సీఎం రేవంత్ రెడ్డితో బీఆరెస్ నేత టీకేఆర్.. త్వరలో కాంగ్రెస్ తీర్థం!
బీఆరెస్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్, మహేశ్వరం నియోజకర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి

విధాత : బీఆరెస్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్, మహేశ్వరం నియోజకర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపింది. తీగల రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ సహా ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డిలు కూడా అక్కడే ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని తీగల కలవడంతో ఆయన త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం మరింత బలపడింది.

బీఆరెస్ అధిష్టానం తనకు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడుగాని ఎమ్మెల్సీ ఇస్తామని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదన్న అసంతృప్తితో తీగల అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మారేందుకు సిద్దపడ్డారు. అయితే తీగతలను తన కోడలు, రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి ద్వారా అప్పట్లో కేసీఆర్, కేటీఆర్‌లు బుజ్జగించి పార్టీ మారకుండా ఆపగలిగారు.
ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో తీగల కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తున్నది. చేవెళ్ల బీఆరెస్ ఎంపీ రంజిత్‌రెడ్డితోనూ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోనూ పొసగని నేపధ్యంలో బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడమే మంచిదని తీగల భావిస్తున్నట్లుగా ప్రచరం వినిపిస్తున్నది. టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డితో, వేమిరెడ్డి నరేందర్‌రెడ్డితో ఉన్న సంబంధాల నేపధ్యంలో తీగల కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధపడినట్లుగా ప్రచారం సాగుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీట్లను గెలువకపోవడంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనైనా సికింద్రాబాద్, హైదరాబాద్, చేవేళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో పార్టీ విజయవకాశాలు మెరుగుపరుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో తీగల వంటి నేతలు పార్టీలో చేరడం అవసరమని కాంగ్రెస్ కూడా భావిస్తుంది. దీంతో తీగల త్వరలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమని చెబుతున్నారు.