Rahul Gandhi | BJP, RSSలు.. భవిష్యత్తు గురించి మాట్లాడలేవు: రాహుల్ గాంధీ
వెనక అద్దాన్ని చూస్తూ కారు నడిపే డ్రైవర్‌లా మోదీ పాలన అమెరికా పర్యటనలో రాహుల్ ధ్వజం ఒడిశా ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వంపై విసుర్లు విధాత: ఎప్పుడూ గతం గురించే మాట్లాడుతూ భవిష్యత్తును పట్టించుకోరంటూ బీజేపీ, ఆరెస్సెస్ లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విరుచుకు పడ్డారు. భారత్ అనే కారును నడుపుతున్న మోదీ.. ఎప్పుడూ అద్దంలో వెనక ఏం జరిగిందో చూస్తుండటం వల్లే ఆ కారు ప్రమాదానికి గురవుతోందని వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న […]

- వెనక అద్దాన్ని చూస్తూ కారు నడిపే డ్రైవర్‌లా మోదీ పాలన
- అమెరికా పర్యటనలో రాహుల్ ధ్వజం
- ఒడిశా ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వంపై విసుర్లు
విధాత: ఎప్పుడూ గతం గురించే మాట్లాడుతూ భవిష్యత్తును పట్టించుకోరంటూ బీజేపీ, ఆరెస్సెస్ లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విరుచుకు పడ్డారు. భారత్ అనే కారును నడుపుతున్న మోదీ.. ఎప్పుడూ అద్దంలో వెనక ఏం జరిగిందో చూస్తుండటం వల్లే ఆ కారు ప్రమాదానికి గురవుతోందని వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఇక్కడి జావిట్స్ సెంటర్‌లో ప్రసంగించారు. ముందుగా ఒడిశా రైలు ప్రమాద ఘటనలో అశువులు బాసిన వారికి సంతాపంగా 60 సెకన్ల పాటు మౌనం పాటించారు.
అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అధికారంలో ఉండగ ఒక రైలు ప్రమాదం జరగడం నాకు గుర్తుంది. అప్పుడు మేము బ్రిటిష్ వాళ్లది తప్పని వాదించలేదు. మా రైల్వే మంత్రే బాధ్యత తీసుకుని రాజీనామా చేశారు. ఇప్పుడు ఇదే మన దేశంలో సమస్య. సవాళ్లను గుర్తించకుండా, వాటిని ఎదుర్కోకుండా సాకులు వెతుకుతున్నారు’ అని విమర్శించారు. ప్రస్తుత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, ఆరెస్సెస్‌లకు భవిష్యత్తు గురించి ఆలోచించడం రాదని రాహుల్ దుయ్యబట్టారు. ఆరెస్సెస్, బీజేపీ చెప్పింది ఎప్పుడు విందామన్నా.. వారు ఎప్పుడూ చరిత్ర గురించే మాట్లాడతారని, భవిష్యత్తు గురించి మాట్లాడరని అన్నారు. ఇప్పుడు భారత్‌లో రెండు భావజాలాల మధ్య ఘర్షణ ఉందని.. ఒకదానికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుంటే.. మరో దానికి బీజేపీ, ఆరెస్సెస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్నారు. సులువుగా చెప్పాలంటే.. మహాత్మాగాంధీ భావజాలానికి, గాడ్సే భావజాలానికి జరిగే పోరాటమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను రాహుల్ పొగడ్తలతో ముంచెత్తారు. వారి అణకువ, కష్టపడేతత్వమే అమెరికాలో వారి విజయానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. సత్యం కోసం పోరాడే నైజం వల్లే ఇంత మంది ఈ సదస్సుకు వచ్చారని ప్రశంసించారు. ఈ క్రమంలో గాంధీ సహా ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులను రాహుల్ ఎన్ఆర్ఐలుగా పిలిచారు.
‘స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహాత్మా గాంధీ ఒక ఎన్ఆర్ఐ. భారత స్వాతంత్య్ర ఉద్యమం ముందు దక్షిణాఫ్రికాలో ప్రారంభమై తర్వాత ఇండియాలోకి ప్రవేశించింది. ఆయనే కాదు.. జవహర్ లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్.. అందరూ ఎన్ ఆర్ ఐ లే’నని రాహుల్ పేర్కొన్నారు.