12 గంటలు ఏకబిగిన సాగిన బ్రహ్మంగారి నాటకం

కళలకు కాణాచిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి రోజున జరిగే శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పూర్తిస్థాయి

12 గంటలు ఏకబిగిన సాగిన బ్రహ్మంగారి నాటకం

గ్రామీణ కళలకు ఇంకా ఆదరణ

ప్రతి ఏటా క్రమం తప్పకుండా
నాటక ప్రదర్శన

తరాలుగా ఆనవాయితీ
కొనసాగిస్తున్న ఒకే కుటుంబం

విధాత బ్యూరో, కరీంనగర్: కళలకు కాణాచిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి రోజున జరిగే శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పూర్తిస్థాయి నాటకాన్ని ఈ ఏడు ఘనంగా ప్రదర్శించారు. శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ నాటకం ఆదివారం ఉదయం ఏడు గంటల వరకు ఏకబిగిన 12 గంటల పాటు కొనసాగింది. బ్రహ్మంగారి జీవిత చరిత్రలోని ప్రతి సన్నివేశాన్ని కళాకారులు కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించారు. సాంకేతిక విప్లవం అనంతరం దృశ్య శ్రవణ విభాగంలో వచ్చిన మార్పుల కారణంగా, ప్రాచీన కళలు కనుమరుగైపోతున్న క్రమంలో, రామడుగులో నిర్వహిస్తున్న బ్రహ్మంగారి నాటకానికి జనాదరణ ఏమాత్రం తగ్గిపోలేదు.

నాలుగు తరాలుగా కొనసాగుతున్న ఆచారం..

దాదాపు 70 ఏళ్ల కిందట ప్రముఖ సంగీత కళాకారుడు కీర్తిశేషులు కట్టా లక్ష్మి నరసయ్య నివాసం ముందు ఉన్న చిన్నపాటి స్థలంలో ప్రారంభమైన ఈ నాటక ప్రదర్శనకు క్రమక్రమంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో జరుగుతోంది. రామడుగుకు చెందిన కళాకారులతోపాటు, వేరువేరు ప్రాంతాలకు తరలివెళ్లి జీవనం సాగిస్తున్న నాలుగు తరాలకు చెందిన కళాకారులు ప్రతి ఏటా తప్పనిసరిగా వచ్చి ఇందులో పాల్గొని నాటకాన్ని రక్తి కట్టిస్తారు. కట్ట లక్ష్మీ నరసయ్య గారి ముగ్గురు కుమారుల్లో కట్టా సత్యనారాయణ,కట్ట నిరంజన్ ఆచారి కీర్తిశేషులు అవగా, ఆ బాధ్యతను మరో కుమారుడు తీసుకున్నారు. వృద్ధాప్యం మీద పడినా ప్రతి కళాకారునిపై శ్రద్ధ చూపించి వారిని ఈ నాటకంలోని పాత్రధారులుగా తీర్చిదిద్దుతున్నారు కట్ట నరసింహ చారి. దాదాపు నెల ముందు నుండి పూర్తిస్థాయిలో రిహార్సల్ ప్రారంభిస్తామని… కలలపై ఆదరణ తగ్గలేదనడానికి ఈ నాటక ప్రదర్శన నిదర్శనమని ఆయన అంటున్నారు.

బాల బ్రహ్మం పాత్రలో మెప్పించిన మూడవ తరగతి విద్యార్థి హిమాన్షు

అయితే ప్రతి సంవత్సరం కొత్త జనరేషన్ సైతం ఇందులో అడుగుపెడుతోంది. కరీంనగర్ లోని పారామిత పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న హిమాన్షు ఈ నాటకంలో బాల బ్రహ్మంగారి పాత్రలో జీవించి ప్రేక్షకులను మెప్పించారు. తన గాత్రం ద్వారా వారిని అలరించారు. తాతల కాలం నుండి కొనసాగుతున్న ఈ నాటకంలో పాల్గొనడం తనకి ఎంతో సంతోషంగా ఉందని అంటున్నాడు. ఏది ఏమైనా ఆధునిక కాలంలోనూ సాంప్రదాయ కలలకు జీవం పోస్తున్న వీరి కృషి నిజంగా అభినందనీయం.