అత్య‌ధికంగా బాండ్లు కొన్న‌ది ఈ సంస్థ‌లే..

ఎలక్టోర‌ల్‌ బాండ్ల విషయంలో బీజేపీ అత్య‌ధికంగా రూ. 6 వేల కోట్లు తీసుకొని మొద‌టి స్థానంలో ఉన్న‌ట్లు ఎస్బీఐ వెల్ల‌డించింది.

అత్య‌ధికంగా బాండ్లు కొన్న‌ది ఈ సంస్థ‌లే..

విధాత‌: ఎలక్టోర‌ల్‌ బాండ్ల విషయంలో బీజేపీ అత్య‌ధికంగా రూ. 6 వేల కోట్లు తీసుకొని మొద‌టి స్థానంలో ఉన్న‌ట్లు ఎస్బీఐ వెల్ల‌డించింది. బీజేపీకి పూర్తిగా 487 మంది దాత‌లు 6వేల 60 కోట్ల రూపాయ‌లు ముడుపులు చెల్లించ‌గా అందులో ప‌ది మంది చెల్లించిందే 35 శాతం అంటే 2119 కోట్లు. ఈ భారీ న‌గ‌దు మొత్తం 2019 ఏప్రిల్‌లోనే బీజేపీ ఖాతాలో ప‌డ్డాయి. బీజేపీ తరువాత టీఎంసీ పార్టీకి రూ. 1610 కోట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి రూ. 1422 కోట్లు అందాయి. అయితే ఈ సమాచారన్ని ఇవ్వ‌కుండా ఉండ‌టానికి ఎస్బీఐ నిరాక‌రించ‌డంతో ఈ విష‌యంలో సుప్రీం జోక్యం చేసుకొని వెంట‌నే స‌మాచారం ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది.


అయితే జూన్ 30 లోపు వెల్ల‌డిస్తామ‌ని ఎస్బీఐ చెప్ప‌డంతో సుప్రీం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీంతో గురువారం ఎట్ట‌కేల‌కు ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ వివ‌రాలు వెల్ల‌డించింది. ఎస్బీఐ వెల్ల‌డించిన వివ‌రాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిశీలించి అవ‌గాహ‌న మేర‌కు పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టించింది. అయితే ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీంను దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఫిబ్ర‌వ‌రి 15న రద్దు చేస్తూ చారిత్రాత్మక తీర్పు వెల్ల‌డించింది. ఇది చ‌ట్ట వ్య‌తిరేక‌మైన చందా వ‌సూళ్ల ప‌ద్ధ‌త‌ని పేర్కొన్న‌ది.


బాండ్ల కొనుగోలు విష‌యంలో అత్యంత ఎక్కువ‌గా ఫీచ‌ర్ గేమ్స్ అండ్ హోట‌ల్ స‌ర్వీసెస్ లిమిటెడ్ వాళ్లు బీజేపీకి రూ. 1368 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 542 కోట్లు, డీఎంకే పార్టీకి రూ. 503 కోట్లు ముడుపులు అందించి మొద‌టి స్థానంలో ఉండ‌గా మెఘా గ్రూప్ రూ. 1192 కోట్లు కొనుగోలు చేసింది. ఇందులో స‌గానికంటే ఎక్కువ‌గా బీజేపీ తీసుకోగా కాంగ్రెస్ పార్టీకి రూ. 110 కోట్లు చెల్లించింది.