BRS సభతో BJP, కాంగ్రెస్ నేతలకు మతి భ్రమించింది: మంత్రి ఎర్రబెల్లి

బీజేపీ రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగితే రాజీనామా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఊహించిన దానికంటె ఎక్కువ సంఖ్యలో జనం తరలి వచ్చారని, దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మతి భ్రమించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండలో గురువారం ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్‌, వ‌రంగ‌ల్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్‌, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి […]

  • By: krs    latest    Jan 19, 2023 5:38 PM IST
BRS సభతో BJP, కాంగ్రెస్ నేతలకు మతి భ్రమించింది: మంత్రి ఎర్రబెల్లి
  • బీజేపీ రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగితే రాజీనామా
  • మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఊహించిన దానికంటె ఎక్కువ సంఖ్యలో జనం తరలి వచ్చారని, దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మతి భ్రమించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

హనుమకొండలో గురువారం ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్‌, వ‌రంగ‌ల్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్‌, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్‌, న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌, న‌గ‌ర మేయ‌ర్ గుండు సుధారాణి, కుడా చైర్మ‌న్ సుంద‌ర్ రాజ్ యాద‌వ్‌ల‌తో క‌లిసి హ‌న్మ‌కొండ ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియాతో మంత్రి మాట్లాడారు.

ఖ‌మ్మం స‌భ స‌క్సెస్‌కు కార‌కులైన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపిన మంత్రి, ఆ స‌భ అట్ట‌ర్ ఫ్లాప్ అన్న బిజెపి, కాంగ్రెస్ ల‌పై ఫైర్ అయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండి ప‌డ్డారు. ద‌మ్ముంటే అభివృద్ధిపై చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్‌ చేశారు.

ప్రతిపక్షాల్లో భయం..

ఈ సంద‌ర్భంగా ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ నిన్న ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అయింది. సభను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. వారి వెన్నులో వణుకు పుడుతుంది. దేశంలో కాంగ్రెస్ కనిపించకుండా పోయింది. ప్ర‌జ‌లు ఈ సారి బీజేపీ భరతం పట్టడం ఖాయం.

అభివృద్ధి పై చర్చకు సిద్ధమా?

దమ్ముంటే, అభివృద్ధి మీద కాంగ్రెస్‌, బిజెపిలు చ‌ర్చకు సిద్ధమా?! అంటూ ఎర్రబెల్లి ప్రశ్నించారు. మీరు దేశంలో, మీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో చేసిన, మేము తెలంగాణలో చేసిన అభివృద్ధి మీద చర్చ చేద్దామా? మిషన్ భగీరథ మీద చర్చకు వస్తారా? గ్రామాల అభివృద్ధి మీద వస్తారా? మీ ఇష్టం.

మేము దేశమంతా ఉచిత కరెంట్ ఇస్తామంటే, నీకు ఎందుకు కళ్ళ మంట? దేశంలోని దళితులకు దళిత బంధు ఇస్తామంటే మీకేమి కడుపు మంట?

విభజన హామీలు ఏమయ్యాయి?

విభజన హామీలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఎన్ని? మీరు ఎగ్గొట్టిన మా వాటా ఎంత? కంటి వెలుగుని ఆదర్శంగా తీసుకుంటామ‌ని ఖ‌మ్మం స‌భ‌లోనే పలువురు సీఎంలు ప్ర‌క‌టించారని మంత్రి అన్నారు.

బండికి మెదడులేదు..

ఎర్రబెల్లి మాట్లాడుతూ ఇంత‌కాలం బండి సంజయ్! నీకు తల మీద వెంట్రుకలే లేవు అనుకున్నాం. కానీ, నీకు తల లోపల మెదడు కూడా లేనట్లుంది. కళ్ళకు పొర‌లు క‌మ్మితే కంటి వెలుగులో పరీక్షలు చేయించుకో! ఆటకు, మాటకు తేడా తెలవని రాజకీయ బచ్చావి.

క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార స్వామి పాద‌యాత్ర‌లో ఉన్నారు. బీహార్ సీఎం బిజీగా ఉన్నారు. వాళ్ళేమైనా నీ లెక్క పనికి మాలినోళ్ళా..? కరెంటు గురించి సందేహాలు ఉంటే ఎక్కడైనా తీగను పట్టుకో అంటూ మండిపడ్డారు.

మేకిన్ ఇండియా కాదు జోకిన్ ఇండియా

కెసిఆర్ చెప్పినట్లు వంద శాతం బీజేపీ మేక్ ఇన్ ఇండియా పెద్ద జోక్ ఇన్ ఇండియానే అని ఎర్రబెల్లి విమర్శించారు. కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏమి తెచ్చాడు?

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేని వారు.. రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి చేస్తున్న కేసిఆర్ తిట్టే అర్హ‌త లేద‌న్నారు. సీఎం కెసిఆర్ విజన్ వల్లే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం అయింది. మీ వల్లే అయితే దేశంలో అన్ని గ్రామాలు తెలంగాణ లాగే ఎందుకు అభివృద్ధి చెందలేదు? అలా జ‌రిగిన‌ట్టు నిరూపిస్తే రాజీనామా చేయాడానికైనా సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

దేశంలో రైతుల‌పై కాల్పులు, ఆకలి కేకలు, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం చేయడం పై మాట్లాడాలి. దేశంలో ఏటా ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? నల్ల డబ్బు వచ్చి, ప్రజల ఖాతాల్లో 15 లక్షల చొప్పున పడ్డదా? చెప్పాలి

రేవంత్ జాగ్రత్తగా మాట్లాడు..

కాంగ్రెస్ ను ఓడించడానికి వేరే వాళ్ళు, సుపారీ లు అవసరం లేదు.. వాళ్ళ నేతలే వాళ్లకు చాలంటూ దయ్యాలు వేదాలు వల్లించినట్లు నీతులు మాట్లాడుతున్నావు. ముందు నీ పార్టీని కాపాడుకో రేవంత్‌రెడ్డి అంటూ ఎర్రబెల్లి హెచ్చరించారు. ఇక దేశంలో కాంగ్రెస్ కి కాలం చెల్లింది. బీజేపీ దేశానికి భారంగా మారింది. కాంగ్రెస్, బీజేపీలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాయి.

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కళ్ళున్న కబోదులు.
కొద్ది రోజుల్లో బీజేపీ కనుమరుగు అవుతుంద‌న్నారు. దేశంలో ఎక్క‌డా చూసినా కెసిఆర్ గురించి చర్చిస్తున్నారని అన్నారు.