BJP
విధాత: కర్ణాటక ఎన్నికల దెబ్బతో షాక్ లోకి వెళ్ళిపోయిన బిజెపి.. ఇప్పుడిప్పుడే తేరుకుని పార్టీని స్టెబిలైజ్ చేస్తోంది. రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తోంది. ఇప్పటికే కేంద్రంలో ఉన్న మంత్రులను రాష్ట్రాల అధ్యక్షులుగా పంపుతూ.. కొత్తవారిని కేబినెట్లోకి తీసుకుంటోంది. అందులో భాగంగా ఆంధ్రాలో బిజెపికి కనీస ప్రాతినిధ్యం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న సోము వీర్రాజును తప్పించి కొత్తగా పురందేశ్వరిని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం పురందేశ్వరి పార్టీ జాతీయ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వాస్తవానికి పురంధేశ్వరి 2004లో బాపట్ల నుంచి దగ్గుబాటి రామానాయుడ్ని ఓడించి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు . ఆ తరువాత 2009లో సైతం విశాఖ నుంచి పోటీ చేసి కేంద్రంలో మానవ వనరుల మంత్రిగా పని చేసారు. ఆ తరువాత ఆమె 2014లో విశాఖలో ఓడిపోయారు. ఆ తరువాత ఆంధ్రాలో కాంగ్రెస్ కు లైఫ్ లేదు.. మునిగిపోతున్న ఓడ అని తెలుసుకుని బీజేపీలో చేరారు.
కానీ ఈ పదేళ్లలో ఆమెకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. మొత్తానికి ఇప్పటికి ఆమెకు పార్టీ జాతీయ అధ్యక్ష పదవి దక్కింది. వాస్తవానికి ఈ పదవికి కడప జిల్లాకు చెందిన సత్యకుమార్ కు కానీ టిడిపి నుంచి బిజెపిలోకి చేరిన సుజనా చౌదరికి కానీ పదవి ఇస్తారని పుకార్లు వచ్చాయి.
అయితే అధిష్టానం అనూహ్యంగా ఎన్టీయార్ కుమార్తెను ఈ పదవికి ఎంపిక చేసి కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు, అంతకు ముందు ఉన్న కన్నా లక్ష్మి నారాయణ.. ఈ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. ఇక పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారని అంటున్నారు.