సీఎం రేవంత్ రెడ్డితో బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ భేటీ
బీఆరెస్ పార్టీలో మరోసారి వలసల ప్రకంపనలు గుబులు పుట్టించాయి. ఆదివారం రాజేంద్రనగర్ బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలువడం సంచలనం రేపింది

విధాత: బీఆరెస్ పార్టీలో మరోసారి వలసల ప్రకంపనలు గుబులు పుట్టించాయి. ఆదివారం రాజేంద్రనగర్ బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలువడం సంచలనం రేపింది. రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ప్రకాశ్‌గౌడ్ ఆయనతో గంట పాటు చర్చలు జరుపుతున్నారు. ఇటీవలే ప్రకాశ్‌గౌడ్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ భేటీ అయ్యారు. ఇంతలోనే ప్రకాశ్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డిని కలవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరవచ్చని భావిస్తున్నారు. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, కే మాణిక్‌రావులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంచలనం రేపింది. వారు కాంగ్రెస్‌లో చేరే ఉద్దేశంతోనే రేవంత్‌రెడ్డిని కలిసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే వారు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఇప్పుడు ప్రకాశ్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డిని కలవడంతో మళ్లీ అదే తరహా ప్రచారం వినిపిస్తున్నది. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు గెలవని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనైనా విజయం సాధించే లక్ష్యంతో గ్రేటర్ పరిధిలోని బీఆరెస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లుగా తెలుస్తున్నది.