BJP | రేపు వరంగల్‌కు ప్రధాని రాక.. పర్యటనకు మూడంచెల భద్రత

BJP నోఫ్లై జోన్‌గా వరంగల్, హనుమకొండ వరంగల్ ట్రైసిటీ పూర్తి చక్రబంధం వరంగల్ చుట్టూ ట్రాఫిక్ మళ్ళింపు భారీగా బలగాల మోహరింపు మూడు దశాబ్దాల తర్వాత ప్రధాని రాక నిఘా గుప్పిట్లో ట్రై సిటీ, ట్రాఫిక్ మళ్లింపు, 144 సెక్షన్ విధింపు 27 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాట్లు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వరంగల్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల […]

  • Publish Date - July 7, 2023 / 02:40 PM IST

BJP

  • నోఫ్లై జోన్‌గా వరంగల్, హనుమకొండ
  • వరంగల్ ట్రైసిటీ పూర్తి చక్రబంధం
  • వరంగల్ చుట్టూ ట్రాఫిక్ మళ్ళింపు
  • భారీగా బలగాల మోహరింపు
  • మూడు దశాబ్దాల తర్వాత ప్రధాని రాక
  • నిఘా గుప్పిట్లో ట్రై సిటీ,
  • ట్రాఫిక్ మళ్లింపు, 144 సెక్షన్ విధింపు
  • 27 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాట్లు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వరంగల్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించే బిజెపి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

మూడు దశాబ్దాల తర్వాత వరంగల్ కు ప్రధాని వస్తున్నారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు హనుమకొండ హంటర్ రోడ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తాజాగా హాజరవుతున్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రధాన్ పర్యటనలో భాగంగా రూ. 500 కోట్లతో కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ. 5,550 కోట్ల విలువైన 176 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

ఎన్​హెచ్ 563లోని 68 కిలోమీటర్ల పొడవైన కరీంనగర్-వరంగల్ రెండు లేన్‌ల రహదారిని నాలుగు లేన్​ల ఆప్ గ్రేడేషన్ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభిస్తారు. వీటి కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రధాని రాక సందర్భంగా భారీ భద్రత

ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో కనివినీ ఎరుగని స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రధాని రాక సందర్భంగా మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా సాయుధ సిబ్బంది, పోలీసు బలగాలను మోహరించారు. సుమారు పదివేల మంది భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే వరంగల్ హనుమకొండ లో 20 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. వరంగల్ సిటీలో 144 సెక్షన్ విధించారు. శనివారం వరంగల్ నగరంతో పాటు చుట్టూరా ట్రాఫిక్ మళ్లించారు. ఒక విధంగా వరంగల్ నగరం పూర్తి పోలీసు నిఘా నేత్రం పరిధిలోకి వచ్చి చక్రబంధంలో చేరిపోయింది. ప్రధాని మోడీ పర్యటించే 27 కిలోమీటర్ల పరిధిలో విస్తృత ఏర్పాటు చేపట్టారు.

వరంగల్ హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పటేల్, ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషా ఏర్పాట్లు పర్యవేక్షించారు. హెలిపాడ్ ఏర్పాటు చేసిన మామునూరు అక్కడి నుంచి భద్రకాళి దేవాలయం వరకు, సభ నిర్వహించే హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ వరకు రోడ్లు ఇరువైపులా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. సభకు వచ్చే జనం కోసం పార్కింగ్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో సభ ఏర్పాట్లు, భద్రత చర్యలను పర్యవేక్షించారు.

పోలీసుల గట్టి భద్రత చర్యలు

మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అడిషనల్ డిజిపి విజయ్ అధ్వర్యంలో డి.ఐ.జి, ఎస్పీలు, ఎఎస్పీ స్థాయి అధికారులతో సమీక్ష జరిపారు. ప్రధాని భద్రత కోసం తీసుకోవాల్సిన ముందుస్తు చర్యలు, హెలిప్యాడ్, రోడ్డుబందోబస్తు, భద్రకాళి దేవాలయం, బహిరంగ సభల వద్ద ఏర్పాటు చేయాల్చి భద్రత, విధులపై అడిషినల్ డిజి సూచనలు చేశారు. డిఐజిలు సత్యనారాయణ రెడ్డి, రమేష్‌నాయుడు, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎస్పీలు, ట్రైనీ ఐ.పి.ఎస్ లు పాల్గొన్నారు.

భద్రతలో బలగాల భాగస్వామ్యం

ప్రధాని పర్యటన సందర్భంగా ఇద్దరు డిఐజిలు, వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు 12 మంది ఎస్పీలు, 25 మంది ఆదనపు ఎస్పీలు , 85 మంది ఏసీపీలు, 150 మంది సీఐలు , 600 మంది ఎస్సైలతో పాటు కానిస్టేబుల్స్ విధులలో ఉండునున్నారు. మోదీకి ఎస్పీజీలు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సివిల్ పోలీస్ తో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటన

ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లో గగనతలాన్ని నో ప్లై జోన్ ప్రకటిస్తూ వరంగల్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 8తారీకు వరకు వరంగల్, హనుమకొండ నగరానికి 20 కిలో మీటర్ల వ్యాసార్థంలో గగనతలాన్ని నో ప్లై జోన్ గా ప్రకటించారు. డ్రోన్, రిమోట్ కంట్రోల్తో పనిచేసే మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్, పారాగ్లైడర్ లాంటివి ఎగరవేయడం పూర్తిగా నిషేధించారు.