BJP | అంతర్మథనం.. బీజేపీ వలస నేతలు ఉక్కిరి బిక్కిరి!
BJP | Telangana కేసీఆర్‌పై పంతంతోనే బీజేపీలో చేరిన నేతలు వారందరి ఏకైక లక్ష్యం కేసీఆర్‌ను ఓడించడం ఆ మేరకు పుంజుకోలేకపోతున్న రాష్ట్ర బీజేపీ బీఆర్‌ఎస్‌తో స్నేహంపై నేతల్లో అనుమానాలు వాటికి ఆజ్యం పోస్తున్న రాజకీయ పరిణామాలు కాషాయ పార్టీలో ఊపిరి సలపని నాయకులు కేసీఆర్‌ను ఓడించే శక్తులతో చేరితేనే మేలు? పునరాలోచనలో పడిన బీజేపీ వలస నేతలు! వారంతా కేసీఆర్‌పై పగతో రగిలిపోయారు! పంతం పట్టి బీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు! బీఆర్‌ఎస్ ఓటమికోసమే బీజేపీలో చేరారు! బీజేపీ […]

BJP | Telangana
- కేసీఆర్‌పై పంతంతోనే బీజేపీలో చేరిన నేతలు
- వారందరి ఏకైక లక్ష్యం కేసీఆర్‌ను ఓడించడం
- ఆ మేరకు పుంజుకోలేకపోతున్న రాష్ట్ర బీజేపీ
- బీఆర్‌ఎస్‌తో స్నేహంపై నేతల్లో అనుమానాలు
- వాటికి ఆజ్యం పోస్తున్న రాజకీయ పరిణామాలు
- కాషాయ పార్టీలో ఊపిరి సలపని నాయకులు
- కేసీఆర్‌ను ఓడించే శక్తులతో చేరితేనే మేలు?
- పునరాలోచనలో పడిన బీజేపీ వలస నేతలు!
వారంతా కేసీఆర్‌పై పగతో రగిలిపోయారు! పంతం పట్టి బీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు! బీఆర్‌ఎస్ ఓటమికోసమే బీజేపీలో చేరారు! బీజేపీ తమను ఉద్ధరిస్తుందని నమ్మారు! కట్ చేస్తే.. సీన్ రివర్స్‌లో నడుస్తున్నదనే అనుమానాలు! బీజేపీ ఆ మేరకు పుంజుకోవడం లేదన్న సంకేతాలు! పార్టీలో లభించని ప్రాధాన్యం! అన్నింటికి మించి ఆ రెండు పార్టీల మధ్య తెరవెనుక బేరసారాలు నడుస్తున్నాయన్న ప్రచారాలు! ఫలితం బీజేపీలోని వలస నేతల ఉక్కిరిబిక్కిరి! దాని ఫలితమే వారి నర్మగర్భ వ్యాఖ్యలు.. తమ అశక్తతపై ప్రకటనలు! కింకర్తవ్యం? లోతైన అంతర్మథనం.. కేసీఆర్‌ను ఓడించే శక్తిని గుర్తించే ప్రయత్నం!
విధాత: కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని భావించిన నేతలు ఇప్పుడా పరిస్థితి కనిపించక పోవడంతో ఏమి చేయాలో తేల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాష్రంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, డీకే అరుణ మొదలు, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గడ్డం వివేక్ వెంకస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితర నేతలంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీలోచేరారు.
ఆ నాడు ఈ నేతలంతా కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకే ఉందని భావించారు. ఈటల రాజేందర్ తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరారు. అంతేకాదు.. నేరుగా కేసీఆర్‌ను ఢీకొని ఘన విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలోచేరారు. ఇలా ఈ నేతలంతా కేసీఆర్‌ను నిలువరించేది ఒక్క బీజేపీనే అని భావించి ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.
అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కేసీఆర్‌ను నిలువరించే శక్తి రాష్ట్రంలో బీజేపీకి లేదని ఈ నేతలకు బోధపడుతున్నదని వారిని దగ్గరగా పరిశీలిస్తున్న వారు అంటున్నారు. అనుకున్నంత స్థాయిలో బలాన్ని కూడదీసుకోలేక పోవడం కూడా వారిని పునరాలోచనలో పడేసిందని సమాచారం.
బండికి ‘బ్రేకులు’
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ‘పరిమితులు’ ఉన్నాయని, అందు వల్లనే పార్టీని ఇప్పుడున్న పరిస్థితి కంటే ముందుకు తీసుకుపోలేక పోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతున్నది. ఇదే సమయంలో పార్టీని ముందుకు తీసుకువెళదామని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు భావించి, దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
రాష్ట్ర అధ్యక్షుడి అనుమతి లేనిదే ఎవరూ కనీసం ప్రెస్‌కాన్ఫరెన్స్ కూడా పెట్టలేని దుస్థితి కనిపిస్తున్నదని ఒక సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాడుతుందనుకున్న పార్టీనే ఇప్పుడు తెరవెనుక అవగాహనకు వచ్చిందా? అన్న సందేహాలు ఈ నేతలను వెంటాడుతున్నట్లు తెలిసింది.
ఇటీవల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఢిల్లీలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని బీజేపీ-బీఆర్‌ఎస్ గురించి ప్రజలు అనుకుంటున్నారని, తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరని చెప్పడం అనుమానాలకు దారి తీస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
పంతంతో బయటకు.. ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి
కేసీఆర్ వద్ద అవమాన పడి, దెబ్బతిని, పంతంతో బయటకు వచ్చిన నేతలు బీజేపీ, బీఆర్‌ఎస్ దోస్తీ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీలో ఉండి ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని అంటున్నారు. ఇలా అయితే కేసీఆర్‌ను ఓడించడం ఎలా సాధ్యం అవుతుందని అనుకుంటున్నట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలందరి లక్ష్యం కేసీఆర్‌ను ఓడించడమేనని అంటున్నారు. అలాంటప్పుడు కేసీఆర్‌ను ఓడించడం బీజేపీతో సాధ్యం కానప్పుడు, అది సాధ్యమయ్యే దగ్గరికే పోవాలి కదా అనే ఒత్తిడి కూడా వారి అనుచరులు, సన్నిహితులు, కార్యకర్తల నుంచి వస్తున్నదని విశ్వసనీయంగా తెలిసింది.
బీజేపీకి వచ్చిన వలస నాయకులు కూడా మళ్లీ కేసీఆర్ గెలిస్తే తమ పరిస్థితి ఏంటని భయపడుతున్నారని సమాచారం. నిజానికి కర్ణాటక ఎన్నికల సమయంలోనే బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య రాజీ కుదిరిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడిచింది. దీంతో.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకున్న ఈ నేతలంతా డీలా పడిపోయినట్లు తెలుస్తోంది.
మరో వైపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీతో గెలువడం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ధైర్యం, ఒక ధీమా కలిగింది. పార్టీ క్యాడర్‌లో కొత్త జోష్ వచ్చింది. ఎప్పుడూ కలహించుకునే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు బహిరంగ విమర్శలు మాని, ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. తెలంగాణలో కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీ మారినప్పటికీ.. నియోజకవర్గాల వారీగా కింది స్థాయి క్యాడర్ ఇప్పటికీ చెక్కు చెదర కుండా పార్టీతోనే ఉన్నది.
అనేక సర్వేలు సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉన్నదని చెపుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ ఏ విధంగానూ బీఆర్‌ఎస్‌కు పోటీ కాబోదని, కాంగ్రెస్ ఒక్కటే బీఆర్‌ఎస్‌ను గట్టిగా ఢీకొనగలదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే బీజేపీ నేతలు అంతర్మథనంలో ఉన్నారని సమాచారం.