలమైన నేతగా డీకే సమరసింహారెడ్డి ఉన్న సమయంలో అరుణ ఇక్కడి నుంచే తన రాజకీయ కెరీర్‌ను ప్రారంభించారు. తన భర్త డీకే భరత్ సింహారెడ్డి అండతో నియోజకవర్గంలో పట్టు సాధించారు.
చివరకు తన బావ సమరసింహారెడ్డి రాజకీయ జీవితాన్ని ఛిద్రంచేసి, గద్వాలలో తిరుగు లేని నేత సమరసింహారెడ్డి రాజకీయాన్ని పునాదులు లేకుండా చేసిన ఘనత అరుణకే దక్కిందని చెబుతుంటారు. అప్పటి నుంచి తిరుగు లేని నాయకురాలిగా గద్వాలలో ఎదిగిన అరుణ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. అనంతరం ఆమె బీజేపీలో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. రాజకీయoగా ఎంతో అనుభవం ఉండటంతో బీజేపీ అధినాయకత్వం ఆమెకు బీజేపీ జాతీయ నాయకురాలిగా గుర్తింపునిచ్చింది. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేస్తున్నారు.
తనయ కోసం..
బీజేపీలో మంచి గుర్తింపు ఉన్న నాయకురాలిగా ఎదిగిన డీకే అరుణ తన వారసత్వాన్ని రాజకీయాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తన కూతురు స్నిగ్ధ రెడ్డిని రాజకీయాలకు పరిచయం చేయబోతున్నారు. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో దింపాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేతలకు ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం.
తనయుడి కోసం..
బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన వారసుడు మిథున్ రెడ్డిని రాజకీయాల్లోకి తెస్తున్నారు. షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీలో ఉంచాలని ఆయన భావిస్తున్నారు. 2014 లో బీఆఎస్ నుంచి మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రాజకీయ ఉద్ధండుడు, కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తమ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్ రెడ్డిని ఓడించిన ఘనత జితేందర్ రెడ్డి దక్కించుకున్నారు. జైపాల్ రెడ్డి పై విజయంతో బీఆరెస్‌లోనూ మంచి గుర్తింపు వచ్చింది. అనివార్య కారణాల వల్ల 2018 లో బీఆరెస్ నుంచి టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురై.. బీజేపీ లో చేరారు.
అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందింది. అయినా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో బీజేపీ తరఫున చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొంటూ నేనున్నానని కార్యకర్తలకు భరోసా ఇస్తున్న జితేందర్ రెడ్డి.. ప్రస్తుతం షాద్ నగర్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారు. ఇక్కడ తన కుమారుడు మిథున్ రెడ్డిని రాజకీయ వారసునిగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
వారసులకు టికెట్ వస్తే ..
డీకే అరుణ, జితేందర్ రెడ్డి అనుకున్న విధంగా తమ వారసులకు టికెట్ వస్తే వీరిద్దరి రాజకీయ భవిష్యత్తు ఏంటనే చర్చ నడుస్తున్నది. వీరిద్దరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారసుల కోసం పనిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వారసులు అసెంబ్లీకి వెళితే వీరిద్దరూ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ పడతారా? అనే చర్చ సాగుతున్నది.
డీకే అరుణ ఈ స్థానం నుంచే పోటీచేయాలని గట్టిగా భావిస్తున్నట్టు ప్రచారం కూడా ఉన్నది. ఒకవేళ జితేందర్ రెడ్డి కుమారునికి షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి టికెట్ వస్తే తన భవిష్యత్ త్వరలో ప్రకటిస్తానని అంటుంటున్నారు. ఒకానొక సమయంలో తన కుమారునికి టికెట్ వస్తే తాను ఎక్కడ పోటీ చేయబోనని జితేందర్ రెడ్డి ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచిచూడాలి